అర్నాబ్ పోయిన వారానికే మురసు వస్తుందా?
x

అర్నాబ్ పోయిన వారానికే మురసు వస్తుందా?

ఈ నెల మూడున నెల్లూర్ - కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం


Click the Play button to hear this message in audio format

అర్నబ్ తుఫాన్‌ దెబ్బ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాన్‌ ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ వాయుగుండం వేగంగా ఏపీ తీరం వైపు కదులుతోంది. నవంబర్ 3న నెల్లూరు–కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలోనూ భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

భారత్ ఈ వాయుగుండానికి ‘మురసు’ అని పేరు పెట్టింది. తమిళంలో మురసు అంటే యుద్ధభేరీ అని అర్థం. ఇది తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇప్పటికే అర్నబ్ తుఫాన్ ఉత్తర కోస్తా ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు మురసు దక్షిణ కోస్తా వైపు దూసుకొస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్..

మురసు తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఏపీలోని కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోనూ తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. యానాంలో కూడా భారీ వర్షాలతో పాటు పిడుగులు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఒడిశాలోనూ ముందస్తు చర్యలు..

మురసు ప్రభావం ఒడిశాలోని దక్షిణ ప్రాంత జిల్లాలపైనా పడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించినట్లు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారీ తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

భువనేశ్వర్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ మనోరమ మొహంతి కూడా వర్షాలపై హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 2 నుంచి ఒడిశాలో వర్షాలు ప్రారంభమై, 3, 4 తేదీల్లో మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇప్పటికే అర్నబ్ తుఫాన్ కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మురసు కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మరోసారి వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


Read More
Next Story