
ఐఐటీ బొంబాయిలో ఏం జరుగుతోంది?
కుల వివక్ష ఆరోపణలు చేస్తున్న విద్యార్థి తండ్రి, సెమిస్టర్ పరీక్షలో స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ, ఏఐ ద్వారా సమాధానాలు రాశాడంటున్న ప్రొఫెసర్
ఐఐటీ బొంబాయిలో సాహిల్ రవీంద్ర అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో వివాదం చెలరేగింది. క్యాంపస్ లో నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. విద్యార్థులు తీసుకొచ్చిన 18 డిమాండ్లకు ఐఐటీ బొంబాయి అంగీకరిస్తూనే, ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాను సస్పెండ్ చేసింది.
సంస్థ డైరెక్టర్ శిరీష్ కేదారే రాజీనామా చేశారన్న వార్తలు మొదట గుప్పుమన్నాయి. అయితే తరువాత ఇది నిజం కాదని తేలింది. సెప్టెంబర్ 20 వ తేదీ సాయంత్రం నిరసన చేస్తున్న విద్యార్థుల సమర్పించిన 18 సూత్రాల డిమాండ్ల పత్రంపై కేదారే సంతకం చేసిన తరువాత దుల్లా సస్పెండ్ అయ్యారు. అయితే దుల్లాకు సంస్థ ఫ్యాకల్టీ మద్దతు ప్రకటించింది. 750 మంది అధ్యాపకులు క్యాంపస్ ఒక ర్యాలీ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
మహారాష్ట్రలోని యవత్మల్ కు చెందిన బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వాకోడే, సెప్టెంబర్ 18న తన హస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సెమిస్టర్ పరీక్షలలో స్మార్ట్ ఫోన్ వాడటం, చాట్ జీపీటీని ఉపయోగిస్తూ విద్యార్థి పట్టుబడ్డాడు. అతనిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని అధ్యాపకులు ప్రకటించారు. అయినప్పటికీ సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే పరీక్ష నిబంధనల ప్రకారమే తాము పని చేశామని ఐఐటీ బొంబాయి ప్రకటించింది. వాకోడే కుటుంబం, విద్యార్థులు మాత్రం లెక్చరర్ల వేధింపులు, కుల వివక్ష కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు చేశారు.
సంస్థ క్షమాపణ..
ఈ సమస్య పరిష్కారం దిశగా సాగుతోందని జరుగుతన్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. సాహిల్ మరణానికి దారి తీసిన పరిస్థితులపై ఐఐటీ బొంబాయి క్షమాపణ చెప్పింది. ‘‘ఈ ఘటన దారితీసిన వివరాలు, పరిస్థితులు సంబంధిత అధికారుల విచారణలో ఉన్నాయి. కొనసాగుతున్న విచారణ దృష్ట్యా సరైన విచారణ ప్రక్రియ ద్వారా అతని మరణానికి ముందు జరిగిన సంఘటనల వివరాలు బయటకు రాకముందే వాటిని వెల్లడించడం సముచితం కాదు’’ అని పేర్కొంది.
ఐఐటీ బొంబాయి డైరెక్టర్ శిరీశ్ కేదార్ రాజీనామా చేస్తారనే వాదనలను కూడా ఖండించింది. ఎవరూ రాజీనామా చేయలేదని పేర్కొంది. దీనికి ముందు ఆదివారం రాత్రి తాను పదవి నుంచి వైదొలుగుతున్నానని విద్యార్థులతో కెదారే వెల్లడించినట్లు తేలింది. ఆ తరువాత ఆయన నిరసనకారుల 18 డిమాండ్ల పత్రం పై సంతకం చేశారు.
ప్రొఫెసర్ కు ఫ్యాకల్టీ మద్దతు..
వాకోడే పరీక్షలలో కాపీయింగ్ పాల్పడటం వల్లే పరీక్ష పర్యవేక్షకుడు సూర్య నారాయణ దుల్లా నిబంధనల ప్రకారం వ్యవహరించాడని, ఐఐటీ బొంబాయి ఫ్యాకల్టీ ఫోరమ్ ఆయనకు మద్దతు ప్రకటించింది. ప్రొఫెసర్ ను ఉద్దేశించిన వ్యాఖ్యలు ఆయనను తీవ్రంగా బాధించాయని, ఆయనకు మద్దతుగా మార్చ్ నిర్వహించాలని ప్రణాళిక వేస్తోంది.
అయితే నిరసనకారులకు, యాజమాన్యానికి జరిగిన సమావేశంలో నిరసనలు ముగియలేదు. కులతత్వానికి భారత్ వ్యతిరేకం, ఈ నినాదంతోనే ఐఐటీ బొంబాయి ప్రధాన ద్వారం వద్ద సమావేశం అవుతామని విద్యార్థులు ప్రకటించారు. కుల వివక్ష కారణంగా గతంలో విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకున్నారని దీనిపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మేము ఇక్కడ చనిపోవడానికి రాలేదు’’ అని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు.
క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు...
వాకోడే కుల వివక్షకు గురయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఎఫ్ఐఆర్ లో నమోదు అయిన వ్యక్తులను ప్రశ్నించే అవకాశం ఉంది. వాకోడే ఆత్మహత్య చేసుకున్న ప్రదేశాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆత్మహత్య కారణంపై ఎలాంటి లేఖ లభించలేదు. మృతుడి ఫోన్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దుల్లాపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే సాహిల్ ను మూడు నెలలుగా కులం పేరుతో దూషణ ఎదుర్కొంటున్నాడని తండ్రి ఆరోపిస్తున్నారు.
ప్రొఫెసర్ దుల్లా ఎవరూ?
ప్రొఫెసర్ దుల్లా ఐఐటీ బొంబాయిలో ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా ఉన్నారు. దశాబ్దం పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. పవర్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్లు, మైక్రో గ్రిడ్లు, పునరుత్పాదక శక్తి, కన్వర్టర్ నియంత్రణ వంటి రంగాలలో నైపుణ్యం ఉంది. పలు రంగాలలో పరిశోధన పత్రాలను ప్రచురించారు.
ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున విశ్వ విద్యాలయం నుంచి 2000 వ సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, 2002 ఐఐటీ బొంబాయి నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్ లో ఎంటెక్, 2007 లో ఐఐటీ ఢిల్లీ నుంచి పవర్ సిస్టమ్స్ లో పీ హెచ్డీ చేశారు. ఐఐటీ బొంబాయిలో చేరకముందు ఆయన బెంగళూర్ లోని పవర్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కన్సల్టెంట్ లో , హైదరాబాద్ లోని మెషిన్ 2 మెషిన్ లో పనిచేశారు.
సెప్టెంబర్ 18న దుల్లా మరణం తరువాత ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఐఐటీ బొంబాయి ప్రకారం సాహిల్ సెమిస్టర్ పరీక్షలో మొబైల్ వాడుతూ పట్టుబట్టాడని, పరీక్ష పత్రాన్ని ఏఐ ఫ్లాట్ ఫాంలో అప్ లోడ్ చేసి సమాధానాలు తీసుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ పరీక్షకు దుల్లా పర్యవేక్షకుడిగా ఉన్నారు. ఆయన జరిగిన అవకతవకలపై పై అధికారులకు నివేదించారు. తరువాత దుల్లా, హెచ్ ఓడీ ఇద్దరు కలిసి వాకోడే కు కౌన్సెలింగ్ ఇచ్చారు. పరీక్ష సంఘటన భవిష్యత్ లో అతని విద్యా జీవితంపై ప్రభావం చూపదని హమీ సైతం ఇచ్చారని కూడా తేలింది. వాకోడే మరణం కంటే ముందు అతని పై ఎలాంటి క్రమ శిక్షణా చర్యలను ఐఐటీ బొంబాయి తీసుకోలేదు.
Next Story

