విజయ్ పర్యటన కావేరీ జలాల సమస్యను పరిష్కరిస్తుందా?
x

విజయ్ పర్యటన కావేరీ జలాల సమస్యను పరిష్కరిస్తుందా?

తమిళనాడులో ఏకమైన రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు.. నీటి హక్కులు వదులుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు


Click the Play button to hear this message in audio format

కావేరీ నదీ జలాల వివాదం, ప్రతిపాదిత మేకెదాటు ప్రాజెక్ట్ పై కర్ణాటకతో సయోధ్య కుదుర్చుకోవడానికి తమిళనాడు సీఎం విజయ్, వచ్చే నెల మూడో తేదీన బెంగళూర్ కు వెళ్లబోతున్నాడు. ఆయన ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ తో చర్చలు జరపబోతున్నాడని సమాచారం. అయితే కర్ణాటక విధించే ఉచ్చులో పడకూడదని తమిళనాడు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఏకమై పలు హెచ్చరికలు సీఎంకు జారీ చేశాయి.

ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచనను చాలా పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి తోడు ప్రస్తుతం కావేరీ జల నిర్వహణ అథారిటీ(సీడబ్ల్యూఎంఏ) జారీ చేసిన ఉత్తర్వులను కూడా అమలు చేయవద్దని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై తమిళనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నీటి పంపిణీ సమస్యపై చర్చించి, "పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం" కోసం కృషి చేసేందుకు ముఖ్యమంత్రి విజయ్ బెంగళూరు పర్యటనకు వస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం (జూలై 30) ధృవీకరించిన తర్వాత తమిళనాడులో బలంగా వినిపిస్తున్నాయి. తనకు తమిళనాడు సీఎం నుంచి ఒక లేఖ అందిందని, సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని శివకుమార్ చెప్పారు.

అఖిలపక్ష సమావేశానికి పిలుపు..

డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తమిళనాడు ప్రభుత్వం మౌనం పాటిస్తోందని, స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి విజయ్ కర్ణాటక పర్యటనకు వచ్చిన రోజే తమ పార్టీ క్షేత్రస్థాయి ఆందోళన చేపడుతుందని ఆయన ప్రకటించారు.
ఆయన అఖిలపక్ష సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. తమిళనాడులో ప్రభుత్వం మారినప్పటి నుంచి మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్ కోసం కర్ణాటక తన ఒత్తిడిని తీవ్రతరం చేసిందని, అయితే రాష్ట్రం నుంచి మాత్రం స్పందన నిలిచిపోయిందని స్టాలిన్ ఆరోపించారు.
"కావేరీ నియంత్రణ కమిటీ నీటిని విడుదల చేయాలని ఆదేశించినప్పటికీ, కర్ణాటక ముఖ్యమంత్రి దానిని అమలు చేయలేమని చెప్పారు. అయినా తమిళనాడు ముఖ్యమంత్రి మౌనంగానే ఉన్నారు" అని ఆయన విమర్శించారు. ఈ పర్యటన మేకెదాటు సమస్యపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తమిళనాడు అసెంబ్లీ డిమాండ్‌ను నీరుగారుస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

ఎండిపోయిన కావేరీ డెల్టా చూపించాలి..

'ఎండిపోయిన కావేరీ డెల్టాను చూడాలని విజయ్ శివకుమార్‌ను అడగాలి' అని తంజావూరులో జరిగిన అత్యవసర సమావేశం అనంతరం కావేరీ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.ఆర్. పాండియన్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ పర్యటన జరిగితే, ఎండిపోయిన కావేరీ డెల్టాను పరిశీలించడానికి శివకుమార్‌ను తనతో పాటు తిరిగి తీసుకురావాలని సీఎం విజయ్ ను కోరారు.
"ఒకవేళ ఈ పర్యటన వ్యక్తిగత స్నేహం కారణంగా జరిగితే, తిరుగు ప్రయాణంలో తమిళనాడు ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఎండిపోయిన డెల్టా ప్రాంతాలను చూపించడానికి తీసుకురావాలి. 50 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న హక్కులను చర్చల పేరుతో వదులుకోకూడదు" అని పాండియన్ అన్నారు.
సీడబ్ల్యూఎంఏ (CWMA) ఆమోదం లేకుండా మేకెదాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు లభించవని కేంద్రం ఇప్పటికే పార్లమెంటుకు చెప్పినందున, తమిళనాడు తప్పనిసరిగా చట్టబద్ధమైన మార్గాన్నే అనుసరించాలని ఆయన అన్నారు.

మేకెదాటుపై అన్బుమణి ప్రకటన..

ఆగస్టు 1న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటనకు ముందు పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్ ఒక ప్రకటన చేశారు. "మేకెదాటు తమిళనాడుకు వ్యతిరేకమని, దానిని నిర్మించకూడదని రాహుల్ గాంధీ చెబితే, మేము జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి వైదొలుగుతాము." మేకెదాటుపై ముఖ్యమంత్రి-ముఖ్యమంత్రుల మధ్య జరిగే ఏ చర్చలైనా తమిళనాడు ప్రయోజనాలకు హాని కలిగిస్తాయని, ఎందుకంటే రాష్ట్రం ఈ ప్రాజెక్టును అంగీకరించలేదని, గుర్తించలేదని అన్బుమణి అన్నారు.
"గుర్తింపు లేని పథకంపై కర్ణాటకతో చర్చలు జరపడంలో అర్థం లేదు. ఈ చర్చలు కేంద్రంతో, ప్రధానమంత్రితో జరగాలి" అని ఆయన అన్నారు. డీపీఆర్‌ను ఉపసంహరించుకోవాలని, డ్యామ్‌ను ఆపాలని ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు.
కర్ణాటక ప్రస్తుతం 62 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకున్నప్పటికీ, గత నెలలో వరుసగా రెండు సీడబ్ల్యూఎంఏ విడుదల ఉత్తర్వులను ధిక్కరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "మేకెదాటు నిర్మాణం జరగకముందే నీటిని నిరాకరిస్తున్న ప్రభుత్వంతో మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు.
ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ, కర్ణాటకలోని కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని కూడా ఆయన ఆరోపించారు. తదుపరి చర్యల కోసం తాను తమిళనాడు రాజ్యసభ సభ్యులతో సమన్వయం చేసుకుంటున్నానని చెప్పారు.

మేకెదాటుపై కర్ణాటక ఇటీవలి చర్యలు..

మేకెదాటు విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలనుకోవడానికి కర్ణాటక ఇటీవలి చర్యలు సంకేతాలని తమిళనాడు ప్రతిపక్ష నాయకులు పేర్కొంటున్నారు.
జూన్ 11: శివకుమార్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరారు.
జూన్ 12: అనుమతి కోసం ఒత్తిడి చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు.
జూలై 27: దిగువన ఉన్న రాష్ట్రాల అనుమతి అవసరం లేదని పార్లమెంటరీ సమాధానంలో పేర్కొన్న విషయాన్ని ఉటంకిస్తూ, శివకుమార్ ఢిల్లీలో అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు అదే రోజు, రామలింగారెడ్డి మరియు సీనియర్ అధికారులు విడిగా ప్రాజెక్ట్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
కావేరీ, మేకెదాటు సమస్యలు కేవలం అధికార టీవీకే పార్టీకి మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రానికి సంబంధించినవని వాదిస్తూ, తమిళనాడు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతుల ప్రతినిధులను సంప్రదించాలని పలు పార్టీలు, రైతు సంఘాలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి.
Read More
Next Story