
ఈసీని నిలదీసిన సుప్రీంకోర్టు
రీకౌంటింగ్ వీడియో దొరకడం లేదని కోర్టును తెలిపిన ఎన్నికల సంఘం
కర్ణాటకలో ఎన్నికల ఫలితాలనే తలకిందులు చేసిన రీకౌంటింగ్ వ్యవహారంలో ఇప్పుడు కీలక ఆధారమే కనిపించడం లేదు. 2023లో శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల లెక్కింపు వీడియోను గుర్తించలేకపోతున్నామంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సంస్థే తన రికార్డులను భద్రపరచలేకపోతే ఎలా అని ప్రశ్నించిన న్యాయస్థానం.. మరోసారి ఇలాంటి సాకులు చెబితే అంగీకరించబోమని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ నేత టీడీ రాజెగౌడ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్దేవాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శృంగేరి నుంచి రాజెగౌడ కేవలం 201 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, బీజేపీ అభ్యర్థి డీఎన్ జీవరాజ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్పై కర్ణాటక హైకోర్టు పోస్టల్ బ్యాలెట్లను మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. ఈ రీకౌంటింగ్ తర్వాత ఫలితం మారడంతో జీవరాజ్ విజేతగా ప్రకటితమయ్యారు.
రీకౌంటింగ్ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజెగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 279 తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను మళ్లీ పరిశీలించాలని మాత్రమే ఆదేశించిందని, అయితే తనకు అనుకూలంగా ఉన్న 562 చెల్లుబాటయ్యే పోస్టల్ బ్యాలెట్లను కూడా అధికారులు తిరిగి పరిశీలించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో అసలు ఓట్ల లెక్కింపు వీడియోతో పాటు, రీకౌంటింగ్ రికార్డులు, ఎన్నికల పరిశీలకుడి నివేదికను అందించాలని కోరారు.
విచారణ సందర్భంగా ఈ రికార్డులను సమర్పించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించగా, 2023లో జరిగిన అసలు ఓట్ల లెక్కింపు వీడియోను గుర్తించలేకపోతున్నామని కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు తెలిపారు. దీనిపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎన్నికలు నిర్వహించడం, వాటికి సంబంధించిన ఆధారాలను భద్రపరచడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యతల్లో భాగమని స్పష్టం చేసింది.
తదుపరి విచారణ నాటికి అందుబాటులో ఉన్న రికార్డులు, వీడియోలను సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. లేకపోతే కమిషన్కు వ్యతిరేకంగా ప్రతికూల నిర్ధారణకు వచ్చే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. ఈ కేసును 2027 ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.
శృంగేరి ఎన్నికల వివాదంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ, రీకౌంటింగ్ చట్టబద్ధతతో పాటు కీలక ఆధారాల భద్రత కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. తదుపరి విచారణలో ఎన్నికల సంఘం ఏ రికార్డులను సమర్పిస్తుంది, వాటి ఆధారంగా న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.
Next Story

