‘‘తమిళనాడు కార్యక్రమాల్లో తమిళ గీతమే పాడాలి’’
x
సీఎం విజయ్

‘‘తమిళనాడు కార్యక్రమాల్లో తమిళ గీతమే పాడాలి’’

అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన విజయ్ సర్కార్


Click the Play button to hear this message in audio format

దేశం కంటే రాష్ట్రమే ముందు అనే వాదాన్ని అనుసరించే తమిళనాడు మరోసారి అదే విధానం కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో ఇక నుంచి తమిళ గీతమైన ‘తమిళ్ తాయ్ వాళత్తు’ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.

ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ప్రతిపక్ష డీఎంకే, ఏఐఏడీఎంకేలతో సహా పలు శాసనసభ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ కార్యక్రమాలలో ఆలపించే పాటల క్రమంలో రాష్ట్ర గీతాన్నే మొదటగా పాడాలన్న ప్రభుత్వ వైఖరిని ఈ పార్టీలు సమర్థించాయి. తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, తమిళనాడు భాషా, సాంస్కృతిక హక్కుల విషయంలో తమ 'తమిళగ వెట్రి కజగం' ప్రభుత్వం రాజీపడదని విజయ్ అన్నారు.
"తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన జీవితం, మన భావోద్వేగాలు కూడా" అని విజయ్ తన ప్రసంగంలో అన్నారు. "మాతృభాష తల్లిలాగే పవిత్రమైనది" అని ఆయన నొక్కి చెప్పారు.
"తమిళ తాయ్ వాళుత్తు పాడటం రాజకీయ వ్యవస్థకు గానీ, భారతదేశ ఐక్యతకు గానీ వ్యతిరేకం కాదు. దానికి విరుద్ధంగా, ఇది భిన్నత్వంలో ఏకత్వం అనే దేశ ఉన్నత సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. ముందుగా తమిళ తాయ్ వాళుత్తు పాడాలన్న ఈ డిమాండ్‌ను రాజకీయ చర్చగా మార్చాల్సిన అవసరం లేదు," అని ఆయన అన్నారు.
తీర్మానం ప్రకారం, తమిళనాడులోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో నిర్వహించే కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించాలి. అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతానికి ముందు జాతీయ గీతం వందేమాతరంను ఆలపించాలంటూ జనవరి 28న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు "ఖచ్చితంగా పాటించాలని" కోరిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో తమిళ 'తాయ్ వాళుత్తు'ను ఆలపించాలని నిర్దేశిస్తూ తమిళనాడు ప్రభుత్వం 1970 నవంబర్ 23న ఒక ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 12న దీనిని అధికారికంగా రాష్ట్ర గీతంగా గుర్తించి, అధికారిక కార్యక్రమాలలో ఆలపించాల్సిన పాటల వరుసలో దీనిని మొదటిదిగా ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది.
"తమిళం ప్రపంచంలోని ప్రాచీన శాస్త్రీయ భాష అని, తమిళ నాగరికత ప్రపంచంలోని పురాతన సాంస్కృతిక సంప్రదాయాలలో ఒకటి అని ఈ అసెంబ్లీ గర్వంగా నమోదు చేస్తోంది. 1891లో మనోన్మానియం సుందరనార్ రచించిన 'మనోన్మానియం' నాటకం నుంచి తీసుకున్న 'తమిళ్ తాయ్ వాళుత్తు'ను 1970 నవంబర్ 23 నుంచి ప్రభుత్వ కార్యక్రమాలలో మొదటగా ఆలపించాలి," అని తీర్మానం పేర్కొంది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలులోకి వచ్చాయని అది తెలిపింది. "దీనిని 2021 డిసెంబర్ 12 నుంచి అధికారికంగా రాష్ట్ర గీతంగా గుర్తించడం జరిగింది. తమిళనాడులోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రజా సంస్థలలో కార్యక్రమం ప్రారంభానికి ముందు 'తమిళ్ తాయ్ వాళుత్తు'ను ఆలపించాలని ఆదేశించడం జరిగింది" అని తీర్మానం ఇంకా పేర్కొంది.
ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ప్రకటిస్తూ, దీని అమలుకు ఎవరి అనుమతి అవసరం లేదని స్పీకర్ జెసిడి ప్రభాకర్ సభకు తెలియజేశారు. "ఇది అసెంబ్లీ తీర్మానం, ముఖ్యమంత్రి గళం యావత్ తమిళ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది" అని స్పీకర్ నొక్కి చెప్పారు.
Read More
Next Story