‘చలాన్ పడుతూనే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ కావాలి’
x

‘చలాన్ పడుతూనే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ కావాలి’

ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలాన్లు వేయండి కానీ.. వాటిని చెల్లించడానికి డిస్కౌంట్‌లు ఇవ్వొద్దన్న సీఎం రేవంత్.


తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతను అత్యంత కీలక సమస్యగా గుర్తించింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలను తగ్గించాలన్న లక్ష్యంతో ‘అరైవ్ అలైవ్’ పేరిట రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పోలీస్ శాఖ రూపొందించిన రోడ్డు ప్రమాదాల నివారణ ప్రణాళికలను సీఎం పరిశీలించి ప్రశంసించారు.

యుద్ధాలకన్నా ఎక్కువ ప్రాణనష్టం

కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రోడ్డు ప్రమాదాలు యుద్ధాలకన్నా ఎక్కువ ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి నిమిషం ఒక ప్రమాదం జరుగుతుందని, ప్రతి మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు ఒక రాష్ట్ర సమస్య కాకుండా దేశవ్యాప్త సమస్యగా మారాయని స్పష్టం చేశారు.

ప్రముఖ కుటుంబాలు సైతం తమ పిల్లలను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోయి జీవితాంతం బాధతో జీవిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి సమాజానికి తీరని నష్టమని అన్నారు.

చిన్న వయసులోనే అవగాహన అవసరం

రోడ్డు భద్రతపై అవగాహన విద్యార్థి దశలోనే మొదలవ్వాలని సీఎం సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద విషాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.

ఆధునిక పోలీస్ వ్యవస్థ

మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులకు గుర్తింపు తీసుకువచ్చామని పేర్కొన్నారు.

అలాగే చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం హైడ్రా యంత్రాంగం ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెరువుల పునరుద్ధరణతో పతంగుల పండుగ జరుపుకుంటున్నామని చెప్పారు.

ట్రాఫిక్ వ్యవస్థలో కీలక మార్పులు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఇతర నేరాలకన్నా తీవ్రమైన సమస్యగా మారాయని సీఎం అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా ఆధునికంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో వినియోగించి ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు చలాన్లు ఆటోమేటిక్‌గా వాహనదారుల బ్యాంక్ ఖాతాల నుంచి కట్ అయ్యే విధానం అమలు చేయాలని సూచించారు. చలాన్లపై రాయితీలు అవసరం లేదన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు.

పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్త ప్రచారం

రోడ్డు ప్రమాదాల నివారణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జనవరి 13 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా పది రోజులపాటు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, గ్రామాలు, జాతీయ రహదారులు, మార్కెట్లు, మాల్స్ వంటి ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

‘అరైవ్ అలైవ్’ ఒక ఉద్యమం: డీజీపీ

ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ, ‘అరైవ్ అలైవ్’ ఒక కార్యక్రమం కాదు, ఇది ప్రజల ప్రాణాలను కాపాడే ఉద్యమం అని అన్నారు. తెలంగాణలో సుమారు 30 వేల కిలోమీటర్ల రహదారి నెట్‌వర్క్ ఉందని తెలిపారు. ప్రతి ఏడాది సగటున 27 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

గత ఏడాది రాష్ట్రంలో 800 హత్యలు జరిగితే, రోడ్డు ప్రమాదాల్లో 7,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హత్యలకన్నా రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా మందికి ఇంకా సీరియస్‌నెస్ లేదని అన్నారు. ప్రమాదాలకు గురవుతున్న వారిలో 72 శాతం మంది ద్విచక్ర వాహనదారులేనని వెల్లడించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు.

రేపటి నుంచి పది రోజులపాటు ఈ అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలంతా బాధ్యతగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని డీజీపీ స్పష్టం చేశారు.

ప్రతి ప్రాణం విలువైనదే

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘అరైవ్ అలైవ్’ థీమ్ సాంగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

రోడ్డు భద్రతను ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ప్రజల ఉద్యమంగా మార్చాలన్నదే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం. ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలన్న సందేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

Read More
Next Story