స్టింగ్ ఆపరేషన్ కుమారస్వామి మెడకే చుట్టుకుందా?
x

స్టింగ్ ఆపరేషన్ కుమారస్వామి మెడకే చుట్టుకుందా?

విచారణలో కేంద్రమంత్రి ఢిల్లీ అడ్రస్ చెప్పిన నిందితుడు


Click the Play button to hear this message in audio format

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని రూపొందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ ఆపరేషన్ వీడియో కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వీడియో కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీ నివాసంలో అప్పగించినట్లు నిందితుడు పోలీసులకు చెప్పడంతో.. దర్యాప్తు ఇప్పుడు ఆయన నివాసం, సన్నిహితుల వైపు మళ్లింది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్రమంత్రి ఇంటికి..

ఈ కేసులో ఢిల్లీకి చెందిన రితేష్ పాండేను అక్టోబర్ 24న పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్ మార్కెట్‌కు వినోద్ శర్మతో కలిసి వెళ్లి మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినట్లు రితేష్ చెప్పాడు. ఆ తర్వాత కుమారస్వామి ఢిల్లీ అధికారిక నివాసంలోని సోషల్ మీడియా మేనేజర్ ప్రజ్వల్ ప్రసాద్‌కు ఆ ఫోన్‌ను అప్పగించినట్లు వెల్లడించాడు.
రితేష్ పాండే, ప్రజ్వల్ ప్రసాద్ మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజ్వల్ ప్రసాద్, వినోద్ శర్మలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా.. వారు ఇంకా పోలీసుల ఎదుట హాజరుకాలేదు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

స్టింగ్ ఆపరేషన్ లో కీలక హస్తం..

ఈ వివాదానికి సంబంధించిన వీడియో సెప్టెంబర్ 27న యూట్యూబ్ ఛానెల్‌లో బయటకు వచ్చింది. 2023లో రికార్డు చేసినట్లు చెబుతున్న ఈ వీడియోలో ఓ మహిళ.. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సిద్ధరామయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వీడియో రూపొందించారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. వీడియో ప్రచురణ, ప్రసారాన్ని అడ్డుకోవాలని సివిల్ కోర్టును కూడా కోరారు.
వీడియో బయటకు వచ్చిన వెంటనే కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారే ఈ స్టింగ్ ఆపరేషన్ వెనుక ఉన్నారని, టీవీ జర్నలిస్ట్ రాకేశ్ శెట్టి సహకారంతో దీన్ని నిర్వహించారని ఆరోపించారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడమే లక్ష్యమని విమర్శించారు. ఈ కేసులో సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే తాజా పరిణామంతో దర్యాప్తు మొత్తం కుమారస్వామి వైపు మళ్లింది. ఈ వివాదం మరోసారి కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య రాజకీయ వైరానికి కారణమైంది. అసలు ఈ వీడియోను ఎవరూ సృష్టించారు.. నిర్వహించారు.. ప్రచారం చేశారు.. ఈ ఆపరేషన్ అంతిమంగా ఎవరు ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

వీడియో ఎవరూ తీశారని...

మరోవైపు, వీడియో తయారీ, ప్రచారంలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ నేత కృపా ఆల్వా, జర్నలిస్ట్ రాకేశ్ శెట్టి పేర్లు కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చాయి. రాకేశ్ శెట్టికి ముందస్తు బెయిల్ లభించగా, ఆయన విచారణకు హాజరయ్యారు.
కృపా ఆల్వా కూడా పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చారు. ఈ వీడియో 2023 లో రికార్డ్ చేసినట్లు భావిస్తున్నారు. ఆసలు ఆపరేషన్ వదంతులు విచారించడానికి ఉద్దేశించబడిందా, ఆ సమాచారాన్ని తరువాత రాజకీయంగా నష్టపరిచే వీడియోగా మార్చారా అనే విషయాలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అయితే, తాజా పరిణామాలతో కుమారస్వామి గతంలో చేసిన ఆరోపణలపై రాజకీయంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయన నివాసానికి, అక్కడి సోషల్ మీడియా బృందానికి ఈ కేసులో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు దర్యాప్తులో వెలుగుచూస్తున్నాయి. ఇది డీకే శివకుమార్‌కు కూడా రాజకీయంగా ఎదురుదాడి చేసే అవకాశాన్ని కల్పించింది.
ఇదిలా ఉంటే, వీడియోలో చూపించిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు ఆరోపణలను నిరూపించడం లేదని, అవి కల్పితమైనవిగా కనిపిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, స్టింగ్ ఆపరేషన్‌ను ఎవరు రూపొందించారు? దానికి ఎవరు డబ్బులు సమకూర్చారు? వీడియోను ఎవరు ఎడిట్ చేసి ప్రచారంలోకి తెచ్చారు? దీని వెనుక రాజకీయ నేతల ఆదేశాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది.
ఈలోగా కుమార స్వామి కాంగ్రెస్ ప్రభుత్వం పై, పోలీసుల దర్యాప్తు పై దూకుడుగా విమర్శలు గుప్పించారు. ఆ వీడియోను రూపొందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. దానికి బదులుగా ప్రభుత్వం జేడీ(ఎస్) సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.
పార్టీ కార్యకర్తలను వేధించడం మానేసి, తనను ప్రశ్నించాలని డీకే శివకుమార్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇందులో పాలుపంచుకుంటే సీసీబీ దర్యాప్తు మొత్తం కుట్రను బయటపెట్టలేదని, ఈ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని కుమార స్వామి డిమాండ్ చేశారు.

కేసులో పురోగతి..

దర్యాప్తు అధికారులు వీడియోతో సంబంధం ఉన్న వ్యక్తులపై దృష్టి నిలిపారు. వీడియో అప్ లోడ్ చేసిన ఢిల్లీకి చెందిన రితేష్ పాండేను అక్టోబర్ 24న అరెస్ట్ చేశారు. ఇది ఈ కుట్రలో కర్ణాటక అవతల సంబంధం ఉందని నిరూపితం అయింది. స్టింగ్ వీడియోను అప్ లోడ్ చేయడంలో జేడీఎస్ కార్యకర్తల పాత్ర ఉందంటూ పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇక ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రితేష్ పాండే తన వాంగ్మూలంలో కుమారస్వామి ఢిల్లీ నివాసంలో కుట్ర జరిగిందని పేర్కొన్నారు.
కుమారస్వామి కార్యాలయానికి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా వ్యవస్థతో ప్రజ్వల్ ప్రసాద్, వినోద్ శర్మలకు సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వీరిద్దరికి నోటీసులు జారీచేసినప్పటికీ వారు ఇంకా పోలీసుల ముందు హజరుకాలేదు.

కుమారస్వామికి ఎదురుదెబ్బ..

ఈ తాజా పరిణామం కుమారస్వామిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ముఖ్యంగా పాత మైసూర్ ప్రాంతంలో ఒక్కలిగ వర్గానికి నాయకత్వం వహించేందుకు శివకుమార్ తో పోటీ పడుతున్న ఆయనపై కుమారస్వామి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ పరిస్థితి తీవ్రమైంది. శివకుమార్ కు ఈ తాజా పరిణామం తన పై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడానికి ఒక అవకాశంగా మారింది.
ప్రస్తుతానికి అరెస్టయిన నిందితుడి వాంగ్మూలంతో పాటు ఆర్థిక, డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కుమారస్వామి పాత్రపై ఇప్పుడే తుది నిర్ణయానికి రావడం సాధ్యం కాదని పోలీసు కమిషనర్ కూడా స్పష్టం చేశారు. తదుపరి విచారణ, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగానే ఈ వివాదం వెనుక అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.
Read More
Next Story