
ఇక ముందు హైదరాబాద్ క్యూర్, ప్యూర్, రేర్
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఫిలాసఫీ ఇదే....
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సూత్రాల ప్రణాళికను అవలంబించనుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పాలసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే క్యూర్, ప్యూర్, రేర్ సూత్రాలుగా ఆయన చెప్పారు. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎనకానమే, ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రేర్ అంటే రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ అని రేవంత్ వివరించారు. ఈ మూడు రకాల వ్యవస్థలను, ప్రణాళికలను వీటికి సంబంధించి అన్ని అంశాలను క్రోఢీకరించి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ డాక్యుమెంట్‌లో ఈ మూడు సూత్రాల కింద అసలు ఏం చేయనున్నాం అన్నది సవివరంగా ఉంటుందని ఆయన తెలిపారు
తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రం విడుదల, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) విధాన పత్రం డిసెంబర్ 6 తేదీ నాటికి పూర్తి అవుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రం విడుదల చేస్తారు.
ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో లక్షలాది మంది ప్రజలను భాగస్వాములుగా చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే ప్రభుత్వ అసలు లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. డాక్యుమెంట్ తయారీలో ISB, నీతి ఆయోగ్ వంటి ప్రముఖ సంస్థల సూచనలను కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.
2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్, పాలసీ డాక్యుమెంట్ గా ఇది తయారవుతుంది.
మూడు వ్యవస్థల హైదరాబాద్
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), పెరీ-అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) గా మూడు ప్రాంతాలుగా విభజించుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ది, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా విజన్ 2047కు సిద్దమౌతోంది. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్దే టార్గెట్‌గా రానున్న 22 ఏంఢ్ల కార్యాచరణను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది.
మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో పాలసీ డాక్యుమెంట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నఅపారమైన అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఆవిష్కరించడంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రెండు రోజుల్లో సదస్సులో ప్రభుత్వం ప్రధానంగా వివరిస్తుంది.
హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ తెలంగాణను మూడు జోన్లుగా అభివృద్ది సమతుల్యత సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేసమయంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా విజన్ డాక్యుమెంట్‌లో భాగమవుతుంది.
ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (AI), స్టార్టప్, MSMEలు, టూరిజం, ఎగుమతులు వంటి రంగాల్లో రానున్న రెండు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలకమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
బ్లూ,గ్రీన్ హైదరాబాద్
బ్లూ & గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ 2047 డాక్యుమెంట్‌లో మూసీ పునరుజ్జీవం, దీనిలో భాగంగా 2959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వ స్థితికి తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకుంది.
ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్ రోడ్డు, హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లు, రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనుంది. వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతోంది.
విదేశీ ఉపాధికి శిక్షణ
ప్రతీ ఏడాది రెండు లక్షల యువతకు, లక్షమంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ది టార్గెట్‌గా ప్రణాళికల రూపకల్పన, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్స్ విలేజీల నిర్మాణం, మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు అంశాల్లో స్పష్టమైన భవిష్యతు ప్రణాళికలు రూపొందించారు.
అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ది, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పించారు. ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం-టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు.
రాష్ట్రంలోని ప్రతీ గ్రామంతో పాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ వరకు సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ -2047 మార్గదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు.


