‘‘విజయ్.. వచ్చే నెల కర్ణాటక పర్యటనకు రావొద్దు’’
x
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్

‘‘విజయ్.. వచ్చే నెల కర్ణాటక పర్యటనకు రావొద్దు’’

తమిళనాడు సీఎంకు, కర్ణాటక సీఎం విజ్ఞప్తి.. కావేరీ జలాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు


Click the Play button to hear this message in audio format

తమిళనాడు- కర్ణాటక మధ్య కావేరీ నదీ జలాల వివాదం తిరిగి రాజుకుంది. కావేరీ జల నిర్వహణ అథారిటీ(సీడబ్ల్యూఎంఏ) జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే ఉద్రిక్త పరిస్థితుల మధ్య తమిళనాడు సీఎం విజయ్ బెంగళూర్ పర్యటనను వాయిదా వేసుకోవడం ఉత్తమని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభ్యర్థించారు.

కావేరీ జలాలను పరిరక్షించేందుకు ఆగస్టు 13న రాష్ట్రవ్యాప్త సమ్మెకు కన్నడ అనుకూల సంస్థలు పిలుపునిచ్చాయి. కర్ణాటకే తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఇద్దరు నాయకుల మధ్య సమావేశానికి ఎలాంటి సమర్థన లేదని పేర్కొంటూ, దానిని కూడా వ్యతిరేకించాయి.

పర్యటన వాయిదా వేసుకోండి..

ఈరోజు బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్‌ను కర్ణాటకకు ఆహ్వానించడం సరికాదని అన్నారు. విజయ్ సౌహార్ద చర్చల కోసం పర్యటనకు అంగీకరించినప్పటికీ, ఆయన ఇప్పుడు వస్తే నిరసనకారులు ఆయనను చుట్టుముట్టి నినాదాలు చేసే అవకాశం ఉంది.
ఇది వివాదానికి దారితీయవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి పర్యటన పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఆగస్టు 3న బెంగళూరు విమానాశ్రయం వద్ద ప్రదర్శనలు నిర్వహిస్తామని నిరసన నాయకులు ఇప్పటికే హెచ్చరించారు.

కేఆర్ఎస్ జలాశయాన్ని ముట్టడించిన బీజేపీ..

వర్షపాతం తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, ఈ సంక్షోభ సమయంలో తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని ఖండిస్తూ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, రైతు సంఘాలు దక్షిణ కర్ణాటకలోని కృష్ణరాజ సాగర జలాశయాన్ని ముట్టడించి భారీ నిరసన చేపట్టాయి.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఆయన కుమారుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక తదితరుల నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జలాశయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముందుజాగ్రత్త చర్యగా, కర్ణాటక రాష్ట్ర రిజర్వ్ పోలీసులు, జిల్లా సాయుధ రిజర్వ్ దళాలను మోహరించగా, జలాశయం ప్రవేశ ద్వారాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఆగష్టు 13న కర్ణాటక బంద్..

బెంగళూరులో కన్నడ అనుకూల సంస్థలు సమావేశమై కావేరీ ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై చర్చించగా, ఆగష్టు 13న రాష్ట్రవ్యాప్త సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కార్యకర్త వటల్ నాగరాజ్ ప్రకటించారు. ఈ సమావేశానికి కర్ణాటక రక్షణ వేదికకు చెందిన నారాయణ గౌడ, ప్రవీణ్ శెట్టి వర్గాలతో పాటు శివరామే గౌడ, సారా గోవిందు సహా పలువురు నాయకులు హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా తమిళనాడుకు నీరు తరలిపోతోందని కార్యకర్తలు ఆరోపించారు. ఒకవేళ ఆగస్టు 3న విజయ్ వస్తే, విమానాశ్రయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమ్మె కారణంగా రవాణా, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

ఆదివారం అఖిలపక్ష సమావేశం.

రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న సీడబ్ల్యూఎంఏ ఆదేశాల నేపథ్యంలో, శివకుమార్ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డితో సహా కీలక ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపారు. తదుపరి చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలపై చర్చించేందుకు ఆదివారం (ఆగస్టు 2) అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. అఖిలపక్ష సమావేశంలో కూలంకషంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వం తదుపరి అధికారిక నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

జన నాయగన్ సినిమా ప్రదర్శనలు రద్దు..

ఇదిలా ఉండగా, కావేరీ నీటి సమస్య కారణంగా ముందుజాగ్రత్త చర్యగా కర్ణాటకలోని అనేక థియేటర్లు విజయ్ నటించిన జన నాయగన్ సినిమా ప్రదర్శనలను రద్దు చేశాయి. ఈ సినిమా జూలై 23న రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా థియేటర్లలో విడుదలైంది. కొన్ని థియేటర్లలో విజయ్ సినిమా పోస్టర్లను తొలగించారు. బెంగళూరులో, పోలీసుల సలహా మేరకు ఊర్వశి థియేటర్ పోస్టర్లు, కటౌట్‌లను తొలగించి, ప్రదర్శనలను రద్దు చేసి, జన నాయగన్ స్థానంలో కన్నడ సినిమా 'కారవాలి'ని ప్రదర్శించింది.
Read More
Next Story