
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చారిత్రాత్మకం: ఈసీ
93 శాతం పోలింగ్ తో ప్రజాస్వామ్యం బలంగా ఉందని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటిదశలో 93.19 శాతం ఓటింగ్ నమోదు చారిత్రాత్మకం అని ఎన్నికల సంఘం తెలిపింది. 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న మొదటి దశ పోలింగ్ జరగగా, మొత్తం 3.61 కోట్ల ఓటర్లలో 3.36 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని శనివారం కమిషన్ పేర్కొంది.
ఓటు వేసిన వారిలో 1.65 కోట్ల మంది మహిళలు, 1.71 కోట్ల మంది పురుషులు ఉన్నారని తెలిపింది. అత్యధికంగా కూచ్ బెహార్ జిల్లాలో 96.2 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణ దినాజ్‌పూర్ (95.44), మాల్దా (94.79 శాతం) ఉన్నాయి.
జల్‌పాయిగురిలో 94.76 శాతం, బీర్‌భూమ్‌లో 94.51 శాతం, ఉత్తర దినాజ్‌పూర్‌లో 94.16 శాతం ఓటింగ్ నమోదైంది. ముర్షిదాబాద్‌లో 93.67 శాతం, అలీపుర్‌దువార్‌లో 93.2 శాతం, పూర్బ మేదినీపూర్‌లో 92.75 శాతం, బంకురాలో 92.55 శాతం, ఝార్‌గ్రామ్‌లో 92.26 శాతం, పశ్చిమ మేదినీపూర్‌లో 92.19 శాతం, పురూలియాలో 91.59 శాతం, పశ్చిమ బర్ధమాన్‌లో 90.32 శాతం పోలింగ్ నమోదైంది.
డార్జిలింగ్‌లో 88.98 శాతం పోలింగ్ నమోదు కాగా, కాలింపాంగ్‌లో అత్యల్పంగా 83.04 శాతం పోలింగ్ నమోదైంది. ఈసీ పంచుకున్న డేటా ప్రకారం, గతంలో అత్యధికంగా 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 84.72 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికల్లో టీఎంసీ అధికారంలోకి వచ్చి, సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏళ్ల అప్రతిహత పాలనకు ముగింపు పలికింది. ఏప్రిల్ 29న జరిగే రెండో దశలో ఏడు జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి, దీనిలో 90 లక్షలకు పైగా పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.
Next Story

