అవినీతి లో ఆరావళి కొండ.. 36 విల్లాలను కొనుగోలు చేసిన ఐఏఎస్ అధికారి
x

అవినీతి లో ఆరావళి కొండ.. 36 విల్లాలను కొనుగోలు చేసిన ఐఏఎస్ అధికారి

భార్య కూడా ఐపీఎస్ అధికారిణీ.. మొత్తం కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్


Click the Play button to hear this message in audio format

అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్యూరోక్రసీ ఎంత సంపాదిస్తుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహారణ. రాజస్థాన్ లోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ ప్రైవేట్ రిసార్ట్స్ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, తన కుటుంబ సభ్యుల పేర్లపై తక్కువ ధరలకు ఏకంగా 36 విల్లాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది.

శిఖర్ అగర్వాల్ గతంలో పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయనను పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారిగా (Awaiting Posting Orders) ఉంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయ్‌పూర్‌లో జిల్లా కలెక్టర్‌గా, రాజస్థాన్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా, పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేసిన సమయంలో తీసుకున్న నిర్ణయాలపై ఏసీబీ దృష్టి పెట్టింది.
గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనాంత బ్రాండ్ పేరుతో హోటళ్లు, రిసార్ట్స్ నిర్వహిస్తోంది. ఈ సంస్థకు అగర్వాల్ అనుకూలంగా వ్యవహరించారన్నది ప్రధాన ఆరోపణ. రిసార్ట్స్ నిర్మాణ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం, అవసరమైన ధ్రువపత్రాలను సరిగా పరిశీలించకుండానే అనుమతులు మంజూరు చేయడం, ప్రత్యేక రాయితీలు కల్పించడం వంటి అంశాలను ఏసీబీ పరిశీలించనుంది.
ఈ వ్యవహారంపై అక్టోబర్ 27న దైనిక్ భాస్కర్ ప్రచురించిన కథనం ఆధారంగా ఏసీబీ ప్రాథమిక విచారణ చేపట్టింది. అనంతరం అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17ఏ కింద విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో అగర్వాల్‌తో పాటు సంబంధిత సంస్థ డైరెక్టర్లు, ఇతరుల పాత్రపైనా విచారణ జరగనుంది.
ఇక ఈ కేసులో ప్రధానంగా 36 విల్లాల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్‌లోని బుజ్డా, అల్వార్‌లోని అజబ్‌గఢ్ ప్రాంతాల్లో ఉన్న రెండు అనాంత రిసార్ట్స్‌లో ఈ విల్లాలను కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
బుజ్డా రిసార్ట్‌లో 2026 మార్చిలో 20 విల్లాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వీటిలో పది విల్లాలు అగర్వాల్ పేరుతో, మరో పది ఆయన భార్య, ఐపీఎస్ అధికారి ప్రశాఖా మాథుర్ పేరుతో రిజిస్టర్ అయ్యాయి. ఒక్కో విల్లా ధర సుమారు రూ.15 లక్షలుగా చూపించడంతో వీటి మొత్తం విలువ రూ.3 కోట్లుగా ఉంది.
అల్వార్‌లోని అజబ్‌గఢ్ రిసార్ట్‌లో మరో 16 విల్లాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. వీటిలో ఎనిమిది విల్లాలు అగర్వాల్, ఆయన భార్య పేర్లపై, నాలుగు వారి ఇద్దరు కుమారుల పేర్లపై, మరో నాలుగు అగర్వాల్ అత్తమామల పేర్లపై రిజిస్టర్ అయినట్లు సమాచారం. ఒక్కో విల్లా ధర రూ.15 లక్షల నుంచి రూ.16.5 లక్షల వరకు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ రెండు రిసార్ట్స్‌లోని మొత్తం 36 విల్లాల విలువ సుమారు రూ.5.52 కోట్లుగా అంచనా వేశారు. అయితే పూర్తి మార్కెట్ రేట్ ప్రకారం ఒక్కో విల్లో ధర రూ. 3 కోట్లు పైనే ఉందని, కానీ ఐఏఎస్ కుటుంబ సభ్యులు మాత్రం ఒక్కో విల్లాలను కేవలం రూ. 15 లక్షలకే కొనుగోలు చేశారని వెల్లడైంది. ఈ ఏడాది మార్చి 27న గోయల్ ఫ్యాషన్స్ సంస్థకు ఆర్థిక శాఖ ప్రత్యేక రాయితీతో కూడిన ఆర్థిక ప్యాకేజీని మంజూరు చేసినట్లు కూడా ఏసీబీ గుర్తించింది. అదే రోజున అగర్వాల్ కుటుంబ సభ్యుల పేర్లపై 20 విల్లాలు రిజిస్టర్ కావడం కూడా విచారణలో కీలక అంశంగా మారింది.
మొత్తంగా, ప్రభుత్వ హోదాలో తీసుకున్న నిర్ణయాలకు, ప్రైవేట్ సంస్థకు కల్పించిన ప్రయోజనాలకు, కుటుంబ సభ్యుల పేర్లపై జరిగిన ఆస్తుల కొనుగోళ్లకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేయనుంది. విచారణ పూర్తయిన తర్వాతే ఈ ఆరోపణల్లో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
Read More
Next Story