
SC రిజర్వేషన్ లలో క్రీమీ లేయర్ విధించడం సాధ్యమా?
చీఫ్ జస్టిస్ గవాయి ఈ వ్యాఖ్యలు అమరావతి లో రాజ్యాంగం పైన జరిగిన కార్యక్రమం లో చేశారు
భారత ప్రధాన న్యాయమూర్తి ఉన్న జస్టిస్ గవాయి ఎస్సీ ఎస్టీ ల లో కూడా క్రీమ్ లేయర్ వర్తింప చేయాలి అని సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయిన అమరావతి లో ‘భారత్ దేశం; 75 సంవత్సరాల సజీవ రాజ్యాంగం’ అనే అంశం పై జరిగిన సదస్సులు లో మాట్లాడుతూ ప్రస్తుతం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ల లో ఉన్న క్రీమ్ లేయర్ సూత్రాన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లకు కూడా విస్తరించాలని అన్నారు.
ఒక ఐఏఎస్ అధికారి కుమారుడి ని ఒక వ్యవసాయ కుమారుడి నీ రిజర్వేషన్ ల విషయం లో ఒకే లాగా చూడలేమని చెబుతూ జస్టిస్ గవాయి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంద్ర సాహ్నీ కేసు తీర్పు లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్స్ ల కు క్రీమ్ లేయర్ నిబంధన విధించారు. దీనిని షెడ్యూల్డ్ కాలాలకు వర్తింప చేయాలని తాను గతంలోనే తీర్పు ఇచ్చాను ఐతే దానిని కొంత మంది వ్యతిరేకించారు, అని జస్టిస్ గవాయి అన్నారు.
షెడ్యూల్డ్ కులాలకూ క్రీమీ లేయర్ నిబంధన విధించాలి అన్న జస్టిస్ గవాయి సూచన తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయ్యింది.
అయితే క్రీమీ లేయర్ అంశాన్ని ఎక్కువగా రిజర్వేషన్ వ్యతిరేకులు మాత్రమే ప్రస్తావిస్తున్నారని చర్చనీయాంశం చేస్తున్నారని ఎస్సీ కులాల వర్గీకరణ సమయం లో కూడా దాని అవశ్యకత కంటే క్రీమ్ లేయర్ మీదే రచ్చ చేశారని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిట్ కి చెందిన గోపని చంద్రయ్య అన్నారు.
“ఈ మాటలు గవాయి మాట్లాడటం వలన ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. 75 సంవత్సరాలకు డక్కలి కులం నుండి ఒకరు టీచర్ అయితే అతని పిల్లలకు మెడికల్ లో పీజీ సీట్ సంపాదించే పరిస్థితి వస్తుంది. ఒక దినసరి కూలి పిల్లలు ఆ సీట్ కు పోటీపడే పరిస్థితి లేదు. ఒక ఐఎఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్ ల పిల్లలకు ఎటువంటి స్కాలర్‌షిప్ లాంటివి రావు. రిజర్వేషన్ ల తాత్వికత ను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. 75 సంవత్సరాల తరువాత 15 శాతం గా వున్న ఎస్సి లకు 5 శాతం ప్రాతినిధ్యం లేదు. 50 శాతం వున్న బీసీ లకు 5 శాతం లేదు చాలా రంగాలలో. ముస్లింల లోనూ పసమందా ల సమస్య ముందుకు వచ్చింది. ఎస్సి ల లో ఒక మధ్య తరగతి ఎదగాలి. వాళ్ళు లేకుండా కాన్షీరామ్ బామ్ సెఫ్ (All India Backward and Minority Communities Employees Federation) BAMCEFను ఊహించగలమా. చర్చ ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్ గురించి, నింపని ఖాళీల గురించి జరగాలి,” అని అన్నారు.
అయితే వర్గీకరణ ఎంత న్యాయమో పంపిణీ కూడా అంతే న్యాయమని ఎస్సి ఎస్టీ లలో కూడా గవాయి అన్నట్లు ఒక ఐఎఎస్ పిల్లలు కూలి పిల్లలు ఒకటి కాదు కాబట్టి వర్గీకరణ వుండాలి అన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( MRPS) వ్యవస్థాపక సభ్యుడు, కృపాకర్ మాదిగ. “సామాన్యులు అంగీకరించినా 50 ఏళ్లుగా అభివృద్ది అయిన వాళ్ళు చదువుకుని వర్గీకరణను సమర్థించిన వాళ్ళు అంతర్గత న్యాయాన్ని అంగీకరించకుండా వ్యతిరేకించటం ఆమోదయోగ్యం కాదు. యింకా రిజర్వేషన్ ఫలాలు పొందలేని వాళ్ళు వాటిని అనుభవించే పరిస్థితి రావాలి. ప్రభుత్వం లో ఉన్నత స్థానాలలో వున్న వాళ్ళే యిప్పుడు రాజకీయ పార్టీ ల పంచన చేరి మళ్ళీ రాజకీయ రంగం లోకి వస్తున్నారు. రాజకీయ పార్టీలు వాళ్ళకే సీట్ లు యిస్తున్నాయి. రాజ్యాంగం సంపద పంపిణీ జరగాలి అని చెప్పింది,” అని అభిప్రాయ పడ్డారు.
అయితే క్రీమీ లేయర్ అనేది రాజ్యాంగంలోనూ ఏ డిక్షనరీ లో నూ లేదన్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ. వేంకటేశు. “యిది న్యాయ వ్యవస్థ తీసుకు వచ్చిన ఒక ఆలోచన. వెనుకబాటుతనానికి, ఎంత అభివృద్ది అయ్యి ముందుకు వచ్చారు అనే దానికి డాటా లేదు. కుల గణన చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగం లేదా హోదా వుంటే వారిని క్రీమీ లేయర్ అందామా. మరి ప్రభుత్వ ఉద్యోగాలలో లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి. మన దేశం లో EBC పేరుతో అర్హత లేని వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. జస్టిస్ కృష్ణ అయ్యర్ జడ్జ్ గా కేరళ లో జస్టిస్ చిన్నప్ప రెడ్డి కర్ణాటక హై కోర్టు లో యిచ్చిన తీర్పుల మీద ఆధారపడి సుప్రీం కోర్టు ఇంద్ర సాహ్నీ కేసులో తీర్పు యిచ్చింది. యిప్పుడు వున్న వ్యవస్థ లో క్రీమీ లేయర్ మీద ఆధారపడి కాకుండా వెనుకబాటుతనం అనేది కొలమానం కావాలి. ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ కు ముందు జరిగిన చర్చ యిప్పుడు మళ్ళీ జరగాలి,” అన్నారు.
సరైన సమాచారం లేకుండా క్రీమీ లేయర్ అనే పదం మీద చర్చ తప్పు. ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం రెండు వేరు వేరు విషయాలు. సామాజిక గుర్తింపు, వనరుల పంపిణీ అనేది ఆర్థిక అంశాల మీద కంటే సామాజిక అంశాల మీద ఆధారపడాలి అన్నారు కలకత్తా లోని Centre For Studies In Social Sciences లో సోషియాలజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సతీష్ చెన్నూరు. బాలగోపాల్ రిజర్వేషన్ అంశాన్ని సామాజికంగా పరిష్కారం చూపాలి అన్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, బీహార్ మాజీ సిఎం జీతాన్ రామ్ మాంఝీ లు పూజ చేసిన గుడులను శుద్ది చేశారు. వాళ్ళ స్థాయి మారినా వాళ్ళ సామాజిక పరిస్థితి మారలేదు. గాంధీ ని వ్యాపార వర్గానికి ప్రతినిధి అనని సమాజం అంబేద్కర్ ను ఎందుకు దళిత ప్రతినిధి గా చూస్తోంది. 1991 తరువాత దళితుల పైన దాడులు పెరిగాయి. గ్రూప్-4 ఉద్యోగాలను పొందటం లో జరిగిన మార్పు గ్రూప్-1 పోస్టుల లో ప్రాతినిధ్యం లో మార్పు పెద్దగా లేదు,” అని అన్నారు సతీష్.
రిజర్వేషన్ అమలు మొదలయ్యాక ఆ పోస్ట్లు అలాగే ఎవరు దొరకక మిగిలిపోయేవి యిప్పుడు అందుకునే పరిస్థితి వున్న వాళ్లను మినహాయిస్తే ముందు వున్న పరిస్థితి వస్తుంది కదా అనగా యివి అన్నీ తెచ్చి పెట్టుకున్న వాదనలు అన్నారు కృపాకర్. “సామాన్యులు అంగీకరించినా చదువుకొని ఉద్యోగాలలో వున్న వాళ్ళు సమానమైన ప్రాతినిధ్యం ని అంగీకరించటం లేదు. మనకంటే వెనుక బడిన వాళ్ళకు అవకాశం యివ్వాలి అనేది ఆలోచన గా వుండాలి.”
అయితే రాజకీయ రంగంలో డబ్బు ప్రమేయం తగ్గించే దానిలో భాగంగా దళితులలో డబ్బు పెట్టి పోటీచేస్తున్న వాళ్ళకు ముందు క్రీమీ లేయర్ ఎందుకు అమలు చేయకూడదు. క్రీమీ లేయర్ కాకుండా వెనుకబాటుతనం లెక్క కట్టి అవకాశాలు యివ్వాలి అని వేంకటేశు తన ఆలోచనగా యిదే పరిష్కారమని అన్నారు.


