
రిజర్వేషన్ల పెంపును కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
50 శాతం గరిష్ట పరిమితిని దాటిందని వెల్లడి
కర్ణాటకలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) రిజర్వేషన్ల పెంపును హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీలకు 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 3 నుంచి 7 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ 2022లో తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటి 56 శాతానికి చేరడమే ఈ తీర్పునకు ప్రధాన కారణంగా పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ కేఎస్ హేమలేఖతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడం రాజ్యాంగంలోని 14, 15 అధికరణాలకు విరుద్ధమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన చట్టంలోని నాలుగో సెక్షన్ను కూడా రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది.
ఇది రాజ్యాంగంలోని 14, 16 అధికరణాలను ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. డాక్టర్ అంబేడ్కర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్రా ఒక పిటిషన్ దాఖలు చేశారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలికలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ముగ్గురు సివిల్ ఇంజినీరింగ్ పట్టభద్రులు మరో పిటిషన్ వేశారు. రిజర్వేషన్ల పెంపు చట్టాన్ని అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
గవర్నర్ 2023 జనవరి 11న ఆమోదం తెలపగా, మరుసటి రోజు కర్ణాటక గెజిట్లో ప్రచురించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యంపై నాగమోహన్ దాస్ కమిషన్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ బీ. ఆది నేతృత్వంలోని కమిటీ సహా పలు నివేదికలు ఈ చట్టానికి ఆధారంగా నిలిచాయి.
అయితే, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని 1992లో ఇంద్ర సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ పరిమితిని మించడానికి అసాధారణ పరిస్థితులు ఉన్నాయని నిరూపించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జీ. పరమేశ్వర స్పందిస్తూ, సామాజిక న్యాయం, విద్యావకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే పరిణామంగా అభివర్ణించారు.
న్యాయవ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను గౌరవిస్తూనే, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కర్ణాటకకు సంబంధించిన రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంతో సహా అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో, కొనసాగుతున్న నియామకాలు, విద్యావకాశాలకు చట్టప్రకారం రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. తదుపరి పరిణామాలు రాష్ట్రంలో రిజర్వేషన్ల విధానంపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
Next Story

