‘‘కరూర్ నుంచి పారిపోయింది మీరే.. కాదు మీరే’’
x
సీఎం విజయ్

‘‘కరూర్ నుంచి పారిపోయింది మీరే.. కాదు మీరే’’

సీఎం విజయ్ ప్రసంగంపై అన్నాడీఎంకే, డీఎంకే విమర్శలు


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్ లో అప్పటి టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగిన దాదాపు పది నెలలకు సీఎం హోదాలో మరోసారి విజయ్ ఇక్కడకు వచ్చారు.

బాధితులకు స్మారకాన్ని నిర్మిస్తామనే హమీతో పాటు, వారికి ప్రభుత్వ ఉద్యోగాల నియమాక పత్రాలను అందజేశారు. అయితే ఈ సందర్భంగా సీఎం చేసిన ప్రసంగం రాజకీయ మలుపు తీసుకుంది. ప్రతిపక్ష ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)పై ఆయన చేసిన తీవ్ర విమర్శలు, డీఎంకే ఆల్-ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)ల నుంచి తక్షణ ప్రతిదాడికి దారితీశాయి.


తన ప్రభుత్వం ఈ విషాదాన్ని నిర్వహించిన తీరును సమర్థించుకున్నారు. గత ఏడాది నిర్వహించిన ఎన్నికల ర్యాలీలు అప్పటి ప్రభుత్వం సరిగా హ్యండిల్ చేయలేకపోయిందని డీఎంకే పై విజయ్ విమర్శలు గుప్పించారు. 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం డీఎంకే, పోలీసులే అని నిందించారు. అయితే కరూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ముందు ఆయన చేసిన ప్రసంగం రాజకీయ రంగు పులుముకుంది.
మాజీ ఏఐఏడీఎంకే మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో, కరూర్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. తమిళనాడులో మొత్తం ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదో మిని సంగ్రామంగా పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్ష డీఎంకే నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనితో ఉప ఎన్నికలు తమిళ పార్టీలకు కీలకంగా మారాయి.

డీఎంకే విమర్శలు..

విజయ్ తన తీవ్రమైన విమర్శలలో కొన్నింటిని సీనియర్ డీఎంకే నాయకుడు, కరూర్ మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి వి. సెంథిల్ బాలాజీపై సంధించారు. ఆయన నిరంతరం విచారణ నుంచి "పలాయనం" చేస్తున్నాడని ఎగతాళి చేశారు. విచారణలతో డీఎంకే అసౌకర్యంగా భావించిందనడానికి తన ప్రభుత్వం తీసుకుంటున్న అవినీతి నిరోధక చర్యలే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చేసిన "పలాయనం" వ్యాఖ్య, బాలాజీ నిందితుడిగా ఉన్న రూ. 35 కోట్ల ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును ఉద్దేశించి చేసినట్లుగా భావించారు. అయితే విజయ్ కరూర్ ప్రసంగానికి ముందే, మద్రాస్ హైకోర్టు బాలాజీకి ప్రతిరోజూ పోలీసులకు హాజరు కావాలనే షరతుతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తొక్కిసలాట బాధితుల కుటుంబాల కోసం చేసిన సంక్షేమ ప్రకటనలను మరుగున పడేస్తూ, ఆ రాజకీయ దాడి త్వరగా ఆ కార్యక్రమంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఉప ఎన్నికల కోసంమే ఈ ఆరోపణలు..

సీఎం చేసిన విమర్శలపై సెంథిల్ బాలాజీ కూడా ఎదురుదాడికి దిగారు. కరూర్ తొక్కిసలాట తరువాత విజయ్ బాధితులను వదిలేసి పారిపోయారని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించడానికి గాయపడిన వారికి వైద్య చికిత్స అందేలా చూడటానికి డీఎంకే అధినేత కరూర్ కు హుటాహుటిన వెళ్లారని, ఆయన విజయ్ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చర్యలతో పోల్చారు.
డిఎంకె అధికార ప్రతినిధి టికెఎస్ ఎలాంగోవన్ కూడా విజయ్ ఆరోపణలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. "ఒక కుటుంబానికి ఏకైక పోషకుడు మరణిస్తే, ఆ కుటుంబానికి సాయం చేయడం సమర్థనీయం. కానీ ఇది వేరు. కరూర్ ఉప ఎన్నిక సమీపిస్తుండగా, ఇది ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం" అని ఎలాంగోవన్ అన్నారు.
డిఎంకె, ఏఐఏడిఎంకె కలిసి పనిచేస్తున్నాయన్న విజయ్ ఆరోపణను ఎలాంగోవన్ తోసిపుచ్చారు. ఆ రెండు పార్టీలు ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయని గుర్తు చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీ అనేది ఉప ఎన్నికకు ముందు ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని కూడా ఆయన అభివర్ణించారు.

కనిమొళి స్పందన..

విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ, పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి స్పందించారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కొనసాగిస్తోందని, ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఆ దుర్ఘటన సమయంలో ప్రజలను ఎవరు వదిలేశారు, ఎవరు అండగా నిలిచారు అని కనిమొళి ప్రశ్నించారు. దీనికి సమాధానం ప్రజలకు ఇప్పటికే తెలుసని ఆమె అన్నారు.
టీవీకే మంత్రులు పాఠశాలలను సందర్శించడంపై కూడా ఆమె విమర్శలు చేశారు. వారు అనవసరంగా విద్యార్థులకు ఆటంకం కలిగించారని అన్నారు. "కొంతకాలంగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్తూ, ప్రజలకు అనవసర సమస్యలు సృష్టిస్తున్నారు. వారు పాఠశాలల్లోకి కూడా ప్రవేశించి, పిల్లలకు ఆందోళన కలిగిస్తూ, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. తొక్కిసలాట సమయంలో కూడా, తమకు ఎవరు అండగా నిలిచారు, ఎవరు తమను వదిలి పారిపోయారో ప్రజలు స్పష్టంగా చూశారు," అని డీఎంకే నాయకురాలు అన్నారు.

అన్నాడీఎంకే విమర్శలు..

ఇటీవల తమ సభ్యులలో చాలామంది టీవీకేలో చేరిన ఏఐఏడీఎంకే, విజయ్ ప్రసంగాన్ని కూడా తీవ్రంగా విమర్శించింది. కరూర్ దుర్ఘటనకు క్షమాపణ చెప్పని ముఖ్యమంత్రి, ప్రతిపక్షంపై అవినీతి ఆరోపణలు ఎలా చేయగలరని ప్రశ్నించింది. కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు నిజానిజాలను నిరూపిస్తుందని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఆశించే సంయమనాన్ని విజయ్ వ్యాఖ్యలు ప్రతిబింబించలేదని ఆ పార్టీ వాదించింది.
ఈ విమర్శల వల్ల, ఈ సమస్యను ముఖ్యమంత్రి నిర్వహించిన తీరును ప్రశ్నించడంలో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి.

ఉప ఎన్నికపై దృష్టి

ఇటీవల టీవీకేలో చేరిన విజయభాస్కర్ రాజీనామా తర్వాత కరూర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. శుక్రవారం (జూలై 10) జరిగిన ర్యాలీలో, విజయభాస్కర్ విజయ్‌తో వేదికను పంచుకుని, ఆయనకు లాంఛనప్రాయంగా ఒక కత్తిని బహూకరించి, తమిళనాడులో టీవీకేకు "శాశ్వత పాలన" వస్తుందని జోస్యం చెప్పారు.
Read More
Next Story