అందెశ్రీకి ప్రధాని మోదీ సంతాపం..
x

అందెశ్రీకి ప్రధాని మోదీ సంతాపం..

సాంస్కృతిక ప్రపంచంలో అందెశ్రీ లేని లోటు పూడ్చలేదన్న మోదీ.


తెలంగాణ ప్రముఖ రచయిత అందెశ్రీ.. సోమవారం అస్తమించారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు చెప్పారు. ఆయన మరణం యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందెశ్రీ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. అందెశ్రీ మరణ వార్త తనను ఎంతగానో కలచి వేసిందని మోదీ ఎక్స్(ట్విట్టర్)వేదికగా తెలుగులో పోస్ట్ పెట్టారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని, సాంస్కృతిక ప్రపంచానికి ఆయన అందించిన సేవలను అజరామరం అని పేర్కొన్నారు. ‘‘అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను,సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని మోదీ రాసుకొచ్చారు.

కిషన్ సంతాపం

ప్రముఖ కవి అందెశ్రీ మరణంపై కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. అందెశ్రీ మరణం తీవ్ర విచారకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్నీ వర్గాలను కదిలించిన విషయాన్ని కిషన్ గుర్తుచేశారు. ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే గేయం తెలంగాణ ఉద్యమానికి మైలురాయిగా నిలిచిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలోనే కాకుండా తర్వాత కూడా తెలంగాణ జాతిని జాగృతంచేసే విషయంలో ముక్కుసూటిగా వ్యవహరించారని చెప్పారు. సమాజానికి చెప్పాలని అనుకున్న విషయాన్ని అందెశ్రీ సూటిగా, స్పష్టంగా చెప్పేవారని గుర్తుచేశారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి

అందెశ్రీ మరణం విషయంలో కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహజకవి మరణం పట్ల విచారం చెబుతు కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ సాధన కోసం సాగిన సాంస్కృతిక సాధన ఉద్యమంలో కవిత తన పాటలతో, సాహిత్యంతో అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటన్నారు. ఉద్యమకాలంలో సహజకవితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.

సాహిత్యానికి తీరి లోటు: భట్టి

‘‘అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటు. తెలంగాణ సాహిత్య ప్రపంచంలో ఇదొక చీకటి రోజుగా మిగులుతుంది. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛాలతో జరుగుతాయి’’ అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Read More
Next Story