
గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం
డ్రగ్ పార్టీలో ప్రముఖ స్టార్ హోటళ్లలో కీలక హోదాల్లో పనిచేస్తున్న యువకులు.
హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మసీద్ బండా పరిధిలోని కోవ్ స్టేస్ స్టార్ హోటల్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో నగరవ్యాప్తంగా సంచలనం నెలకొంది. తెలంగాణ ఈగిల్ ఫోర్స్ గచ్చిబౌలి పోలీసుల సహకారంతో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో డ్రగ్స్ సేవించిన యువకులు పట్టుబడ్డారు.
డ్రగ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారం అందడంతో మంగళవారం రాత్రి రూమ్ నంబర్ 309పై పోలీసులు దాడులు చేపట్టారు. గదిలో ఏడుగురు మద్యం సేవిస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. గది మొత్తాన్ని తనిఖీ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదు. అనుమానం రావడంతో అందరికీ యూరిన్ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షల్లో ఐదుగురికి గంజాయి వినియోగం ఉన్నట్లు తేలింది.
పట్టుబడిన వారిలో మెఘేందర్, తేజేశ్వర్, సాయి ప్రసాద్, రమేష్, టి రవి ఉన్నారు. గత రోజే గంజాయి సేవించినట్లు విచారణలో వారు అంగీకరించారు. వివాహ వేడుకలో తొలిసారి గంజాయి అలవాటు అయిందని ఆ అలవాటు కొనసాగుతుందని తెలిపారు. రీయూనియన్ జరుపుకోవాలనే ఉద్దేశంతో హోటల్ గది బుక్ చేసి పార్టీ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 41/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారిలో హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటళ్లలో కీలక హోదాల్లో పనిచేస్తున్న యువకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ శాఖకు చెందిన ఒక అధికారి కూడా ఈ కేసులో ఉన్నట్లు సమాచారం రావడంతో తీవ్ర చర్చ మొదలైంది.
డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని పోలీసులు హెచ్చరించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నగరంలో డ్రగ్స్‌పై దాడులు మరింత తీవ్రం చేయనున్నట్లు వెల్లడించారు.


