చైనా ను భారత్ అందుకోవాలంటే ఏం చేయాలి
x

చైనా ను భారత్ అందుకోవాలంటే ఏం చేయాలి

మాంటేక్ సింగ్ అహ్లూవాలియా మంత్రం ఏమిటంటే...


దేశం ప్రస్తుతం ఎదుగుతున్న 6.5 శాతం ఆర్థిక వృద్ధిరేటును నిలబెట్టుకుని 8 శాతానికి చేరుకోవటానికి మారుతున్న ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన విధనాలను రూపొందించుకోవాలని మాజీ ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మాంటేక్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. ప్రపంచీకరణ తనకు అనుకూలంగా లేదని ఆ ప్రక్రియను తిరగదోడే చర్యలు మరింత దూకుడుగా చేపడుతున్న ట్రంప్ అమెరికా, దేశానికి భద్రత ముప్పుగా పరిణమిస్తున్న చైనా ను దృష్టిలో పెట్టుకుని మన విధానాలను రూపొందించుకోవాలని అన్నారు.

‘వేగంగా మారుతున్న ప్రపంచం లో విధానాల రూపకల్పన లో సవాళ్ళు’ (Challenges of Policy Making in a Fast Changing World) అనే అంశం పైన హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS) లో బిపిఆర్ విఠల్ స్మారకోపన్యాసం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


“వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ప్రస్తుతం చైనా ఉన్న దశకు చేరుకోవలంటే మనం 8 శాతం వృద్ధి రేటు సాధించాలి. ఆ లక్ష్యం చేరుకోవటానికి భారత్ కు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. భారత దేశంలో తలసరి ఆదాయం చైనా లో నాలుగో వంతు మాత్రమే. మనం కచ్చితంగా 6.5 శాతం వృద్ధి రేటు సాధిస్తామని కూడా మనం రూఢిగా చెప్పలేని పరిస్థితి. ఐదు పదేళ్ల నుంచి వున్న విధాన నిర్ణయాలు మనకు ఇక పనికి రావు. అసలు ప్రపంచీకరణకే సవాళ్ళు ఎదురవుతున్న సమయమిది. ప్రపంచ వాణిజ్యం ఇది వరకటిలా లేదు. ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న: గ్లోబల్ సప్లై చైన్‌ల లో నుండి బయటికి రావాలా లేక మనల్ని మనం శక్తివంతం చేసుకోవాలా,” అని ఆయన అన్నారు.

దేశం సరాసరి ఎనిమిది శాతం ప్రగతి సాధించడానికి వచ్చే పది పదకొండేళల్లో ఏటా 9 శాతం, తదుపరి 11 ఏళ్లు 7 శాతం ఎదగాల్సి ఉంటుందని చెబుతూ ప్రభుత్వ విధానాలు దీనికి తోడ్పడాల అని అయన అన్నారు.

"పోయిన త్రైమాసికంలో మనం 8.2 శాతం వృద్ధి సాధించాము. దానికి ప్రత్యేక కారణాలు వున్నాయి. మన వృద్ధి ప్రస్తుతం 6.5 శాతం మాత్రమే. విదేశీ పెట్టుబడుల పైన ఆధారపడిన పరిస్థితి లో ఉన్నందున ద్రవ్యలోటు తగ్గించుకోవటం పైన మన దృష్టి వుండాలి. కొంత మంది పివి నరసింహ రావు అమలు చేసిన 1991 తరహా మార్పులు అవసరం అని అనుకుంటారు. కానీ ఆ మార్పులను పివి స్వయంగా ముందుండి నేతృత్వం వహించి చేయించారు. అందుకు మనం ఆయనకు ఋణపడి ఉన్నాము," అని ఆయన అన్నారు.

మన దేశానికి ఆర్థిక క్రమశిక్షణతో పాటు విద్య, ఆరోగ్యం పై ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉందని, పర్యావరణ మార్పుల పైన కూడా దృష్టి పెట్టాలని చెబుతూ వృద్ధి చెందుతున్న దేశాలు పర్యావరణ మార్పులను ఎదుర్కోవటానికి మద్దతు యివ్వాలనే విషయం పై ప్రపంచం లో వుండిన ఏకాభిప్రాయం ఇపుడు లేదని ఆయన చెప్పారు.

"రుతుపవన వర్షపాత సరళి మారిపోవటంతో నీరు ఎక్కువగా సముద్రంలోని వెళ్లిపోతోంది. దాన్ని నివారించాలి. మన వ్యవసాయాన్ని కాపాడటానికి పర్యావరణ మార్పులను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయాలి. ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థే అయినా కాలుష్యం విషయంలో మూడవ స్థానంలో ఉన్నాము. మనం ఈ విషయం లో ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడి బాగానే చర్యలు తీసుకున్నా చైనా సాధించిన ప్రగతిమాత్రం సాధించలేదు. పునరుత్పాదక శక్తి అయిన గాలి, సౌరశక్తిలను ఉపయోగించుకుని ప్రస్తుతం వున్న 13 శాతం నుండి 2040 నాటికి 45 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది. మనకు శక్తిని నిలవ చేసే సామర్ధ్యం కూడా పెరగాల్సిన అవసరం ఉంది," అని ఆయన అన్నారు.

"ప్రపంచంలోని 20 కాలుష్య కాసర నగరాలలో 14 భారత దేశం లోనే ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ దేశం లో ప్రస్తుతం ఎలెక్ట్రిక్ వాహనాలు పెద్దగా ప్రజలకు రవాణా కల్పించటం లేదు. వీటి సంఖ్య మన అవసరాలలో 50 శాతానికి చేరుకోవాలి. కేంద్రం వీటి సంఖ్యను పెంచటానికి యిస్తున్న సబ్సిడీ ని మనం ఆహ్వానించాలి," అన్నారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు

మారిన సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించేవారు ఆటోమొబైల్ రంగం లో 100 మిలియన్ వినియోగదారులకు చేరుకోవటానికి రెండు దశాబ్దాలు పడితే, టెలిఫోన్ కు 10 ఏళ్లు, ఇంటర్నెట్ కు మూడు ఏళ్లు పట్టింది కానీ చాట్‌జీపీటీ కి కేవలం మూడు రోజులు పట్టింది. కాబట్టి మనకు ఉన్న సమయం తక్కువ. ఉద్యోగాల కల్పన చాలా తక్కువగా ఉండబోతోంది. కొత్త ఉద్యోగాల కల్పనకు మనం పరిశోధనల పైన ఖర్చుపెట్టాలి.

దేశం విద్య, ఆరోగ్యం, నీటి సంరక్షణ పై 5 శాతం జీడీపీ ని ఖర్చుచేయాలి. యివి రాష్ట్రం పరిధిలో వున్న విషయాలు. మన ద్రవ్యలోటు తగ్గి స్థూల దేశీయోత్పత్తికి రుణాలకు మధ్యన నిష్పత్తి కూడా అదుపులోకి రావాలి అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినా దానికి ఒక కాలపరిమితిని నిర్ణయించలేదు. రాష్ట్రాలు తమ ద్రవ్యలోటు తగ్గించటం కష్టం. కేంద్రమే ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వుంది. అందుకు మనకు కొత్త పన్ను విధానం కావాలి. దీనిపైన 20 ఏళ్లుగా చర్చ ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పెట్రోలియం పైన సబ్సిడీలు చమురు ధరలు పడిపోవటంతో తగ్గాయి,” అని స్పష్టం చేశారు.

కేవలం ఎక్కువ ఖర్చుపెట్టడం సమస్యలకు పరిష్కారం కాదు. రాష్ట్రాలలో బీపీఆర్ విఠల్ లాంటి వారు వుండి అందుకు తగిన చర్యలు తీసుకునేలా చూడాలి.

సభకు మాజీ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డీ. సుబ్బా రావు అధ్యక్షత వహించారు. ఆయన బీపీఆర్ విఠల్ గురించి మాట్లాడారు. ప్రపంచీకరణ తిరోగమనం, సాంకేతిక మార్పులు, జనాభా మార్పులు, పర్యావరణ మార్పులు జరుగుతున్న పరిస్థితి లో విధాన నిర్ణయాలు చేయటం మరింత జటిలం అయ్యిందని అన్నారు. బీపీఆర్ విఠల్ ఒక మేధావి అయిన అధికారి, ఆయనకు ఆర్థిక, రాజనీతి శాస్త్రం, చరిత్ర వంటి అన్నీ రంగాలలో తగిన జ్ఞానం ఉండింది అన్నారు.

Read More
Next Story