
ఈ ఫలితాలను అంగీకరించేది లేదు: టీఎంసీ
ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయన్న టీఎంసీ అభ్యర్థులు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కమలదళం స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతోంది. అయితే టీఎంసీ ఈ ఫలితాలను అంగీకరించలేకపోతోంది. ఈ ఎన్నికల ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొంది.
చాలా అనుమానాస్పదం..
ఉత్తర కోల్‌కతాలోని మణిక్తలా నియోజకవర్గం టీఎంసీ అభ్యర్థి శ్రేయా పాండే, బీజేపీ అభ్యర్థి తపస్ రాయ్ కంటే వెనుకబడి ఉంది. అయితే తామే ఈ సీటు గెలుస్తామన్న టీఎంసీ అభ్యర్థి శ్రేయా పాండే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. "ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది. కానీ ఇది కేవలం మొదటి రౌండ్ మాత్రమే. నేను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాను" అని పాండే అన్నారు. టీఎంసీ అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు ఎన్నికల సంఘం సహకరించడం లేదని ఆమె ఆరోపించారు.
"20 రౌండ్లలో, కేవలం ఒకటి మాత్రమే పూర్తయింది. మిగిలిన వాటి కోసం వేచి ఉండండి. రాష్ట్రంలో మళ్లీ టీఎంసీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది" అని ఆమె అన్నారు.
శశి పంజా ఆరోపణ..
ఈ రోజు ఉదయం టీఎంసీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి శశి పంజా, నగరంలోని కౌంటింగ్ కేంద్రాల్లోకి రాజకీయ పార్టీల ఏజెంట్ల ప్రవేశాన్ని ఎన్నికల సిబ్బంది ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లపై సిబ్బందికి పూర్తి అవగాహన లేదని ఆమె పేర్కొన్నారు. పంజా మాట్లాడుతూ, “కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద గందరగోళం నెలకొనడంతో ఎన్నికల సిబ్బంది లెక్కింపు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. ఏర్పాట్లపై వారికి స్పష్టత లేనట్లుగా కనిపిస్తున్నందున, వారు కౌంటింగ్ ఏజెంట్ల ప్రవేశాన్ని ఆలస్యం చేస్తున్నారు” అని అన్నారు.
లెక్కింపు ఆలస్యంపై టీఎంసీ నాయకురాలి ఫిర్యాదు:
పార్టీకి చెందిన కాక్‌ద్వీప్ అభ్యర్థి మంతురామ్ పఖిరా కూడా ఇలాంటి ఆరోపణే చేశారు. కేంద్రంలో ఓట్ల లెక్కింపు గంట ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. చాలా మంది కౌంటింగ్ అధికారులు “ఇంకా తమ తమ టేబుళ్ల వద్దకు చేరుకోలేదని, ఇది ఎన్నికల సంఘం పూర్తి దుర్వినియోగాన్ని చూపిస్తోందని” పఖిరా అన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని 77 కేంద్రాలలో, 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 293 నియోజకవర్గాలకు రెండు అంచెల భద్రతా వలయం నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ లెక్కింపు 2,926 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తోంది. ఫల్తా నియోజకవర్గం మొత్తానికి మే 21న తిరిగి పోలింగ్ జరగనుంది.
Next Story

