
టైగర్ ష్రాఫ్ పై కాల్పుల కేసు: మరో నలుగురి అరెస్ట్
ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసుల వెల్లడి
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మహిళలు కూడా ఉండటం గమనార్హం. వీరు విదేశాల్లో ఉండి భారత్ లో నేర కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనిల్ పండిట్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో కునాల్(21), సుమిత్(19), వీరిది ఇద్దరిది హర్యానాలోని సోనీపట్ కాగా, బబితా(23), రాధ(23) ఇద్దరికి ఉత్తరప్రదేశ్ చెందినవారని తెలిసింది. వీరిని ట్రాన్సిట్ వారెంట్ కింద ముంబైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వివరించిన సంఘటనల క్రమం ప్రకారం.. కునాల్ ఇటీవల బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యాడు. హర్సానా గ్రామానికి చెందిన ఒక స్నేహితుడు అతడిని, పానిపట్ కు చెందిన అమెరికాలో నివసిస్తున్న 32 ఏళ్ల గ్యాంగ్ స్టర్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనుచరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ పండిట్ కు పరిచయం చేశాడు. కునాల్ త్వరలో ఒక ఎన్ క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్ ద్వారా పండిట్ తో మాట్లాడటం ప్రారంభించాడని సదరు అధికారి తెలిపారు.
‘‘పండిట్ ఆదేశాల మేరకు కునాల్, అతని సహచరుడు సుమిత్ అమృత్ సర్ నుంచి ఒక పిస్టల్, 20 రౌండ్ల మందుగుండు సామగ్రిని సేకరించారు’’ అని ఆయన అన్నారు. సుమారు రెండు నెలల క్రితం కునాల్ రాధను కలిసి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ తరువాత తన కార్యకలాపాలను ఆమెకు చెప్పి, ఆయుధంతో ముంబైకి ప్రయాణించమని చెప్పాడు.
అక్టోబర్ 15న కునాల్ రాధ, ఆమె స్నేహితురాలు బబితాను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో దింపారు. రాధ తన బ్యాగ్ లో పిస్టల్ ను దాచి ఉంచారని, ప్రయాణం పొడవునా కునాల్ ఎన్ క్రిప్టెడ్ మెసెజింగ్ అప్లికేషన్ ద్వారా వారితో టచ్ లో ఉంటూ పండిట్ నుంచి వచ్చిన సూచనలు చేరవేశారని అధికారి తెలిపారు.
ఆ ఇద్దరు మహిళలు అక్టోబర్ 17న ముంబై చేరుకున్నారు. దాదర్ లో రైలు దిగిన తరువాత వారు ఒక హోటల్ లో బస చేశారు. ఉదయం సుమారు 11 గంటలకు వారి వద్దకు వచ్చిన ఒక మైనర్ బాలుడు వారి వద్ద ఉన్న బ్యాగ్ తీసుకున్నాడు.
‘‘మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు ప్రాంతంలో ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. కాల్పులు జరిపిన వారు ముంబైలో చిక్కుకుపోయారని పండిట్ కునాల్ కు తెలియజేసి, వారిని తప్పించుకునేందుకు ఏర్పాట్లు చేయమని కోరాడు.
రాధ, బబితా అక్టోబర్ 18న దాదర్- హరిద్వార్ ఎక్స్ ప్రెస్ లో ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరారు. మంగళవారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో వారిని పట్టుకోగా, కునాల్, సుమిత్ లను సోనిపట్ లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ నెట్వర్క్ పై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

