పుష్ప-2 తొక్కిసలాట: ఛార్జిషీట్‌లో అల్లు అర్జున్ పేరు
x

'పుష్ప-2' తొక్కిసలాట: ఛార్జిషీట్‌లో అల్లు అర్జున్ పేరు

పదేళ్ళు జైలు శిక్ష?

‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోనిసంధ్య 70 ఎంఎం థియేటర్‌ వద్ద జరిగిన భయానక తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ దాఖలు చేయగా… అందులో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పేరును కూడా నిందితుడిగా చేర్చడం సంచలనంగా మారింది.

ఈ కేసులో మొత్తం23 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు, థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు అల్లు అర్జున్‌ రాక కూడా ఈ దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. అందుకే ఆయన్ను A-11గా చార్జిషీట్‌లో నమోదు చేశారు. ఈ నెల 24న కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ, వివరాలను శనివారం అధికారికంగా వెల్లడించారు.

పోలీసుల ఛార్జిషీట్‌లోని కీలక అంశాల ప్రకారం…

గత ఏడాది డిసెంబర్‌ 4న రాత్రి సంధ్య థియేటర్‌లో పుష్ప-2 మిడ్‌నైట్ ప్రీమియర్‌ షో నిర్వహించారు. ఈ షోకు అల్లు అర్జున్‌ వస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. అయినా ఆ సూచనలను పట్టించుకోకుండా థియేటర్‌ యాజమాన్యం, నిర్వాహకులు, అలాగే అల్లు అర్జున్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు.

ప్రీమియర్‌కు అల్లు అర్జున్‌ ఓపెన్‌ టాప్‌ జీపులో అభిమానులకు అభివాదం చేస్తూ రావడం, బౌన్సర్లు–ప్రైవేట్‌ సెక్యూరిటీ సాధారణ ప్రజలను పక్కకు నెట్టివేయడం వల్ల పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా వందల మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడుశ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ బెడ్‌పైనే చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనలో థియేటర్‌ నిర్వాహకులు, సిబ్బంది, బౌన్సర్లు, ప్రైవేట్‌ సెక్యూరిటీతో పాటు అల్లు అర్జున్‌ను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తొక్కిసలాటపై ముమ్మరంగా దర్యాప్తు చేసి 50 మంది సాక్షులను విచారించామని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ వెల్లడించారు.

ఛార్జిషీట్‌లో ఏముందంటే...

థియేటర్‌ యాజమాన్యం, నిర్వాహకులు –A1, A2

అల్లు అర్జున్‌ –A11

మొత్తం నిందితుల్లో థియేటర్‌ యాజమాన్యం, సిబ్బంది 10 మంది, 8 మంది బౌన్సర్లు, అల్లు అర్జున్‌ , ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు.

జైలు శిక్ష

నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 304 పార్టు-2 (మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసీ సంబంధిత చర్యకు పాల్పడటం) కింద అభియోగాలు నమోదు చేశామని.. నేరం రుజువైతే నిందితులకు 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఆ రోజు ఏం జరిగింది

గత ఏడాది డిసెంబర్‌ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో వేశారు. ఈ షోకు అల్లు అర్జున్‌ రావొద్దని, శాంతిభద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పినా వినకుండా.. థియేటర్‌ యాజమాన్యం, నిర్వాహకులు, అల్లు అర్జున్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

పోలీసుల మాట లెక్క చేయకుండా ప్రీమియర్‌ షోకు అల్లు అర్జున్‌ రావడం, థియేటర్‌కు కొంత దూరం నుంచే ఓపెన్‌ టాప్‌ జీపులో అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడం, బౌన్సర్లు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సాఽధారణ ప్రజలను, అభిమానులు నెట్టివేయడంతో తొక్కిసలాట జరిగింది. వందలాది మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో రేవతి అనే ప్రేక్షకురాలు చనిపోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ అపస్మారక స్థితికి చేరి.. ఇప్పటికీ బెడ్‌మీదనే చికిత్సపొందుతున్నాడు.

మొత్తానికి…

పోలీసుల హెచ్చరికలను ఎందుకు పట్టించుకోలేదు? స్టార్ రాకే ఈ విషాదానికి కారణమా? ఈ కేసు టాలీవుడ్‌ను ఎలాంటి మలుపు తిప్పబోతోంది? ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మధ్య చర్చగా మారాయి.

Read More
Next Story