
పఠాన్‌కు భూమి కేటాయింపునకు ఓకే
14 ఏళ్ల నిరీక్షణకు తెర.. సరే అన్న గుజరాత్ ప్రభుత్వం
మాజీ క్రికెటర్, బెహరంపూర్ ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం ఊరటనిచ్చింది. వడోదరలోని ఆయన నివాసం పక్కన ఉన్న 978 చదరపు మీటర్ల వివాదాస్పద స్థలాన్ని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారంలో తాజా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. భూమి స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన తుది అనుమతి, చెల్లించాల్సిన మొత్తం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
వడోదర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాండల్జా ప్రాంతంలో ఉన్న ఈ స్థలాన్ని 99 ఏళ్ల లీజుపై ఎలాంటి బహిరంగ వేలం లేకుండా కేటాయించాలని 2012లో యూసుఫ్ పఠాన్ కోరారు. దీనిపై చర్చించిన మున్సిపల్ కార్పొరేషన్ ఆ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ.. 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.
2024లో ఈ భూమిపై ఆక్రమణ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. స్థలాన్ని ఖాళీ చేయించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించడంతో పఠాన్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. 2025 ఆగస్టు 21న ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా.. ఆయన డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు.
2026 జూన్ 8న విచారణ సందర్భంగా, చట్టబద్ధమైన కేటాయింపు లేకుండా, డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వ భూమిని ఎలా స్వాధీనంలో ఉంచుకున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల పాత్రపైనా సందేహాలు వ్యక్తం చేసింది. అయితే, ఆగస్టు 31న పఠాన్ తన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నారు.
ఆ తర్వాత గుజరాత్ ప్రభుత్వం భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మొత్తం 978 చదరపు మీటర్లలో 500 చదరపు మీటర్లను నివాస అవసరాల కోసం ఉచితంగా కేటాయించాలని, మిగిలిన 478 చదరపు మీటర్లను రాయితీ ధరకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. ఈ స్థలం విలువను సుమారు రూ.20.53 కోట్లుగా అంచనా వేశారు.
ప్రభుత్వ ఆదేశాలు అందుకున్న వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ఈ ప్రతిపాదనను తన స్టాండింగ్ కమిటీ ముందుంచాల్సి ఉంది. భూమికి సంబంధించిన కనీస ధర, పఠాన్ చెల్లించాల్సిన తుది మొత్తాన్ని నిర్ణయించిన తర్వాతే కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంలో కీలక ముందడుగు పడినప్పటికీ, తదుపరి అధికారిక నిర్ణయాల తర్వాతే భూమి స్వాధీనంపై స్పష్టత రానుంది.
Next Story

