ఉర్దూలో ఏసును ఆరాధించే ఏకైక చర్చి ఇదే
x

ఉర్దూలో ఏసును ఆరాధించే ఏకైక చర్చి ఇదే

120 ఏళ్ల నాటి హిందుస్తానీ ఉర్దూ చర్చి సెయింట్ లూక్స్


ఆబిడ్స్ చిరాగ్ అలీ లేన్ అంటే మ‌న‌కు గుర్తు వ‌చ్చేది మొబైల్ ఫోన్ కు సంబంధించిన పెద్ద మార్కెట్‌. అయితే, అదే వీధి చివ‌రిలో ఓ మూలలో ప్రత్యేకమైన చ‌ర్చి వుంటుంది. చుట్టుపక్కల ఉన్న పెద్ద భవనాల కారణంగా సెయింట్ లూక్స్ హిందుస్తానీ చర్చిని సులభంగా గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే. ఈ చర్చి ఉన్న ప్రదేశం చాలా మంది దారిన వెళ్లేటప్పుడు దానిని గమనించకుండా దాటిపోయేలా ఉంటుంది. బయట ఉన్న సైన్‌బోర్డు లేకపోతే, దానిని ఒక చర్చిగా గుర్తించడం దాదాపు అసాధ్యం. క్రైస్తవ పవిత్ర స్థలాలను అలంకరించే సాధారణ క్లాసిక్-రివైవల్ శైలి ( గోతిక్ ఆర్కిటెక్చ‌ర్) సెయింట్ లూక్స్ హిందుస్తానీ చర్చిలో కనిపించదు. ఇది సాదాసీదా దీర్ఘచతురస్రాకార నిర్మాణాన్ని కలిగి ఉంది.

సెయింట్ లూక్స్ హిందుస్తానీ చర్చి ప్ర‌త్యేక‌త ఏమిటంటే "ఇక్క‌డ‌ ఉర్దూలో ప్రార్థ‌న‌ జ‌రుగుతుంది. చర్చి లోపల ఉర్దూ శాసనాలు, ఉర్దూ బైబిల్ ను చూడ‌వ‌చ్చు. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఉర్దూ భాషలో ప్రార్థ‌న‌ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఇదే విధమైన మరో చర్చి బెంగళూరులో ఉంది, కానీ అక్క‌డ హిందీలో ప్రార్థ‌న చేశారు," అని చర్చి ప్రెస్బిటేరియన్ ఇన్‌చార్జ్ రెవరెండ్ శామ్యూల్ హెరాల్డ్ క్రిస్టియన్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

ఈ చర్చి ప్రొటెస్టంట్ సంప్రదాయంలోని ప్రెస్బిటేరియన్ తెగను అనుసరిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆరాధన కోసం వచ్చే వారిలో చాలా మంది మతమార్పిడి చేసుకున్నవారే. “ఏ మతానికి చెందిన భక్తులైనా ఈ చర్చిలో ఆరాధన చేయవచ్చు. ఇతర వర్గాల సందర్శకులపై ఎలాంటి ఆంక్షలు లేవు. హిందీ మాట్లాడే క్రైస్తవులు ఈ చర్చిని ఇష్టపడతారు, ఎందుకంటే వారు భాషను సులభంగా అర్థం చేసుకోగలరు,” అని కె. శామ్యూల్ అన్నారు.


"ఉర్దూ సులభంగా అర్థమయ్యే భాష. బైబిల్‌లోని ప్రతి వచనాన్ని స్పష్టంగా, సరళంగా ఉర్దూలో వివరించడం వల్ల అది సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ చెప్పే సందేశాలు క్లుప్తంగా, అర్థవంతంగా ఉంటాయి," అని ​ప్రార్థ‌న చేయ‌డానికి వ‌చ్చిన‌ సాగర్ చెప్పారు.

1900 సంవ‌త్స‌రంలో లండన్ నుండి హైద‌రాబాద్‌కు వచ్చిన ముగ్గురు మిషనరీలు త‌మ మ‌త ప్ర‌చారం కోసం ఉర్దూ భాష‌ను నేర్చుకున్నారు. ఆ త‌రువాత నిజాంను క‌లిసి చర్చి నిర్మాణం కోసం భూమి ఇవ్వ‌మ‌ని కోరారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1905లో చర్చి నిర్మాణం కోసం 1.5 ఎకరాల భూమిని క్రిస్టియన్ మిషనరీస్ సొసైటీకి బహుమతిగా ఇచ్చారు. క్రైస్తవ మ‌త ప్ర‌చార‌కులు బైబిల్​ను ఉర్దూలోకి అనువాదం చేశారు. ఆ సమయంలో క్రైస్తవ మిషన్ ప్రచారం వల్ల కొంత మంది ముస్లింలు ఈ మతంలో చేరి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఉర్దూ చర్చి​గా పిలిచేవారు.

సెప్టెంబర్ 27, 1947న చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI) ట్రస్ట్ అసోసియేషన్ స్వాధీనం చేసుకుంది. ఉర్దూ చ‌ర్చి పేరును సెయింట్ లూక్స్ హిందుస్తానీ చర్చిగా పేరు మార్చింది. దేశ‌విభ‌జ‌న త‌రువాత ఈ చ‌ర్చికి వ‌చ్చే వారు పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెళ్లడం వల్ల చర్చి​కి వచ్చే వారి సంఖ్య తగ్గింది. కాలక్రమంలో హిందుస్థానీ చర్చి మరుగునపడింది.

కాలగమనంలో శిథిలావస్థకు చేరిన హిందూస్థానీ చర్చిని 2013లో పునరుద్ధరించారు. "ప్ర‌స్తుతం ఉత్త‌రాది నుంచి ఉద్యోగాల కోసం వ‌చ్చిన వాళ్ళు వ‌స్తున్నారు. వాళ్ల‌కి హిందీ కావాలి. అందుకే చెప్ప‌డం ఉర్దూయే, కానీ చ‌ద‌వ‌డం హిందీలోనే కొన‌సాగుతోంది. ఇక్క‌డ ప్ర‌స్తుతం హిందీ న‌డుస్తోంది," అని చర్చిలో ప్రెస్బిటేరియన్ ఇన్‌చార్జ్ అయిన రెవరెండ్ శామ్యూల్ హెరాల్డ్ క్రిస్టియన్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

ప్రొటెస్టంట్, కాథలిక్ చర్చిలు సాధారణంగా స్థానిక భాషలలో తమ ప్రార్థనలను నిర్వహిస్తాయి. ఉదాహరణకు, సికింద్రాబాద్‌లోని సెంటెనరీ బాప్టిస్ట్ చర్చి 1875లో స్థానిక తెలుగు ప్రజల కోసం నిర్మించారు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సెయింట్ థామస్ తమిళ కేథడ్రల్ 1852లో స్థానిక తమిళ క్రైస్తవుల కోసం నిర్మించారు. సెయింట్ లూక్స్ హిందుస్తానీ చర్చిని ఉర్దూ మాట్లాడేవారి కోసం నిర్మించారు.

Read More
Next Story