
తెలంగాణలో మొంథా ఎఫెక్ట్: భారీవర్షాలతో మున్నేరులో వరదనీటి ప్రవాహం
తెలంగాణను ముంచిన ‘మొంథా’ 8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరం దాటిన మొంథా తుపాన్ తెలంగాణపై విరుచుకుపడింది.
‘మొంథా తుపాన్’ అనూహ్యంగా దిశ మార్చుకొని తెలంగాణపై విరుచుకు పడటంతో ఉత్తర, దక్షిణ తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని పలు చెరువుల్లో పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితులు నెలన్నాయి. హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల,సిద్దిపేట,రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో మొంథా తుపాన్ ప్రభావం వల్ల అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదలు
తెలంగాణలోని 8 జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలతో ప్రాజెక్టుల నీటి మట్టాలు పెరిగాయి. వరదనీరు పంటపొలాలను ముంచెత్తడంతో పంటలు దెబ్బతిన్నాయి. భారీవర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. 8 జిల్లాల్లో 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షం నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు. హైదరాబాద్ నగరంలోనూ 40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 412.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలోని రెడ్లవాడలో 333.3 మిల్లీమీటర్లు, కల్లెడలో 382.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
డోర్నకల్ రైల్వే స్టేషన్ ను ముంచెత్తిన వరదనీరు
తెలంగాణలో నేడు ఆరంజ్ అలెర్ట్
మొంథా తుపాన్ ప్రభావం వల్ల తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతోపాటు ఉరుముులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రెండు జిల్లాల్లో గురువారం 5 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఆయన తెలిపారు.
15 జిల్లాల్లో ఎల్లో అలెర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన వెదర్ రిపోర్టులో పేర్కొంది. ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, కొమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. గురువారం 15 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించినట్లు ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు చెప్పారు.
వరదలపై నేడు సీఎం సమీక్ష
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీని ముంచెత్తిన మొంథా తుపాన్ తెలంగాణకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం నగరం తీరాన ఉన్న మున్నేరు వాగులో వరదనీటి ప్రవాహం పెరిగింది. దీంతో ప్రకాష్ నగర్ ప్రాంత వాసులు భయాందోళనల్లో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామం వద్ద ఉన్న మూలవాగులో వరదనీరు పోటెత్తింది.
Next Story


