
వైఎస్ షర్మిల వియ్యపురాలు హోటల్ చట్నీస్ పై ఐటీ దాడుల కలకలం?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి వియ్యపురాలు అట్లూరి పద్మకు చెందిన చట్నీస్ సంస్థలపై ఐటీ దాడులు కలకలం సృష్టించాయి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి వియ్యపురాలు అట్లూరి పద్మకు చెందిన చట్నీస్ సంస్థలపై ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైఎస్ షర్మిల ఇటీవల తరచూ విమర్శిస్తుండడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను మోదీ తుంగలో తొక్కారని తప్పుబడుతున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ దాడులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోని చట్నీస్ హోటల్స్, దాని అనుబంధ సంస్థలలో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలించినట్టు తెలిసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ముగించుకుని వెళ్లిన రెండు రోజుల్లోపలే ఈ దాడులు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిల తన సొంత అన్న వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. చట్నీస్ హోటల్స్ కు హైదరాబాద్ లో మంచి పేరుంది. ఆహార పరిశ్రమలో చట్నీస్ కు సుదీర్ఘ అనుభవం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, అమెరికాలోని పలు రాష్ట్రాలలో కూడా ఇటీవల బాగా విస్తరించింది. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ దాడులు చేసి రికార్డులను పరిశీలించింది.
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవల పద్మజ కుమార్తె ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి జైపూర్ లో ధూమ్ ధాంగా ఫిబ్రవరి 17న జరిగింది. ఈ డెస్టినేషన్ పెళ్లికి విజయమ్మ సహా పలువురు బంధువులు హాజరైనా వైఎస్ జగన్ దంపతులు హాజరు కాలేదు. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులపై అటు ఆదాయపన్ను శాఖ గాని ఇటు చట్నీస్ యాజమాన్యం గాని ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
హైదరాబాద్ లోని మేఘనా ఫుడ్స్ లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మేఘనా ఫుడ్స్‌కు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో బ్రాంచీలు ఉన్నాయి. 'చట్నీస్', మేఘనా ఫుడ్స్‌లో తనిఖీలకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకురాలేదు.


