గిద్దలూరులో ఏమి జరిగింది

ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు మాగుంటపై ఎందుకు విరుచుకుపడ్డారు. రాజకీయాల నుంచే వైదొలుగుతున్నానని ఎందుకు అన్నారు.


గిద్దలూరులో ఏమి జరిగింది
x
Anna Venkata Rambabu, MLA, Giddaluru

ఆంధ్రప్రదేశ్‌లోని గిద్దలూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్న మాగుంట కుటుంబం వివాద రహితంగా ముందుకు సాగుతూ వచ్చింది. అటువంటి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో ఎవరు పోటీ చేసినా ఓడించి తీరుతానని, జిల్లా వ్యాప్తంగా ఇందుకోసం ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహిస్తానని అన్నా వెంకట రాంబాబు అన్నారు. ఇంతకూ ఏమి జరిగింది. ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం..

రాజకీయాల్లో అన్నాకు ప్రత్యేక ముద్ర
అన్నా వెంకట రాంబాబు మొదటి సారిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థానించినప్పుడు గిద్దలూరు నుంచి రాంబాబు పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2014లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తిరిగి 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గిద్దలూరు నుంచి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ తరువాత మెజారిటీలో రెండో స్థానంలో నిలిచారు. స్వగ్రామం మార్కాపురం అయినా గిద్దలూరుకు కూడా రాంబాబు సుపరిచితుడు. రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఎమ్మెల్యేగా రాజకీయ అవినీతికి పాల్పడకుండా పాలన సాగించాడని అక్కడి వారంతా చెబుతుంటారు. ఎంతో మందికి అధికారులతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పించారని రాంబాబును గౌరవంగా నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. ఇంత మంచి పేరు సంపాదించుకున్న రాంబాబుకు ఉన్నట్లుండి రాజకీయాలపై విరక్తి పెరిగింది. వైరాగ్యాన్ని ప్రదర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పారు.
నియోజకవర్గంలో పెరిగిన మాగుంట రాఘవరెడ్డి జోక్యం
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి జోక్యం గిద్దలూరు నియోజకవర్గంలో పెరిగింది. మూడేళ్లుగా ఆయన నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గాన్ని కూడగట్టి ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేకు తెలియకుండా అధికారులతో మాట్లాడటం, ఎమ్మెల్యే తెలుసుకునేలోపు రెడ్డి సామాజిక వర్గంలోని వారికి కావాల్సిన పనులు చేయించిపెట్టే పనిలో ఉన్నారు. దీనిని రాంబాబు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
ఎంపీపీలు అందరూ రివర్స్‌
నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే ఆరుగురు ఎంపీపీలు ఎమ్మెల్యే రాంబాబుకు వ్యతిరేకంగా పాలువు కదపడం మొదలు పెట్టారు. గిద్దలూరు ఎంపీపీ కడప లక్ష్మీదేవి, బేస్తవారిపేట ఎంపిపీ వేగినాటి ఓసూరారెడ్డి, కంభం ఎంపీపీ చేగిరెడ్డి తులశమ్మ, కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. బేస్తవారిపేట ఎంపీపీకి ఎమ్మెల్యే రాంబాబుకు మధ్య పచ్చ గడ్డి వేస్తేభగ్గున మండే పరిస్థితి ఏర్పడింది. ఇక రాచర్ల ఎంపీపీ షేక్‌ ఖాశింబీ, అర్థవీడు ఎంపీపీ వెంకట్రావులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే వీరు కూడా మిగిలిన ఎంపీపీలతో పాటు కలిసి ఎమ్మెల్యే నాయకత్వాన్ని వ్యతిరేకించారు. పాలనలో అందరినీ కలుపుకొని పోకుండా ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడ పోతున్నారని ఎంపీపీలు ఆరోపిస్తున్నారు.
పట్టీపట్టనట్లు వ్యవహరించిన వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకత్వం
గిద్దలూరు నియోజకవర్గంలో మాగుంట రాఘవరెడ్డి జోక్యం పెరిగినా, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎంపీపీలు పావులు కదుపుతున్నా జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకత్వం పట్టించుకోలేదు. ప్రధానంగా ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టీపట్టనట్లు వ్యవహరించడం వల్లనే నాపై రెడ్డి సామాజికవర్గం వత్తిడి పెరిగిందని, వారంతా వ్యతిరేకించడానికి కారణం అవినీతికి అడ్డుపడటమేనని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా కుమారుడిని కట్టడి చేయడంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మిన్నకున్నారని, మిగిలిన నేతలు కూడా తనను పావుగా వాడుకున్నారే తప్ప తనకు సపోర్టుగా ఎవ్వరూ నిలవలేదనే ఆవేదన ఎమ్మెల్యే రాంబాబులో ఉంది. ఇటుంటి పరిస్థితుల్లో తాను రాజకీయాల్లో కొనసాగటం కంటే మానుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
కృష్ణ చైతన్యకు అవకాశం ఉంటుందా?
తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, మాగుంటను ఓడించి తీరుతానని చెప్పడంతోనే వైఎస్సార్‌సీపీకి దూరంగా ఎమ్మెల్యే రాంబాబు ఉన్నారని అర్థమైందంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేన పార్టీ తరపున టిక్కెట్‌ తీసుకొని గిద్దలూరు నుంచి రాంబాబు కుమారుడు అన్నా కృష్ణచైతన్య రంగంలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. ఈ విషయంపై ఎమ్మెల్యే రాంబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. గిద్దలూరు కాదనుకుంటే మార్కాపురం నుంచైనా కుమారుడిని రంగంలోకి దించాలనే ఆలోచన అన్నాకు ఉన్నట్లు పలువురు రాంబాబు సన్నిహితులు చెబుతున్నారు.
Next Story