‘‘చక్కకొంబన్ ఆపరేషన్‌పై ఒత్తిడి వద్దు.. ఇది భారత్‌–పాక్‌ యుద్ధం కాదు’’
x

‘‘చక్కకొంబన్ ఆపరేషన్‌పై ఒత్తిడి వద్దు.. ఇది భారత్‌–పాక్‌ యుద్ధం కాదు’’

కేరళ మంత్రి షిబు బేబీ జాన్


Click the Play button to hear this message in audio format

కేరళలో ‘చక్కకొంబన్’ అనే అడవి ఏనుగును పట్టుకుని రేడియో కాలర్ అమర్చేందుకు చేపట్టిన ఆపరేషన్ మూడు రోజుల ప్రయత్నం తర్వాత కూడా ఫలించలేదు. దీంతో అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా ఆపరేషన్‌ను నిలిపివేశారు.

అయితే ఈ వ్యవహారంపై ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిపై కేరళ అటవీశాఖ మంత్రి షిబు బేబీ జాన్ స్పందించారు. ఇది భారత్‌–పాకిస్థాన్ యుద్ధం కాదని, అధికారులు ఏనుగును పట్టుకునే విషయంలో అనవసరమైన ఒత్తిడికి గురిచేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్ ప్రాంతంలో చక్కకొంబన్ అనే అడవి ఏనుగు తరచూ జనావాసాల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో స్థానిక ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు అటవీశాఖ అధికారులు ఏనుగును మత్తు మందు ఇచ్చి పట్టుకుని, దానికి రేడియో కాలర్ అమర్చాలని నిర్ణయించారు. తద్వారా ఏనుగు ఎక్కడ సంచరిస్తుందో ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయవచ్చని భావించారు.
ఈ క్రమంలో మూడు రోజుల పాటు అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆపరేషన్ విజయవంతం కాలేదు. దీంతో ప్రస్తుతానికి దానిని నిలిపివేసి, మరో సమయంలో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.

ఒత్తిడి తీసుకురావద్దు..

ఈ పరిణామాలపై మంత్రి షిబు బేబీ జాన్ మాట్లాడుతూ.. ఏనుగుకు రేడియో కాలర్ అమర్చాలని నిర్దిష్టంగా ఆ రోజే పూర్తి చేయాలనే ఆదేశాలేమీ లేవని స్పష్టం చేశారు. జంతువుకు సాధ్యమైనంత తక్కువ ఒత్తిడి కలిగేలా ఆపరేషన్ నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చామని, మూడు రోజుల ప్రయత్నాల తర్వాత వారే తాత్కాలికంగా ఆపరేషన్ నిలిపివేయాలని నిర్ణయించారని చెప్పారు. ‘‘ఇది భారత్ పాకిస్తాన్ యుద్ధం కాదు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్నవారు ఏనుగులను, అడవులను రక్షించడానికి పనిచేసే వారే. మన ప్రజల భద్రతను, ప్రాణాలను కాపడటానికి అందుబాటులో ఉన్న పరిమితుల్లో సాధ్యమైనంత వరకు వారు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
అధికారులు కూడా మనుషులేనని, ఇలాంటి ఆపరేషన్ల సమయంలో వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి కోరారు. ఏనుగులు, అడవులను కాపాడటంతో పాటు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు అధికారులు తమకు అందుబాటులో ఉన్న వనరులతో ప్రయత్నిస్తున్నారని వివరించారు.
అయితే ఏనుగును కాపాడే ప్రయత్నంలో స్థానిక ప్రజల భద్రతను కూడా విస్మరించలేమని మంత్రి స్పష్టం చేశారు. జనావాసాల మధ్యకు ఏనుగు ప్రవేశించి, పాఠశాలకు వెళ్లే చిన్నారులు దాని ఎదురుగా వస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఆలోచించాలని అన్నారు.
ఈ ఆపరేషన్ చేపట్టడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉందని మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్ నెలలోనే ఆ ప్రాంతంలో ఏనుగుల దాడుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. మనుషులకు, ఏనుగులకు మధ్య ఈ ప్రాంతంలో చాలాకాలంగా కొనసాగుతున్న సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో ఇదే ప్రాంతంలో అరికొంబన్ అనే మరో అడవి ఏనుగు వల్ల సమస్యలు తలెత్తినప్పుడు దానిని పట్టుకుని వేరే ప్రాంతానికి తరలించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. అప్పుడు కూడా మొదట ఆపరేషన్ ప్రారంభించి, మధ్యలో నిలిపివేసి, తిరిగి కొనసాగించారని చెప్పారు. ఆ మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టిందని వివరించారు.
అయితే చక్కకొంబన్ విషయంలో మాత్రం ఏనుగును మరో ప్రాంతానికి తరలించకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దాని కదలికలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రస్తుత ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
‘‘ఇది సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్య. గతంలో ఇలాంటి పరిస్థితే తలెత్తినప్పుడూ అరికొంబన్ అనే మరో అడవి ఏనుగును పట్టుకుని ఈ ప్రాంతం నుంచి వేరే చోటికి తరలించారు. అరికొంబన్ పట్టుకునే ఆపరేషన్ ను మొదట ప్రారంభించి, నిలిపివేసి మళ్లీ పున: ప్రారంభించారు. ఆ మిషన్ ను పూర్తి చేయడానికి దాదాపు ఒక నెల పట్టింది’’ అని ఆయన అన్నారు.
దీని కోసం ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) ప్రకారం రేడియో కాలర్ అమర్చాలని నిర్ణయించారు. ఆపరేషన్ సమయంలో ఏనుగు నీటిలోకి వెళ్లే అవకాశం ఉందని భావించి అధికారులు ముందుగానే రెండు ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అవసరమైతే ఉపయోగించేందుకు విరుగుడు మందును కూడా అందుబాటులో ఉంచారు.
మత్తు మందు ప్రయోగించిన తర్వాత ఏనుగు నీటిలోకి వెళ్లడంతో అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం విరుగుడు మందు ఇచ్చారు. దీంతో ఏనుగు నీటిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకోగలిగిందని మంత్రి వివరించారు.తాజా సమాచారం ప్రకారం శుక్రవారం ఏ ప్రాంతంలో చక్కకొంబన్ కనిపించిందో, ఇప్పటికీ అదే పరిసరాల్లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.
మొత్తంగా చక్కకొంబన్‌ను పట్టుకునే ఆపరేషన్ తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ, ఏనుగు సంచారంతో స్థానిక ప్రజలకు ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది. అటవీశాఖ అధికారులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే ఆపరేషన్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read More
Next Story