
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎందుకు ఫెయిల్ అయింది!
ఎంతో మంది అభ్యుదయ వాదులున్న పుస్తక ప్రదర్శన నిర్వాహకులు సైతం స్త్రీల పట్ల వివక్ష చూపుతున్నారని స్త్రీవాద రచయిత ఎం. రచన ఆరోపించడం కలకలం సృష్టించింది..
అనేక సందేశాలు, మరెన్నో వివాదాల నడుమ హైదరాబాద్ 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగిసింది. హ్యాపీ నోట్ తో ప్రారంభమైన పుస్తక ప్రదర్శన పది రోజుల పాటు పలు మెరుపులు, మరకల మధ్య సాగి ‘పుస్తకం తరగని సంపద.. మేథో సంపత్తికి ఎంతో దోహదం’ అనే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సందేశంతో ముగిసింది. “నేటితరం పిల్లలు సెల్ ఫోన్ లో ముగినిపోతున్నారు, పుస్తకాలు చదవడం మర్చిపోతున్నారు, తల్లిదండ్రులు పుస్తక పఠనం అలవాటు చేయించాలి” అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు లాంటి వారు సూచించినా “అదును, అనువుగాని సమయంలో” పుస్తక ప్రదర్శన నిర్వహించడంతో అనుకున్నంత సక్సెస్ కాలేదు. సహజంగానే పుస్తకమంటే మంచి అభిప్రాయమే ఉంటుంది గనుక, ఎవరూ విమర్శించే సాహసం చేయరు గనుక బుక్ ఫెయిర్ ను ఎప్పుడు పెట్టినా జనం వస్తారనే నిర్వాహకుల అతి విశ్వాసం ఈసారి దెబ్బతీసేందనే విమర్శలు వినవచ్చాయి. అసలింతకీ బుక్ ఫెయిర్ సక్సెస్ అయినట్టా ఫెయిల్ అయినట్టా?
“కారణాలు ఏవైనా ఈసారి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిజానికి డిసెంబర్ లో మూడో వారంలో మొదలు పెట్టి జనవరి ఫస్ట్ నాటికి ముగించాలి. అప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈసారి షెడ్యూల్ దెబ్బతింది. ఫిబ్రవరిలో పెట్టాలని నిర్ణయించే సమయానికి పిల్లలకు పరీక్షలు వచ్చాయి” అన్నారు అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గుంటూరు బ్రాంచ్ మేనేజర్ గా పని చేసిన ఆనంద్. బుక్ ఫెయిర్ కి పాఠకులు రాలేదంటే దానర్థం ఆసక్తి లేదని కాదు. ఫిబ్రవరిలో పిల్లలకు పరీక్షలు, ఇతరత్రా పనులు ఉంటాయనేది నిర్వివాదాంశం. శని, ఆదివారాల్లో మాత్రమే జనం వచ్చారు. వచ్చిన వాళ్లందరూ పుస్తకాలు కొనాలని రూలేమీ లేదు. పీకాక్ క్లాసిక్స్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు ఏ గాంధీ అభిప్రాయంలో ‘పుస్తకం ఆఖరి అంశం. దానికి తోడు మార్కెట్ కూడా డల్ గానే ఉంది. పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థులు బయటకు రాలేదు. కొత్త పుస్తకాల సంఖ్యా తక్కువగానే ఉంది. ఇండివిడ్యువల్స్ ప్రచురించిన పుస్తకాలకు ఆదరణ ఉందన్నారు గాని అది ఆయా వ్యక్తుల పేరు ప్రతిష్టలను బట్టి ఉండవచ్చుననేది నా వ్యక్తిగత అభిప్రాయం’.
పుస్తక ప్రదర్శనకు అనుకున్నంతగా ఆదరణ లభించలేదా?
ఈ ప్రశ్నకు అవుననే చాలామంది అభిప్రాయమే వ్యక్తమైంది. చెన్నై, కోల్ కతా, ఢిల్లీ బుక్ ఫెయిర్లు అద్భుత విజయం సాధించినట్టు సోషల్ మీడియా హోరెత్తించింది. మరి హైదరాబాద్ ఫెయిర్ ఎందుకు కాలేదంటే ‘పుస్తక ప్రదర్శనలకు ఓ సీక్వెన్స్ ఉంటుంది. జాతీయ స్థాయి ప్రచురణ కర్తలు రావాలంటే ఏ ఒక్కదానికో రాలేదు. గత సంప్రదాయం ప్రకారం హైదరాబాద్ ప్రదర్శనకు వచ్చే పబ్లిషర్లు విజయవాడ, విశాఖపట్నం కూడా చూసుకుని స్వస్థలాలకు వెళతారు. అయితే ఈసారి ఆ సీక్వెన్స్ దెబ్బతింది. జాతీయ స్థాయి ప్రచురణ కర్తలు ఈసారి రాలేదు. వాళ్ల స్థానిక ఏజెంట్లు మాత్రమే కొన్ని ప్రచురణలను ప్రదర్శనకు పెట్టారు’ అని ఆనంద్ చెప్పారు. డిసెంబర్ లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం వరుస సెలవులు. డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులు వస్తాయి గనుక అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలు రిలాక్సింగ్ గా ఉంటారు. బయటకు వెళ్లి ఏదైనా ఆస్వాదించడానికి చాన్స్ ఉంటుంది. అందుకే ఆ సమయాన్ని ఎంచుకుంటారు. అందుకు భిన్నంగా ఈసారి శని, ఆదివారాల్లో మాత్రమే పుస్తక ప్రేమికులు ప్రదర్శనకు వచ్చారు. మిగతా రోజుల్లో పుస్తకాల స్టాల్స్ కంటే ‘మాడుగుల హల్వ, పాలకొల్లు కోవా, పూతరేకుల స్టాళ్ల వద్దే ఎక్కువ మంది ఉన్నారు’ అన్నారు ఓ ప్రచురణ సంస్థ యజమాని జి.రమేశ్ చంద్ర. వారంతపు సెలవు దినాల్లో తప్ప రద్దీ కనిపించలేదు. దీంతో సేల్స్ కూడా తగ్గాయి అనేది నిర్వివాదాంశం. గత ఏడాది నాలుగు స్టాళ్లు తీసుకున్న ఓ పేరున్న పబ్లిషర్ మొత్తం 33 లక్షల రూపాయల వ్యాపారం చేస్తే ఈసారి అది 60 శాతానికి పడిపోయింది. గత ఏడాది 40 వేల రూపాయల వ్యాపారం చేసిన ఓ సింగిల్ స్టాల్ యజమాని ఈసారి 20,25 వేలు కూడా అమ్మలేదు.
ఆది నుంచే వివాదాలు...
వీటన్నింటికి తగ్గట్టు నిర్వాహకులపై చిటపటలు, ప్రదర్శనకు వచ్చిన వాళ్ల నిరసనలు, ఏర్పాట్లు సరిగా లేవంటూ స్టాళ్ల యజమానులు రోజుకో పోస్టు సోషల్ మీడియాలో పెట్టి అల్లరి పాల్జేశారనే విమర్శలు ఉన్నాయి. స్టాళ్ల కేటాయింపులపై పెదవి విరిచిన వారు కొందరైతే ఎంట్రన్స్ గేటే అసౌకర్యంగా ఉందని, ఒక మనిషి లోపలికి పోవాలంటే జైల్లోకి వెళ్లినట్టు ఉండాల్నా అన్నారు సందర్శకుడు, పుస్తక ప్రేమికుడైన అబ్దుల్ రవూఫ్. 145 మంది ప్రచురణకర్తలు ఈ ప్రదర్శనకు హాజరైతే వ్యాపారం సరిగా సాగలేదన్న వాళ్లే ఎక్కువ.
పది రోజుల పాటు సాగిన ఈ బుక్ ఫెయిర్ లో తెలుగు, ఇంగ్లీష్ సహా పలు భాషలకు సంబంధించిన మొత్తం 360 కి పైగా స్టాల్స్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బుక్ ఫెయిర్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై మనిషి మానసిక ఎదుగుదలకు పుస్తకాలు ఉపయోగకరంగా ఉంటాయన్నారు.ఈ ప్రదర్శనను ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య ప్రారంభించారు. పుస్తకంతోనే మనిషి పరిపూర్ణుడవుతాడానని, ఏ ఇంట్లో పుస్తకం ఉంటే ఆ ఇంట్లో ఓ పుణ్యాత్ముడు తోడున్నట్టేనన్నారు విఠలాచార్య. దేవుని రాజ్యం నీలోనే ఉంది’ అనే పుస్తకం చదవడం వలన గాంధీజీ మహాత్ముడయ్యాడని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలు మూతపడే స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్త్రీవాద రచయితల గొడవ...
జాతీయ పుస్తక ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలు కూడా వివాదాస్పదం అయ్యాయి. శ్రీ గురు నృత్యాలయ అకాడమీకి చెందిన చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శన సాగుతున్న సమయంలో నిర్వాహకులు అర్ధాంతరంగా ఈ ప్రదర్శనను నిలిపివేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పుస్తక ప్రదర్శన నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరీ గౌరీ శంకర్ వేదికపై నుంచి చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో పుస్తక ప్రదర్శనలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా స్త్రీవాద రచయిత్రులు ఏర్పాటు చేసిన మీటింగ్ కూడా రసాభాస పాలైంది. సమావేశం నిర్వహాకులకు, పుస్తక ప్రదర్శన నిర్వాహకులకు మధ్య సమన్వయ లోపం కారణంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఎంతో మంది అభ్యుదయ వాదులున్న పుస్తక ప్రదర్శన నిర్వాహకులు సైతం స్త్రీల పట్ల వివక్ష చూపుతున్నారని స్త్రీవాద రచయిత ఎం. రచన ఆరోపించడం కలకలం సృష్టించింది. ఇవన్నీ ఎలా ఉన్నా ‘తెలుగు భాషకు పట్టం కడుతూ అన్ని భాషలకు ప్రాధాన్యం కల్పిస్తూ హైదరాబాద్లోని గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి నిలువుటద్దంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిలిచిందని’ జూలూరు గౌరీశంకర్ అభివర్ణించారు.
గద్దర్ ప్రాంగణం….
36వ జాతీయ పుస్తక ప్రాంగణానికి ‘‘గద్దర్ ప్రాంగణం’’ అని పేరు పెట్టారు. పుస్తక ప్రదర్శన వేదికకు ‘‘రవ్వా శ్రీహరి’’ వేదికగా నామకరణం చేశారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో తెలంగాణ అమర వీరుల స్తూపాన్ని నెలకొల్పారు. బుక్ రీడింగ్ పెంచటం కోసం చేసిన ఓ మంచి ప్రయత్నమే ఈ పుస్తక ప్రదర్శన. పూర్తిగా సక్సెస్ కాకున్నా విఫలమైతే కాదన్న మాజీ లైబ్రేరియన్ టి.నరసింహారావు అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించవచ్చు.


