
నవీ ముంబాయిలోని ఎయిర్ పోర్ట్ లో తొలి వాణిజ్య విమానానికి వాటర్ కెనాన్ స్వాగతం పలుకుతున్న దృశ్యం
నవీ ముంబై ఎయిర్ పోర్ట్ సేవలు ప్రారంభం
ఏడాదికి 90 మిలియన్ల ప్రజలకు లాభం చేకూరే అవకాశం
ముంబైలోని నవీముంబాయి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ బుధవారం ప్రారంభం అయింది. ఇది దేశీయ విమానయాన రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ముంబై మెట్రోపాలిటన్ పరిధిలో విమాన ప్రయాణాలు మరింత సులువుగా విస్తరించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.
ఇండిగో కు చెందిన తొలి దేశీయ విమానం తన తొలి విమానాన్ని నవీ ముంబైలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ల్యాండ్ అయింది. బెంగళూర్ నుంచి ఈ విమానం నవీ ముంబై ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. ఇక్కడి నుంచి తొలి విమానం ఉదయం 8.40 నిమిషాలకు హైదరాబాద్ బయల్దేరింది.
తొలి విమానం నవీ ముంబైలో ల్యాండ్ అవగానే సాంప్రదాయ వాటర్ కెనాన్ తో స్వాగతం పలికారు. తొలి వాణిజ్య విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన సందర్భంగా ఈ స్వాగత సత్కారాలు చేసినట్లు ఎన్ఎంఐఏ(నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) ఒక ప్రకటలో తెలిపింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగిసిన తరువాత ఇండిగో కు చెందిన విమానం 6ఈ882 విమానం హైదరాబాద్ కు బయల్దేరింది. ఇది ఇక్కడి నుంచి ఎగిరిన తొలి వాణిజ్య విమానంగా రికార్డులకెక్కింది.
మొదటి రోజు షెడ్యూల్..
నవీ ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ నుంచి దేశంలోని కీలకమైన తొమ్మిది నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడి నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఆకాశ్ ఎయిర్, స్టార్ ఎయిర్ విమానాలు దేశీయ సర్వీసులు నడిపాయి.
తొలి రోజు ఇక్కడి నుంచి 15 వాణిజ్య విమానాలు తమ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చాయి. మొదటి రోజుల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాక అంటే 12 గంటల సేపు సర్వీసులు అందించనుంది.
తరువాత రద్దీకి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. 13 గమ్యస్థానాలకు ఏకకాలంలో సర్వీసులు అందించడంతో పాటు, ఒకే సమయంలో పది విమానాల రాకపోకలకు అనుగుణంగా ఈ ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దారు. ఈ నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ ఎనిమిదిన ప్రధాని మోదీ ప్రారంభించారు.
90 మిలియన్ల మందికి లాభం..
ఈ ఎయిర్ పోర్ట్ ను అయిదు దశలుగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలకు ఏకంగా రూ. 19,650 కోట్లను ఖర్చు చేశారు. ఐదు దశలు పూర్తయ్యే సరికి ఇక్కడి నుంచి 90 మిలియన్ల మంది ప్రజలు ప్రతి ఏడాదికి సేవలందుకునే అవకాశం ఉంది.
వీటితో పాటు కార్గో టెర్మినల్స్, మల్టీ మోడల్ కనెక్టివిటికి అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ ను నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్(ఎన్ఎంఐఎల్) అనే ప్రత్యేక ప్రయోజన సంస్థ కింద బహుళ దశల్లో అభివృద్ధి చేస్తున్నారు.
దీనిలో అదానీ గ్రూప్ 74 శాతం వాటా ఉండగా, మిగిలిన సీఐడీసీఓ యాజమాన్యంలో ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు క్రమంగా 24 గంటలూ సేవలు పెంచాలని ప్రణాళిక చేయబడింది.
Next Story


