నన్ను ఓడించినందుకు మీకు ధన్యవాదములు: స్టాలిన్
x

నన్ను ఓడించినందుకు మీకు ధన్యవాదములు: స్టాలిన్

అసెంబ్లీలో బలవంతంగా టీవీకే రీల్స్ పాలన చూడాల్సి వచ్చేదని వ్యాఖ్య


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినందుకు కొలత్తూర్ ప్రజలకు ఆయన శనివారం కృతజ్ఞతలు తెలిపారు. వ్యంగ్యం, రాజకీయ విమర్శలతో ప్రసంగం చేసిన ఆయన... చాలాకాలం నుంచి తాను ప్రాతినిధ్యం వహించిన సీట్ ను కోల్పోవడం వల్ల విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం శాసనసభలో చేస్తున్న క్రూరత్వాలు చూసే అవకాశం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.

‘‘నేను కొలత్తూర్ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ దుర్మార్గాలను చూసే అవకాశం ఇవ్వలేదు. కొలత్తూర్ ప్రజలకు కోట్లాది నమస్కారాలు.’’ అని రెండు చేతులు పైకెత్తి పార్టీ కేంద్ర కార్యాలయమైన అన్నా అరివాలయంలో జరిగిన ముప్పెరుం విళా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నిజమైన పాలన ఇచ్చిందని, టీవీకే రీల్ గవర్నెన్స్ నడుపుతోందని అన్నారు.

పాలనలో వైఫల్యం...

కొలత్తూర్ లో తన ఓటమిని కాస్త ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. కొలత్తూర్ అసెంబ్లీ నుంచి ఆయన గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలగా గెలుస్తూ వస్తున్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి బాబు చేతిలో అనూహ్యంగా 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనిపై కూడా ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఒక వేళ ఇక్కడ గెలిచి ఉంటే అసెంబ్లీ బలవంతంగా టీవీకే ప్రభుత్వం చేస్తున్నా సినిమా హడావుడిని చూడాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు.
తమిళనాడు ప్రభుత్వం రెండే రెండు అంశాలతో పోటీ పడుతోందని ఆయన ఆరోపించారు. ఒకటి పగటి పూట సైతం విద్యుత్ కోతలు, రెండోది కొడవలి దాడులతో అల్లాడుతోందని విమర్శించారు. విజయ్ ప్రభుత్వం పాలనపరంగా ఘోరంగా విఫలమైందని అన్నారు.
లా అండ్ ఆర్ఢర్ రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదని, హత్యలు, కాల్పులు చోటు చేసుకుంటున్నాయని, ఇందులో అధికార పార్టీ సభ్యుల హస్తం ముందని ఆరోపించారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల కేసులలో వీరి టీవీకే సభ్యులు పోటీలు పడుతున్నారని విమర్శలు గుప్పించారు.
అధిక లోడ్ కారణంతో అర్థరాత్రులు కరెంట్ కోతలు అమలు చేస్తున్నారని, కుటుంబాలు తమ పిల్లలతో నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. తమిళనాడును క్రిమినల్స్ కు ఆటస్థలంగా మార్చిందని, ఇది ఒక పనికిరాని గవర్నమెంట్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

విజయ్ లక్ష్యంగా దాడులు...

అసెంబ్లీ లో విజయ్ అనుసరిస్తున్న శైలిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. విజయ్ సినిమాలు ఆపేస్తున్నట్లు ప్రకటించారు కానీ.. అది అసెంబ్లీలో జరగుతోందని అన్నారు. ‘‘ సినిమాల్లో నటించడం ఆపేశానని చెప్పారు. కానీ డైరెక్టర్, కెమెరామెన్ ఎవరో చెప్పకుండా ప్రజల ముందు నటిస్తున్నాడు. మొదట పంచ్ డైలాగ్ లు, తరువాత్ బార్ షూటింగ్ లు, ఇలా ఏదీ తీసుకున్నా రీల్స్, అసెంబ్లీ తన గౌరవాన్ని ఎప్పుడో కోల్పోయింది’’ అని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మీసా, సర్కారియా కమిషన్ ద్వారా ప్రభుత్వాలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘ నేను నా మీసా అరెస్ట్ ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరూ నా త్యాగానికి విలువ కట్టే అర్హత అక్కడ ఎవరికి లేదు.’’ ఆ రికార్డులు చిట్టీ బాబు జైలు డైరీలోనూ, ఎంజీ రామచంద్రన్ నియమించిన ఇస్మాయిల్ కమిషన్ లో ఉందని ఆయన అన్నారు. దాన్ని చదవాలనుకుంటే తీసుకుంటే చదువుకోవచ్చని సూచించారు.

డీఎంకేదే భవిష్యత్...

టీవీకే కు సొంత మెజారిటీ లేదని, కేవలం బేరాసారాలా ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజీనామా సిరా ఆరకముందే మధురాంతకం, ధారపురంలో ఉప ఎన్నికలు తీసుకొచ్చిందని అన్నారు. టీవీకే కు కొత్త పేరు పెట్టిన స్టాలిన్.. దాన్ని తమిళ రీల్స్ కజగం పేరు పెట్టాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
2026 ఫలితంపై ఆయన మాట్లాడుతూ... ఓట్ల వాటాలో డీఎంకేకు, టీవీకే కు కేవలం 17 లక్షల ఓట్లు మాత్రమే అన్నారు. పార్టీ తన ప్రత్యర్థిని కాస్త ముందుగానే గుర్తించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని వ్యాఖ్యానించారు. గెలుపు ఓటములు కాదు.. సిద్దాంతమే కొలమానం అని వ్యాఖ్యానించారు. గత 75 ఏళ్లుగా ఒక సిద్దాంతం మీద నిలబడిన ఉద్యమం తిరిగి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో తాను అహంకారం, దురహంకారం తో జరుగుతున్నాయని, వాటికి గుణపాఠం నేర్పడానికి మొదటి అవకాశం అని ఆయన అన్నారు.
Read More
Next Story