గ్యాంగ్ స్టర్ అనిల్ పండిట్ పేరు తెరపైకి?
x

గ్యాంగ్ స్టర్ అనిల్ పండిట్ పేరు తెరపైకి?

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పులకు ప్రణాళిక వేసింది ఇతడే అని అనుమానం


Click the Play button to hear this message in audio format

ముంబైలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనలో ముగ్గురు అనుమానిత షూటర్లను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ దాడి వెనుక విదేశాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌స్టర్ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న హర్యానా వాసి అనిల్ పండిట్‌తో పాటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇతర సభ్యులపై పోలీసులు దృష్టి సారించారు.

అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న మరో వ్యక్తి గాయపడ్డారు. దాడి అనంతరం నిందితులు మోటార్‌బైక్ లపై అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ సందేశం వెలువడింది. అమెరికాలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ కూడా ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రచారంలోకి వచ్చిన ఆడియో సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ సందేశం నిజమైనదా, దాడికి గ్యాంగ్‌కు సంబంధం ఉందా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
హర్యానాలోని పానిపట్‌కు చెందిన అనిల్ పండిట్ ప్రస్తుతం అమెరికా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున భారత్‌లో కాల్పులు, బెదిరింపులకు సంబంధించిన వ్యవహారాలను సమన్వయం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. షూటర్లతో సంప్రదింపులు జరపడం, దాడులకు సంబంధించిన సూచనలు ఇవ్వడంలో అతడి పాత్రపై అధికారులు దృష్టి పెట్టారు.
గతంలో ఢిల్లీలో గాయకుడు గురు రంధావాకు సంబంధించిన జిమ్‌ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలోనూ అనిల్ పండిట్ పేరు తెరపైకి వచ్చింది. అలాగే హర్యానాలో జరిగిన కొన్ని కాల్పులు, వసూళ్ల కేసుల్లోనూ అతడికి సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో టైగర్ ష్రాఫ్‌పై దాడికి, గతంలో జరిగిన ఇతర ఘటనలకు మధ్య ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఇక టైగర్ ష్రాఫ్‌పై దాడికి సంబంధించి ముగ్గురు అనుమానితులను రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో రైలులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు బిహార్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. నిందితులు ముందుగానే నటుడి కదలికలను గమనించి, దాడి అనంతరం తప్పించుకునేందుకు ప్రణాళిక వేసుకున్నారనే అనుమానాలు ఉన్నాయి.
ఈ కేసులో దాడికి పాల్పడినవారితో పాటు వారికి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులను కూడా గుర్తించడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ పండిట్‌తో పాటు ఇతర అనుమానితుల పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

నేపాల్ కు పారిపోయేందుకు ప్రయత్నం..

బాలీవుడ్ నటుడిపై కాల్పులు జరిపిన అనంతరం ముగ్గురు నిందితులు అంధేరి వైపుగా పారిపోయారు. వారు ఉపయోగించిన బైక్ లను తరువాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఒకరి వయస్సు 18 సంవత్సరాలు కాగా, మిగతా ఇద్దరు వయస్సు 22 సంవత్సరాలు అని ముంబై పోలీసులు తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పుడు వారి వద్ద నుంచి ఎలాంటి ఆయుధాలు లభించలేదు. వారిని ట్రాన్సిట్ వారెంట్ పై ముంబై తీసుకువచ్చి విచారించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అనుమానితులు హర్యానా.. యూపీ మీదుగా నేపాల్ వైపు పారిపోవడానికి ప్రయత్నించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని కోటా ఎస్పీ గౌతమ్ తెలిపారు.

నిందితులు ఎవరూ?

దర్యాప్తు చేస్తున్న కొద్ది వివరాలు బయటకు వస్తున్నాయి. రేహాన్ తండ్రి రైసుద్దీన్ హర్యానాలో విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం నమోదైన ఆయుధాల చట్టం కేసులో తన కుమారుడు బెయిల్ పై బయట ఉన్నాడని చెప్పారు. తొమ్మిదో తరగతి చదువు మానేసిన రేహాన్, దాదాపు దశాబ్ద కాలంగా తనతో కలిసి జీవించకుండా సోనిపట్ జిల్లాలోని ఒక గ్రామంలో తన తల్లితో ఉంటున్నాడని ఆయన తెలిపారు.
మరో నిందితుడి తండ్రి మాట్లాడుతూ... తన కుమారుడు ముంబైకి ఎలా చేరుకున్నాడో తనకు తెలియదని చెప్పాడు. ఆ యువకుడు జీవనోపాధి కోసం గోహానాలో టైల్ పని నేర్చుకుంటున్నాడని, నెల రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడని అతను పేర్కొన్నాడు.

ఫడ్నవీస్ కఠినంగా..

కాల్పుల అనంతరం... నిందితులు సూరత్ వైపు పారిపోయి జైపూర్ వెళ్లే రైలు ఎక్కారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబై పోలీసులు, రాజస్థాన్ పోలీసులతో సమన్వయం చేసుకున్నారని ఆయన చెప్పారు.
ఈ దాడిలో ప్రమేయం ఉన్న ఎవరిని వదిలి పెట్టమని ఆయన హమీ ఇచ్చారు. ఈ దాడి రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. మహారాష్ట్రలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని శివసేన(యూబీటీ) గ్రూప్ విమర్శలు గుప్పించింది.
రాష్ట్రంలో వరుస హత్యలు, కాల్పులు, దోపిడీలు, కిడ్నాప్ లు జరుగుతున్నాయని సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఈ దాడి పై బాలీవుడ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సెలబ్రీటీలకు రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించింది.
Read More
Next Story