
ఐఏఎస్, ఐపీఎస్‌లకు తప్పని సైబర్ తిప్పలు..
మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ మోసగాళ్ల టోపీ.
సైబర్ నేరాలను కట్టడి చేయడం కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. పోలీసులు ఒక మార్గాన్ని క్లోజ్ చేసే సరికి సైబర్ మోసగాళ్లు మరో నాలుగు మార్గాలను రెడీగా పెట్టుకుంటున్నారు. ఇన్నాళ్లూ సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకున్న సైబర్ మోసగాళ్లు.. తాజాగా అధికారులను కూడా టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం సైబర్ మోసగాళ్లు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి మాజీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.
పంజాబ్ పోలీస్ మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్(66) తన ఇంట్లో గన్‌మ్యాన్ లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో షూట్ చేసుకున్నారు. ఘటన స్థలంలో 12 పేజీలో నోట్ ఒకటి పోలీసులకు లభ్యమైంది. అందులో పెట్టుబడుల ఫ్రాడ్‌లో తాను రూ.8.1కోట్లు కోల్పోయానని, వాట్సాప్, టెలిగ్రామ్‌లో ‘ఎఫ్-777 డీబీఎస్ వెల్త్ ఇక్విటీ రీసెర్చ్ గ్రూప్’ పేరుతో ఈ ఫ్రాడ్ జరుగుతుందని వివరించారు చాహల్. అంతేకాకుండా సదరు సంస్థ తమకు ప్రముఖ ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ నేరగాడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అదే విధంగా హైదరాబాద్‌లో 72ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌ను కూడా సబర్ మోసగాళ్లు రూ.3.37కోట్ల మోసం చేశారు. ఇక్కడ కూడా వాళ్లు స్టాక్ ట్రేడింగ్ అప్లియేషన్‌ను వినియోగించారు. తాను మోసపోయానని గుర్తించిన మాజీ అధికారి వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. మోసగాడు తనను ఒక ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసేలా చేశాడని, అందుకు అతడు ఒక లింక్ షేర్ చేశాడని చెప్పారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ధాని సెక్యూరిటీస్ పేరుతో అఫీషియల్ సైట్‌లా కనిపించిన సైట్ ఓపెన్ అయిందని చెప్పారు.
అందులో కీలక నిందితుడు తన పేరు అర్జున్ రమేష్ మెహతా అని తాను చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ అని పరిచయం చేసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత నమ్మబలికి 90శాతం లాభాలు వస్తాయని చెప్పారని, వారికి 2025లో మార్చి నుంచి మే నెలల మధ్యలో పలు దఫాలుగా డబ్బులు సెండ్ చేసినట్లు చెప్పారు. మొత్తంగా రూ.3.3కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశానని, తాజాగా తన లాభాలను విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించిన సమయంలో మోసపోయినట్లు అర్థమైందని ఆయన పేర్కొన్నారు. అందులో తన లాభం రూ.22కోట్లుగా చూపిందని, దానిని యాక్సెస్ చేయడానిక మరో రూ.35లక్షలు కట్టాలని చూపిందని, అక్కడే తనకు అనుమానం కలిగిందని ఆయన వివరించారు. ఇటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి సీబీఐ మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ భార్య కూడా చేరారు.
సైబర్ వలలో చిక్కిన ఆమె రూ.2.5కోట్ల కోల్పోయారు. వాట్సాప్ మెసేజ్‌లు, నకిలీ పెట్టుబడి ఫ్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రలోభపెట్టి మోసం చేశారు. పెట్టుబడులని చెప్పి బ్యాంక్ ఖాతా నుంచి పలు దఫాలలో రూ.2.5కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. నవంబర్ 2025 చివరి వారంలో JD లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళకు అన్‌నౌన్ నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ ఒకటి వచ్చింది. 'స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయి' అని అందులో ఉంది. ట్రేడింగ్ పరిజ్ఞానం తక్కువగా ఉండటంతో ఆమెను సులభంగా మోసం చేశారు.
ఈ మోసంలో ప్రధాన సూత్రధారి దినేష్ సింగ్.. IIT ముంబై గ్రాడ్యుయేట్, అమెరికా PhD అని పరిచయం చేసుకొని, ‘స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్’ పుస్తకం త్వరలో వస్తుందని నమ్మించారు. ప్రియసఖి అనే మరో మహిళ స్క్రీన్ షాట్లు, నకిలీ పత్రాలు చూపిస్తూ కోట్లను సంపాదిస్తున్నారని తప్పుడు లెక్కలు చూపించడంలో పాలుపంచుకుంది. డిసెంబర్ 24, 2025 నుంచి జనవరి 5, 2026 మధ్య మొత్తం 19 విడతలలో రూ.2.58 కోట్లు ట్రేడింగ్ యాప్ సూచించిన ఖాతాలకు బదిలీ అయ్యాయి. బాధితురాలు ఆపిల్ యాప్ స్టోర్ నుండి నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, చివరకు పోలీస్ సహాయం కోరారు. సైబర్ క్రైమ్ పోలీసులు నేరగాళ్లు వసూలు చేసిన సొమ్మును నకీలీ ఖాతాలకు తరలించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా చట్టంపై అవగాహన ఉన్న అత్యున్నత స్థాయి అధికారుల కుటుంబాలు కూడా మోసానికి గురవుతుండటం సైబర్ నేరగాళ్ల నైపుణ్యం, మాయమాటల తీవ్రతను చూపిస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు డిజిటల్ కమ్యూనికేషన్లను సరిచూసుకోవాలని, అనుమానాస్పద పెట్టుబడులు, అనౌన్ వాట్సాప్ సలహాలను నమ్మొద్దని సూచిస్తున్నారు. SEBI రిజిస్టర్డ్ బ్రోకర్ల ద్వారా మాత్రమే పెట్టుబడులు చేయాలని తెలుపుతున్నారు.


