
మొదలైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్..
జూబ్లీపై ఎవరి జెండా ఎగురుతుందో..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. యూసఫ్‌గుడాలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓటింగ్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. ఇందుకోసం ప్ర్యేక పర్మిష్‌తో 42 టేబుల్స్‌ను సిద్ధం చేశామని, 186 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. నవంబర్ 14 ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌ల పరిశీలనతో కౌంటింగ్ ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. కౌంటింగ్ సెంటర్‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ రోజున భద్రతకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్టు, కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈఓ హెచ్చరించారు.
58 మంది అభ్యర్థులు..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 150 మంది వరకు నామినేషన్లు వేయగా.. ఆఖరికి 58 మంది అభ్యర్థులు మిగిలారు. కాగా వీరిలో బీఆర్ఎస్ తరుపున మాగంటి సునీత.. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే ఒక మోస్తరు ప్రచారం కూడా స్టార్ట్ చేసేశారు. ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతోనే బీఆర్ఎస్ చాలా స్పీడ్‌గా తమ అభ్యర్థిని ప్రకటించేసింది. ఆ తర్వాత కాస్తంత టైమ్ తీసుకుని.. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడింది. ఆఖరికి ఓటర్ల ప్రాతిపదికన.. స్థానికత ప్రాతిపదికన.. నవీన్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా వెల్లడించింది. కాలా మిగిలిన పార్టీలు ప్రచారం చేసేస్తున్నా బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. ఆఖరుగా నామినేషన్ల వేయడానికి ఆఖరు రోజున లంకల దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించి.. అదే రోజు నామినేషన్ వేయించింది. అప్పటి నుంచి మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. రాత్రింబవళ్లు బడా నేతలు సైతం గల్లీల వెంట తిరిగి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు.
50శాతం కూడా లేని పోలింగ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ 50శాతం కూడా లేదు. నియోజకవర్గంలో మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ వారిలో సగానికి పైగా మంది ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఓటు వేయడానికి రాలేదు. దీంతో ఎన్నికలో పోలయిన మొత్తం ఓట్లు 1,95,631 మాత్రమే. వీరిలో పురుషులు 99,771 మంది, మహిళలు 94,855 మంది, ఇతరులు 5గురు మాత్రమే ఓట్లు వేశారు. ఏడు డివిజన్లలోని 30 కాలనీలు, 70 బస్తీల్లో 4.01 లక్షల ఓటర్లున్నారు. వీరిలో మధ్య, దిగువ తరగతి జనాలతో పాటు పేదలే ఎక్కువ. పార్టీల అంచనా ఏమిటంటే పోలైన ఓట్లలో కాలనీల్లోని ఓటర్లకన్నా బస్తీల్లోని ఓటర్లే ఎక్కువమంది ఓటింగులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న రోడ్డుషోలు, కార్నర్ మీటింగులు, బహిరంగసభకు జనాలు విపరీతంగా హాజరయ్యారు. ఇదే ఊపు పోలింగురోజున కూడా కనబడుతుందని, ఓటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశించిన పార్టీలకు ఓటర్లు పెద్ద షాకిచ్చారు.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని జోస్యం చెప్పాయి. మంగళవారం జరిగిన పోలింగ్‌లో ఓటర్స్ టర్న్‌ఔట్ తక్కువగానే నమోదయింది. అంతా 60శాతాన్ని క్రాస్ చేస్తుందని అంచనా వేయగా.. అది మాత్రం 50 కూడా కష్టమే అన్నట్లు నత్తనడకన నడుస్తోంది. దీంతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ ముగవడంతో విజేత గురించి ఇప్పుడు రాష్ట్రమంతా చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కీలకంగా మారుతున్నాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.
అసలు విజేత తేలేది ఈ రోజే...
ఎవరు ఎన్ని అంచనాలు వేసినా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో ఎవరు గెలుస్తారు అనేది తేలేది మాత్రం ఈరోజే(శుక్రవారం). జూబ్లీ ఎమ్మెల్యేగా తామే విజయం సాధిస్తామని మూడు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను చూస్తే.. అసలు పోటీ అంతా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంటుందని, అందులోనూ కాంగ్రెస్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు చెప్తున్నాయి. దీంతో విజయం ఎవరిని వరిస్తుంది అన్న ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉపఎన్నిక గురించి చర్చ జరుగుతుంది. ఈ ఉపఎన్నిక అధికార, ప్రధాన ప్రతిక్ష పార్టీల సత్తాను చాటుతుందని విశ్లేషకులు అంటున్నారు.
సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ఇంతగా పోరాటం చేస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే మాగంటి సునీతను అభ్యర్ధిగా ప్రకటించి, ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. గ్రేటర్ పరిధిలో రెండోసీటును ఎలాగైనా గెలుచుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పట్టుదలమీదున్నారు. అందుకనే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, సీనియర్ నేతలను రంగంలోకి దింపి ప్రచారం చేయించారు. రేవంత్ ఐదు రోడ్డుషోలు. ఒక బహిరంగసభలో పాల్గొన్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లోని ఇల్లిల్లు తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు.
Live Updates
- 14 Nov 2025 10:43 AM IST
దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి.. 9వేలకు పైగా ఆధిక్యంలో నవీన్ యాదవ్
ముగిసిన నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు
- 14 Nov 2025 10:43 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ హవా.. 10 వేల మెజార్టీకి చేరువలో కాంగ్రెస్.. కాంగ్రెస్ ఆధిక్యం: తొలి రౌండ్ 47... 2వ రౌండ్ 2,947, మూడో రౌండ్ 3,100, నాల్గో రౌండ్ 3,100
- 14 Nov 2025 10:14 AM IST
"జూబ్లీ హిల్స్" కౌంటింగ్
మూడో రౌండ్ పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ 6047 ఓట్ల ఆధిక్యం సాధించింది.
- 14 Nov 2025 9:39 AM IST
ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
- 14 Nov 2025 9:38 AM IST
కొనసాగుతున్న మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు
రహమత్‌నగర్, వెంగళరావునగర్ డివిజన్ల ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది
- 14 Nov 2025 9:21 AM IST
రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌దే ఆధిక్యం
1,114 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్



