
‘ఓటు వేసే ప్రతి మహిళ గుర్తింపును చెక్ చేయాలి’
దొంగ ఓటరు ఐడీ కార్డులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటే ఎన్నికల అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించిన హరీష్ రావు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఈ క్రమంలోనే సున్నితమైన పోలింగ్ బూత్‌ల దగ్గర కేంద్ర బలగాలను నియమించాలని అన్నారు. దాంతోపాటుగా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మహిళ పోలీస్ అధికారులు, ఆశ, అంగన్వాడీ వర్కర్లను నియమించి ఓటు వేసే ప్రతి మహిళ గుర్తింపును చెక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ చెకింగ్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ మేరకు తమ ప్రతిపాదనలను అధికారులకు రాతపూర్వకంగా ఇచ్చినట్లు చెప్పారు. మహిళల ముసుగులో దొంగ ఓట్లు వేయించడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు.
‘‘రేవంత్ రెడ్డి ఈరోజు ఆరు గ్యారంటీల గురించి సమీక్ష చేస్తున్నాడట. రెండేళ్లలో ఎన్నడూ ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయకుండా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే సమీక్ష చేస్తున్నాడంటే ఓటమి భయంతోనే. కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు పంపిణీ చేసి దొంగ ఓట్లు వేయాలని చూస్తుంది. ఈ వీడియో ఆధారాలు అన్ని ఎన్నికల ప్రధాన అధికారికి చూపించి, వారి ఫోన్ కి కూడా పంపించాం. ఇన్ని దొంగ ఓటరు ఐడీ కార్డులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటే ఎన్నికల అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.
‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. వాటికి సంబంధించిన అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్‌కి సమర్పించాం. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని కోరాం. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా, కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతారు’’ అని హరీష్ రావు అన్నారు.


