మోదీ సాబ్ జరా యాద్ కరో.. చచ్చిపోయిన తల్లి రాష్ట్రం ఇదే!
x
పదేళ్ల నాటి ఫైల్ ఫోటో.. మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు

మోదీ సాబ్ జరా యాద్ కరో.. 'చచ్చిపోయిన తల్లి' రాష్ట్రం ఇదే!

పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై మాట్లాడబోతున్నారు. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారని మోదీ ఆవేళ అన్నారు. అయినా ప్రత్యేక హోదా రాలేదు..


2014 ఏప్రిల్ 22..

నరేంద్ర మోదీ అప్పటికింకా ప్రధాని కాలేదు. నేషనల్ డెమోక్రటిక్ ఎలయెన్స్- ఎన్డీఏ- కూటమిలో భాగంగా విభజనతో గాయపడి సలుపుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పర్యటనకు వచ్చారు. ఈ ఎన్నికలు (2014) అంకెలు సంఖ్యలకు (మాథ్స్) సంబంధించినవి కావు, కలివిడికి (కెమిస్ట్రీ) సంబంధించినవన్నారు. మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికను పంచుకున్నపుడు మోదీ చెప్పిన మాట అది. ‘లెక్కల పరంగా చూస్తే అది 1+1+1 ఇజికోల్ట్ 3. కానీ ఈ ఎన్నికలు కెమిస్ట్రీకి సంబంధించినవని, 1+1+1 అంటే మూడు కాదు 111 (నూట పదకొండు)’ అన్నారు మోదీ.


ఆ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. మోదీ ప్రధాని అయ్యారు. పదేళ్లు గడిచింది. ఆవేళ ఆయనతో జత కట్టిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆ కామెస్ట్రీ దెబ్బతిన్నది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. విడగొట్టే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ముఖ్యమైన హామీలు ఏవీ అమలు కాలేదు. రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు గాని, మోదీతో వేదికను పంచుకున్న పవన్ కల్యాణ్ గాని ప్రధానమంత్రిని ఇదేమి అన్యాయమని ప్రశ్నించలేదు.

2024 మార్చి 17.. మళ్లీ ఈ త్రిమూర్తులు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. ఈ సందర్భంలో ఈ త్రిమూర్తుల్లో ఇద్దరు బహుశా ఇప్పటి పాలకుడు వైఎస్ జగన్ పై విరుచుకుపడొచ్చు. మోదీ ప్రధాని హోదాలో ఉన్నారు గనుక ఆ స్థాయిలో కాకపోయినా ఏదో ఒక చురక వేయవచ్చు. చీలికతో రక్తమోడుతున్న ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఉపశమనం కల్పిస్తారనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలను వేధిస్తున్న పెద్ద ప్రశ్న. మళ్లీ పాతగాయల్నే రేపి కాంగ్రెస్ ను మోదీ తీవ్రంగా విమర్శించవచ్చు.

ఆవేళ మోదీ అన్నమాటేమిటంటే..

“కాంగ్రెస్‌ మిమ్మల్ని (రాష్ట్ర ప్రజల్ని) ఇంకా ఎంతగా అవమానిస్తుందో? మన దేశం అందించిన ఉత్తమ ప్రధానుల్లో పీవీ నరసింహారావు ఒకరు. అయినా ఆయన్ను కాంగ్రెస్ అవమానించింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేరిట ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ రావు పేరుతో ఎందుకు లేవు? ఆయన వర్ధంతిని గాంధీ వంశం నిర్వహించదు' అని మోదీ అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పాట పాడి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమని చెప్పవచ్చు. ‘మరి అదే కాంగ్రెస్ కు చెందిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా ఇస్తానని చెప్పిన ప్రత్యేక క్యాటగిరి హోదాను మోదీ మర్చిపోయారు’ అని ప్రశ్నిస్తున్నారు నాటి సభలో సభ్యునిగా ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్.

ఈ రాష్ట్రానికి దివ్య ఔషధం ప్రత్యేక హోదా అని చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సహా అందరూ అన్నవారే. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న ఇదే నరేంద్ర మోదీ ఈ పదేళ్లలో ఆ అంశంపై కనీస ప్రస్తావన కూడా చేయలేదు. మరి రేపు ఏమి చెబుతారో చూడాలి. ‘ప్రత్యేక హోదాపై నాలుక మడతేసి ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు చేతిలో పెట్టిన నరేంద్ర మోదీ ఏ మోహం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు, ఈ చంద్రబాబు ఆ ప్రధానితో ఎలా చేయిచేయీ కలిపి నడుస్తారు’ అని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు వి. శ్రీనివాసరావు (సీపీఎం), కె. రామకృష్ణ (సీపీఐ) నిలదీస్తున్నారు. ప్రధాని మంత్రి హోదాలో మోదీ ఈ దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడైనా తిరగడానికి హక్కుంది. అయితే ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా తప్పించుకునే అవకాశమైతే ఉండదు.

చనిపోయిన తల్లి కుటుంబాన్ని చూసే తీరు ఇదేనా...

“తెలంగాణ ఏర్పాటైన రోజే నేను ఆ తీరు తప్పు అని ఎత్తి చూపా. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నాను. తెలంగాణ ఏర్పాటు చేసినా తెలుగు స్ఫూర్తిని చంపేశారు. తెలుగు స్ఫూర్తిని నిజంగా పట్టించుకునే పవన్ కళ్యాణ్‌ లాంటి వాళ్లు ఎందరో ఎదగాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ఆవేళ మోదీ అన్నారు.

“ఈరోజు తెలంగాణా, సీమాంధ్రా వాళ్ళు అనాథ పిల్లలు కాబట్టి మంచి డాక్టర్ కావాలి. ఈ ఇద్దరు శిశువులను ఎవరు చూసుకోవాలి? ఢిల్లీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం సమస్యను అర్థం చేసుకుంది. విభజన ఘనత తమదని చెప్పుకునే కాంగ్రెస్‌కు తెలిసిందల్లా ప్రజా స్ఫూర్తిని హతమార్చడమే’’ అని మోదీ అన్నారు. విభజన ఘనతను చాటి చెప్పుకున్నందుకు ఒకప్పుడు ఎంతో కాంగ్రెస్ కు ఎంతో బలమైన ఆంధ్రప్రదేశ్ నామరూపాలు లేకుండా పోయింది. బీజేపీకి ఈ రాష్ట్రంలో పోయేదేమీ లేదు కాబట్టే ప్రత్యేక హోదా మొదలు విశాఖ రైల్వే జోన్ వరకు ఏదీ ఇవ్వలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్నా కేంద్రంలో ఒకే పక్షంలో ఉన్నాయి. అందువల్లే బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులన్నింటికీ ఏకపక్షంగానే మద్దతు పలికాయి. అయినప్పటికీ ప్రత్యేక హోదాను మోదీ కనికరించలేదన్న అపవాదు ఉంది.

బాబు, పవన్ నోట ఆ మాట వస్తుందా

తెలుగువారి ఆత్మగౌరవమే ముఖ్యమంటున్న పవన్ కల్యాణ్ గానీ, రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆదాయం పెంపే లక్ష్యమంటున్న చంద్రబాబు గానీ రేపు ప్రధానమంత్రి మోదీని రాష్ట్రానికి ఇస్తామన్న పథకాలు ఏమయ్యాయని అడిగే సాహసం చేస్తారో లేదో చూడాలి. అభివృద్ధి అనేది ప్రధాన అంశం. మోదీ హయాంలో మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందనే ఈ నాయక ధ్వయం రేపు మోదీ సరసన కూర్చున్నప్పుడు మాట మాత్రమైనా ప్రస్తావిస్తే ఏమి సమాధానం వస్తుందో వినాలని ఆంధ్రాప్రజలు వాంఛిస్తున్నారు.

Read More
Next Story