‘‘బ్యాంకు అధికారుల వల్లే సోదరి అస్థిపంజరం తీసుకువచ్చారు’’
x
ఒడిశా శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మోహన్ మాఝీ

‘‘బ్యాంకు అధికారుల వల్లే సోదరి అస్థిపంజరం తీసుకువచ్చారు’’

ఒడిశా ముఖ్యమంత్రి మాఝీ వివరణ, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హమీ


Click the Play button to hear this message in audio format

బ్యాంకులో తన సోదరి ఖాతాలో జమ అయిన రూ. 20 వేలను విత్ డ్రా చేసుకోవడానికి చనిపోయిన సోదరీ అస్థి పంజరాన్ని బ్యాంకుకు తీసుకువచ్చిన గిరిజనుడి విషయంలో బ్యాంకు అధికారులు కర్కశంగా వ్యహరించారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

చనిపోయిన ఆమెను తీసుకురమ్మని బ్యాంకు అధికారులు పదేపదే పంపించివేయడంతో బాధిత గిరిజనుడు ఆమె ఆస్థిపంజరాన్ని తీసుకుని బ్యాంకుకు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
అస్థిపంజరాన్ని బ్యాంకు శాఖకు తీసుకువెళ్తున్న వీడియో క్లిప్ వైరల్ అయింది. ఈ వీడియో తీవ్ర కలకలం రేపిన తర్వాత, ఒడిశా ప్రభుత్వం గురువారం ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ విషయంపై విచారణ జరపాలని ఉత్తర డివిజన్ రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (RDC)ని ఆదేశించారు.
ఉత్తర డివిజన్ RDC సంగ్రామ్ కేశరి మహాపాత్ర, కియోంఝర్ జిల్లా కలెక్టర్ విశాల్ సింగ్ ఇతర అధికారులతో కలిసి ఒడిశా గ్రామీణ బ్యాంకు మాలిపోసి శాఖకు వెళ్లారు. ఒడిశా గ్రామీణ బ్యాంకుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తోంది.
అధికారుల ప్రకారం.. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను నిర్ధారించుకోవడానికి మోహపాత్ర సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, బ్యాంకు అధికారులను ప్రశ్నించారు.

తప్పు బ్యాంకు శాఖదే..

ప్రాథమిక విచారణలో "బ్యాంకే తప్పు చేసిందని" తేలిందని, ఈ మొత్తం ఉదంతానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మోహపాత్ర అన్నారు.
"నేను బ్యాంకు అధికారులతో, జీతూ ముండాతో మాట్లాడాను. ప్రాథమిక విచారణలో బ్యాంకు తప్పిదం ఉన్నట్లు తేలింది. ముండా, అతని సోదరి గతంలో చాలాసార్లు బ్యాంకుకు వచ్చి డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. ముండా నిరక్షరాస్యుడు కాదు. కానీ అతనికి బ్యాంకింగ్ విధానాలపై అవగాహన లేదు" అని మోహపాత్ర విలేకరులతో అన్నారు.
"సీసీటీవీ ఫుటేజీకి ఆడియో వెర్షన్ లేనందున, బ్యాంకు సిబ్బంది అతనికి సరిగ్గా ఏమి చెప్పారో మేము నిర్ధారించలేకపోతున్నాము. ముండా ఉదయం 11.26 నుంచి 11.58 వరకు బ్యాంకులో ఉన్నాడు. ఈ సమయంలో, అతను బ్యాంకు మేనేజర్‌ను రెండుసార్లు కలిసి మనస్తాపంతో తిరిగి వెళ్ళాడు" అని ఆర్‌డీసీ తెలిపారు.

పట్నాయక్ విమర్శలు...

ఈ రోజు ఉదయం, మహిళా రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బీజేడీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ కెయోంఝర్ ఘటనను ప్రస్తావించారు. "సున్నితత్వం లేని" రాష్ట్ర ప్రభుత్వం "ఒడిశా ప్రజలను పూర్తిగా ద్రోహం చేసిందని" విమర్శలు గుప్పించారు.
గిరిజనుడి దుస్థితిని "బాధాకరం"గా అభివర్ణిస్తూ.. "తన న్యాయమైన హక్కులను పొందడం కోసం, ఒక మహిళ మరణాన్ని నిరూపించడానికి ఆమె కుటుంబ సభ్యులే ఆమె అస్థిపంజరాన్ని వెలికితీసి బ్యాంకుకు తీసుకువెళ్లాల్సి రావడంతో ఒడిశా సిగ్గుతో తల దించుకుంది" అని విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని "డబుల్ ఇంజిన్ ప్రభుత్వం"పై విమర్శలు గుప్పించారు. "ఒడిశా చరిత్రలో ఇంతటి అమానవీయ పాలనను ఎన్నడూ చూడలేదు" అన్నారు. "ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళల గౌరవం, సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదు. పాలన కేవలం కథనాలు, ఆర్భాటాలకు పరిమితమైపోయింది. ముఖ్యమంత్రి ఇంకేమైనా ప్రకటనలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి." అని విమర్శలు గుప్పించారు.
ఇటీవల లోక్‌సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు గురించి కూడా పట్నాయక్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసనసభలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లో పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని అన్నారు.
"ఈ బిల్లుకు బీజేడీ పార్లమెంటులో మద్దతు ఇచ్చింది, దానిని తక్షణమే అమలు చేయాలని ఈ రోజుకీ మేము డిమాండ్ చేస్తున్నాము" అని పట్నాయక్ అన్నారు. 2019, 2024లలో రాష్ట్రంలోని 33 శాతం లోక్‌సభ స్థానాల్లో తమ బీజేడీ మహిళలను బరిలోకి దింపిందని ఆయన చెప్పారు. "బీజేపీ కూడా అదే చెప్పుకోగలదా? మహిళల హక్కుల గురించి పైపై మాటలు చెప్పడం, ప్రజలను మోసం చేయడానికి తప్పుడు కథనాలు సృష్టించడం తప్ప అది చేసింది ఏమిటి? ప్రజలను ఎల్లప్పుడూ మోసం చేయలేరు." అని ఆయన ప్రశ్నలు గుప్పించారు.

స్పందించిన కాంగ్రెస్..

కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు రామచంద్ర కదమ్ కూడా కియోంఝర్ ఘటనను ప్రస్తావించారు. "ఒక నిరుపేద గిరిజనుడిని తన సోదరి మరణానికి సాక్ష్యంగా ఆమె అస్థిపంజరాన్ని తవ్వితీసేలా బలవంతం చేశారు. గిరిజనుల హక్కులను పరిరక్షించడానికి ఈ ప్రభుత్వం పీఈఎస్ఏ నిబంధనలను అమలు చేయలేదు" అని అన్నారు.
"కాంగ్రెస్ ఎల్లప్పుడూ మహిళల భద్రత, రక్షణ కోసం పోరాడింది. మేము ఎల్లప్పుడూ మహిళల హక్కుల పక్షాన నిలబడతాము" అని కదమ్ అన్నారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజైన మంగళవారం, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియపై అవగాహన లేకపోవడం, బ్రాంచ్ మేనేజర్ వివరించిన విధానాలను ఆ వ్యక్తి అంగీకరించడానికి ఇష్టపడకపోవడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు కనిపిస్తోందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) తెలిపింది.
Read More
Next Story