పేరు మారినా రంగు ఒకటే.. అదే టీఆర్ఎస్, అదే బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం చేసిన పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబలకు తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డిన ఈ పదేళ్లలో ఒరిగింది ఏమీలేదు.


పేరు మారినా రంగు ఒకటే.. అదే టీఆర్ఎస్, అదే బీఆర్ఎస్
x
Bharata Rastra Samithi Party chief KCR

తెలంగాణ వాదుల ముందు ఇప్పుడో ఇబ్బంది వ‌చ్చింది. తెలంగాణ దశాబ్ది సంబ‌రాలు చేసుకుంటున్న‌ వేళ అప్పుడే పార్టీకి వ్య‌తిరేక ప‌వ‌నాలున్నాయ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలవరపడుతున్నారు. దీనికి కారణం టీఆర్ఎస్ (TRS Party) పార్టీని ఉన్న‌ట్టుండి భారత రాష్ట్ర సమితి (Bharatha Rastra Samithi, BRS) గా మార్చడమే. తెలంగాణ‌ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ విజయావకాశాలు గల్లంతు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నాయని పార్టీలోని సీనియ‌ర్‌ నేతలు ఆందోళన చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం దశాబ్దల పాటు పోరాటం చేసి సాధించుకొంటే.. అందుకు టీఆర్ఎస్ కేంద్ర బిందువు అయ్యింది. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రత్యేక రాష్ట్రం వ‌చ్చిన తరువాత జరిగిన ప్రతీ ఎనికల్లో టీఆర్ఎస్ పార్టీయే విజయం సాధించింది. 2023 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అంత సులభం కాదని ఆపార్టీ నేతలు కలత చెబుతున్నట్లు అర్థం అవుతోంది. ప్ర‌స్తుతం ఎక్కడ ఎన్నికల సభలు జరిగినా పార్టీ అధినేత కేసీఆర్ మళ్ళీ తెలంగాణా ద్రోహులు వస్తున్నారంటూ ఊక‌దంపుడు ప్రసంగాలు మొదలెట్టారు. బీఆర్ఎస్ పార్టీగా పేరు మార‌క ముందు "మన తెలంగాణ" అంటూ ప్ర‌సంగాల‌ను మొద‌లుపెట్టే కేసీఆర్, ఇప్పుడు త‌న మాట‌... పాట.. అప్పుడున్న యాస ప్రాస అన్నీ మార్చాల్సి వ‌చ్చింది. అలాగే జాతీయ‌ కాంగ్రెస్ పార్టీ నేతలపై నేరుగా నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణను ప్ర‌త్యేక‌ రాష్ట్రంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా తుడుచుకుపోయింది. దీనికి కారణం ప్ర‌త్యేక రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లే వచ్చిందని ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకుపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం చేసిన పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబలకు తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డిన ఈ పదేళ్లలో ఒరిగింది ఏమీలేదు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలోని కేసీఆర్ ప్ర‌భుత్వంలో గొప్పగొప్ప పదవుల్లో ఉన్నారు.

దీనికి తోడు కేసీఆర్ దేశంలోని బీజేపీ యేతర ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపారు. జాతీయస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టాల‌ని కేసీఆర్ సిద్ద‌మైయ్యారు. జాతీయ రాజకయాల్లోకి వెళ్లి, తన కొడుకు కేటీఆర్ కి తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలనుకుంటున్న నిర్ణయంపై తెలంగాణా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున లేచిన స‌మ‌యంలో అమెరికాలో ఉద్యోగంలో చేస్తున్నారు. కేటీఆర్‌. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే ఉద్యోగాన్ని వ‌దిలి హైద‌రాబాద్ మ‌కాం మార్చారు. ఆపైన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో సిరిసిల్ల నుండి పోటీ చేసి రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి కీలకమైన రాజకీయ పదవులు అప్పగించడం కూడా వ్య‌తిరేక‌త‌కు మ‌రో కారణం. పైగా నిన్నటి వరకు టీఆర్ఎస్ గా వున్న పార్టీని ఒక్కసారిగా బీఆర్ఎస్ గా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో మరో నష్టం కలిగించే అంశం. జాతీయపార్టీగా టీఆర్ఎస్ పార్టీని మార్చినప్పటి నుండి తెలంగాణాలో ఎక్కకికక్కడ వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. కేసీఆర్ దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి సమాధానం చెప్పాలని చూస్తోంది. తెలంగాణ ఏర్పాటైన‌ తరువాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని త‌న కుటుంబ సభ్యులతో కలిసిన సమయంలో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. తిరిగి హైరాబాద్ వచ్చిన తరువాత కేసీఆర్‌ మాటమర్చారు. దీంతో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎంతో గుర్రుగా ఉంది. అదే అంశాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచార అస్త్రంగా మలుచుకుని దూసుకుపోతున్నారు. 2023 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అధిష్టానం రేవంత్ రెడ్డికి అప్పగించారు. దీంతో ఒక జాతీయ పార్టీ యువనేతను తెరమీదికి తెచ్చింది. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణలో గ‌త ప‌దేళ్ల‌లో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఆలవోక‌గా అందిపుచ్చుకొని ఎంతో లాఘవంగా ముందుకు వెళ్లడం లో కాంగ్రెస్ పార్టీ మ‌రింత పట్టు సాధించింద‌ని చెప్పొచ్చు.

కేసీఆర్ నోట ఇప్పుడు ప్రాంతీయ పార్టీలదే కేంద్రంలో అధికారం అంటూ చేసిన వ్యాఖ్యలు మ‌రిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీని (TRS-Regional Party) జాతీయపార్టీ గా(BRS-National Party) చేసిన‌ కేసీఆర్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల పాట ఎందుకని తెలంగాణ ప్రజలు గుర్రుగా ఉన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తోంది ప్రాంతీయ పార్టీయా... ? లేక‌ జాతీయ పార్టీయా.. ? అని ప్రజలు ఆగ్ర‌హిస్తున్నారు. ప్రజల నాడి గుర్తుపట్టి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జాతీయపార్టీ కాదు మన తెలంగాణ పార్టీయే అనేట్టుగా ప్రసంగాలు చేస్తున్నారు. అందుకే కేసీఆర్ నోట కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే అధికారం అంటు కొత్త ప‌ల్లివిని అందుకున్నారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నిజామాబాద్ జిల్లా నేత తిప్రిక హరికృష్ణ అన్నారు. భళా తందనాన తాని తందానా అంటూ తెలంగాణ ప్రజలు తన మాటకు వంత‌పాడతారని కేసీఆర్ అనుకుంటున్నార‌ని అన్నారాయ‌న‌. చూద్దాం... బీఆర్ఎస్ ఈ ఎన్నిక‌ల్లో గెలుస్తుందా..? లేక తెలంగాణ సెంటిమెంట్‌తో ఓట‌మిపాల‌వుతుందా..? వేచిచూద్దాం..

Next Story