ఇళ్లలో పనిచేసే రాహుల్ మీనా అనే వ్యక్తి 12 గంటల వ్యవధిలో రెండు అత్యాచారాలు, ఓ హత్యకు పాల్పడ్డాడు. మొదట రాజస్థాన్ లోని తన ఇంటి పక్క మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు, తరువాత ఢిల్లీకి వెళ్లి తనను పనిలో నుంచి తీసేసిన ఐఆర్ఎస్ అధికారి కూతురును అత్యంత దారుణంగా కొట్టి అత్యాచారం చేయడమే కాకుండా తరువాత కిరాతకంగా హతమార్చాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి సుమారు 10.30 గంటలకు మీనా అల్వార్‌లోని తన ఇంటి పక్కన నివసించే మహిళ ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై దాడి చేశాడు. అత్యాచారం చేయడానికి ముందు ఆమె నోరు మూసి, నేలపై పడేశాడని ఆరోపణలు ఉన్నాయి. అతను బాధితురాలి శరీరంపై పలుచోట్ల పంటి గాయాలు చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే, ఆమెను, భర్తను, పిల్లలను చంపేస్తానని హెచ్చరించాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అల్వార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మరుసటి రోజు ఉదయానికల్లా మీనా ఢిల్లీ చేరుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీలో అతను ఉదయం 6.39 గంటలకు అమర్ కాలనీలోని ఒక హౌసింగ్ సొసైటీలోకి ప్రవేశించి, తన మాజీ యజమాని ఫ్లాట్‌కు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అతను ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం 8 గంటలకు బాధితురాలి తల్లిదండ్రులు జిమ్ నుంచి తిరిగి వచ్చేసరికి, యూపీఎస్ కి సిద్ధమవుతున్న తమ కుమార్తె తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని చూశారు. ఆమె బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. నడుము కింద భాగం నగ్నంగా ఉంది.
మీనా తన కుమార్తెపై ఆమె ఇంటి పైకప్పుపై ఉన్న స్టడీ రూమ్‌లో వెళ్లి దాడి చేసి, ఆమె నోరు మూసి, గొంతు నులిమి, ఇంట్లో ఉండే వస్తువులతో కొట్టి, ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఆ తర్వాత, అతను ఆమె వేలితో లాకర్‌ను తెరవడానికి ప్రయత్నించాడు. నగదు, నగలు దొంగిలించడానికి స్క్రూడ్రైవర్‌తో దాన్ని పగలగొట్టాడు. పారిపోయే ముందు, అతను బాధితురాలి సోదరుడి బట్టలు మార్చుకున్నాడు.
పోలీసుల దర్యాప్తు..
అనుమానితుడిని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు 15 బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలో అతను ఒక దుస్తులలో కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి, గంట తర్వాత మరో దుస్తులలో బయటకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఫుటేజీలోని ఆధారాలతో అతను ఎక్కిన ఆటోను గుర్తించగా, డ్రైవర్ పోలీసులను ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు.
అక్కడ మీనాను అరెస్టు చేశారు. మీనా గతంలో బాధితురాలి కుటుంబం వద్ద పనిచేశాడని విచారణలో తేలింది. అయితే అతని జూదం అలవాట్లు, ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో వారు అతడిని పనిలోంచి తీసేశారని తెలిసింది.
పనుల కోసం ఇచ్చిన డబ్బును అతను తరచుగా దుర్వినియోగం చేసేవాడని, దుకాణదారులకు డబ్బు చెల్లించకుండా అరువుపై వస్తువులు తీసుకునేవాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం కుటుంబానికి తెలియడంతో, వారు అతడిని పనిలోంచి తీసేశారు. పోలీసులు అత్యాచారం, హత్య, దోపిడీ కింద కేసు నమోదు చేశారు. లైంగిక దాడి జరిగిందన్న నిర్ధారణ వైద్య పరీక్షల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.