
‘‘కర్ణాటకలో మతమార్పిడి నిరోధక చట్టం రద్దు చేయాలి‘‘
కాంగ్రెస్‌కు ఆర్చ్‌బిషప్ పీటర్ మచాడో డిమాండ్, తలుచుకుంటే అందరిని మతం మార్చేవారమని ప్రకటన
కర్ణాటకలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై క్రైస్తవ మత పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మతమార్పిడి నిరోధక చట్టం, గోవధ నిషేధ చట్టాలను ఉపసంహరించుకోవాలని బెంగళూరు ఆర్చ్‌బిషప్ పీటర్ మచాడో డిమాండ్ చేశారు.
ఈ చట్టాల కారణంగా క్రైస్తవులతో పాటు చిన్న రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్లో జరగనున్న బెలగావి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పీటర్ మచాడో స్పష్టం చేశారు. కర్ణాటకలో ప్రస్తుతం అమల్లో ఉన్న మతమార్పిడి నిరోధక చట్టం క్రైస్తవుల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈ చట్టం కింద 32 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
చిన్న ప్రార్థనా సమావేశాలకు హాజరైనవారిని, పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నవారిని, చర్చి నుంచి బయటకు వస్తున్నవారిని కూడా అరెస్టు చేసిన ఘటనలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పరిణామాలు ప్రజలు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించగలుగుతున్నారా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు.‘‘ఏదైనా ఫిర్యాదు వస్తే మేము తప్పకుండా చర్య తీసుకుంటాము. కానీ దాని కోసం మాకు ప్రత్యేక మత మార్పిడుల నిరోధక చట్టం అవసరం లేదు’’ అని ఆయన అన్నారు.
ఆర్టికల్ 25న ఏమైంది..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికి తన మతాన్ని విశ్వసించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కును కల్పిస్తోందని మచాడో గుర్తుచేశారు. మతమార్పిడులపై ఫిర్యాదులు వస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని, అందుకోసం ప్రత్యేకంగా మరో చట్టం అవసరం లేదని పేర్కొన్నారు. క్రైస్తవ విద్యాసంస్థలు, ఆసుపత్రులను ఉపయోగించుకుని ఎవరినీ బలవంతంగా మతం మార్చడం లేదని స్పష్టం చేశారు.
కేవలం మతమార్పిడి నిరోధక చట్టమే కాకుండా గోవధ నిషేధ చట్టం విషయంలోనూ ప్రభుత్వం పునరాలోచించాలని మచాడో కోరారు. ఈ చట్టం వల్ల చిన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పశువుల ద్వారా పాలు, పేడను పొందుతూ జీవించే రైతులకు, అవి వృద్ధాప్యానికి చేరుకుని వ్యవసాయానికి పనికిరాని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
వృద్ధాప్యానికి చేరుకున్న పశువులను సంరక్షించేందుకు గోశాలలు ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చినా, ఆ సౌకర్యాలు అందుబాటులో లేవని ఆయన ప్రశ్నించారు. రైతులకు గోశాలలతో పాటు, పాత పశువుల స్థానంలో కొత్త పశువులను కొనుగోలు చేసేందుకు పరిహారం కూడా అందించాలని సూచించారు.
గోవధ నిషేధ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ వెనుక మరిన్ని వధలను ప్రోత్సహించాలనే ఉద్దేశం లేదని, పేద రైతుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విషయంలో క్రైస్తవ సంఘాలు కూడా రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు.
మైనారిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందని తాను ఆరోపించడం లేదని మచాడో చెప్పారు. అయితే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతుందని, అది కాంగ్రెస్‌కే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు.
క్రైస్తవ సంస్థలు అన్ని మతాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయని ఆయన వివరించారు. క్రైస్తవ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల్లో క్రైస్తవులు కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాగే క్రైస్తవ ఆసుపత్రుల్లోనూ మతంతో సంబంధం లేకుండా అందరికీ వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్య లేదా వైద్య సేవలను మతమార్పిడుల కోసం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు.‘‘మేము తలుచుకుంటే మా పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరిని మా మతంలోకి మార్చి ఉండేవాళ్లం.
కనీసం మీరు క్రైస్తవులైతే మీకు ఎక్కువ మార్కులు ఇస్తాను. ఆసుపత్రిలో మీకు మంచి చికిత్స అందిస్తానని అయినా వాళ్లకు చెప్పి ఉండేవాళ్లం. మేము ఆ పని ఎప్పటికీ చేయము’’ అని ఆయన అన్నారు. క్రైస్తవ సంస్థల ద్వారా ఒక్క వ్యక్తి అయిన బలవంతంగా మతమార్పిడికి గురయ్యారని నిరూపించడానికి ఎవరైనా ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
రిజర్వేషన్ కోసం డిమాండ్..
ఇక రాజకీయంగా తాము ఏ ఒక్క పార్టీకి అనుకూలం కాదని మచాడో స్పష్టం చేశారు. కేరళలో క్రైస్తవులను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో కర్ణాటకలోనూ అలాంటి పరిణామాలు ఉంటాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా క్రైస్తవులతో సహా పౌరులందరి సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉంటుందని చెప్పారు. బీజేపీ, జేడీఎస్ పార్టీల పట్ల క్రైస్తవులకు ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు కర్ణాటకలో క్రైస్తవులకు కేటగిరీ 3బీలో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ను కూడా ఆయన మరోసారి తెరపైకి తెచ్చారు. రాష్ట్ర జనాభాలో క్రైస్తవులు సుమారు రెండు శాతం ఉన్నారని, లింగాయత్ తదితర వర్గాలతో కలిసి ఉన్న 3బీ కేటగిరీలో తమకు ప్రత్యేకంగా ఒక శాతం వాటా కల్పించాలని కోరారు.
ఇటీవల కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులకు ఈ అంశాలను డిసెంబర్లో జరిగే బెలగావి శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని హామీ ఇచ్చినట్లు మచాడో తెలిపారు. అయితే ఈ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం దాదాపు నాలుగేళ్ల సమయం తీసుకున్నా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో క్రైస్తవ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పించిందని అంగీకరించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడం తమ ఉద్దేశం కాదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి తమ సమస్యలకు పరిష్కారం చూపాలన్నదే తమ అభిలాషని మచాడో స్పష్టం చేశారు. ఇప్పుడు బెలగావి సమావేశాల్లో ప్రభుత్వం ఈ అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.
Next Story

