
మారువేషంలో కర్ణాటక బస్సులో ప్రయాణిస్తున్న మంత్రి బైరతి సురేష్
‘‘బస్సు ఎక్కింది మంత్రి అని తెలియక దిగిపొమ్మన్నాడు’’
కర్ణాటక రవాణా శాఖ మంత్రి సురేష్ కు వింత అనుభవాలు
కర్ణాటక రవాణా శాఖ మంత్రికి ఆర్టీసీ బస్సులో వింత అనుభవాలు ఎదురయ్యాయి. ప్రజల బాధలు స్వయంగా తెలుసుకోవడానికి మంత్రి బైరతి సురేష్ స్వయంగా బీఎంటీసీ బస్సు ఎక్కాడు. హెబ్బాల్- నాగశెట్టి హళ్లి మధ్య సంచరించే బస్సు ఎక్కిన మంత్రి వంద రూపాయల నోటు తీసి కండక్టర్ కు ఇచ్చాడు. అయితే తన దగ్గర చిల్లర లేదని, వెంటనే బస్సు దిగిపోవాలని కండక్టర్ మంత్రి పైనే దురుసుగా ప్రవర్తించాడు. అలాగే అనేక ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలలో కూడా మంత్రికి ఇలాంటి సంఘటనలే అనేకం ఎదురయ్యాయి.
నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థను స్వయంగా అనుభవించడానికి, ఆయన శనివారం రాత్రి సాధారణ పౌరుడిలాగే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి చెందిన అనేక బస్సులలో ప్రయాణించారు. ఆయనకు అంత త్వరగా మరచిపోలేని ఒక వాస్తవ అనుభవాలు ఎదురయ్యాయి.
మంత్రికి చిల్లర లేదన్న కారణంతో బస్సు దిగిపొమ్మని చెప్పడం ఒక్కటే సంఘటన కాదు. తన రెండు గంటల సుదీర్ఘ పర్యటనలో, సురేష్ 10కి పైగా BMTC బస్సులను ఎక్కి, ప్రయాణికులు రోజూ ఎదుర్కొనే అనేక సంఘటనలను ప్రత్యక్షంగా చూశారు.
ఫన్ వరల్డ్ స్టాప్‌లో దిగడానికి ఒక ప్రయాణికుడు డోర్ దగ్గర నిలుచున్నప్పటికీ డ్రైవర్ అక్కడ బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. దీనితో వెంటనే బస్సు కండక్టర్, డ్రైవర్ ఇద్దరిని సస్పెండ్ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. బస్సులే కాకుండా, ఒక ఆటో డ్రైవర్ ప్రయాణికుడిని మోసం చేయడానికి ప్రయత్నించడాన్ని కూడా మంత్రి చూశారు.
నాగశెట్టిహళ్లిలో దిగిన తర్వాత, ఛార్జీ మీటర్‌లో రూ. 30 మాత్రమే చూపిస్తుండటంతో అన్యాయంగా రూ. 36 చెల్లించడానికి నిరాకరించిన ప్రయాణికుడితో ఆటోరిక్షా డ్రైవర్ వాదిస్తుండటాన్ని సురేష్ చూశారని సమాచారం. మంత్రి జోక్యం చేసుకున్న తర్వాతే డ్రైవర్ వెనక్కి తగ్గారు.
రవాణా సిబ్బంది ఇటువంటి దురుసు ప్రవర్తనలను అరికట్టడానికి బెంగళూరు వ్యాప్తంగా మరిన్ని ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ప్రకటించారు. ప్రజలతో సరైన విధంగా ప్రవర్తించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆర్టీసీ సిబ్బందిని హెచ్చరించారు.
Next Story

