బీజేపి విజయ సంకల్పసభ సక్సెస్ అవుతుందా?
x

బీజేపి 'విజయ సంకల్ప'సభ సక్సెస్ అవుతుందా?

నితిన్ నబిన్ నాయకత్వం ఫలిస్తుందా?


బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల తెలంగాణ పర్యటన ఆదివారంతో మొదలైంది. మూడురోజుల్లో నబీన్ 10 జిల్లాల్లో పార్టీ ఆఫీసులను ప్రారంభించటంతో పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నారు. తెలంగాణలో పార్టీ తరపున 8 మంది ఎంపీలు, 8 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంఎల్సీలున్నారు. అయితే వీరంతా ఏకతాటిపైన కాకుండా అంతర్గత కలహాలతో ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారన్న విషయం జాతీయ నాయకత్వంకు తెలుసు. అందుకనే విభేదాలున్న ప్రజా ప్రతినిధులతో నబీన్ ప్రత్యేకంగా సమావేశమవబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. తొందరలోనే జరగబోయే గ్రేటర్ మున్సిపల్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల్లో పార్టీ గెలుపే టార్గెట్ గా నబీన్ మూడురోజుల పర్యటన మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేయటానికి నబీన్ పర్యటన ఉపయోగపడుతుందా ? నేతల మధ్య విభేదాలను తొలగించి అందరినీ ఏకతాటిపైకి అధ్యక్షుడు తీసుకురాగలడా ? అన్నవి కీలకమైన ప్రశ్నలు.

మరోవైపు, తెలంగాణలో బలపడటానికి బీజేపీకి ఇదే సరైన సమయమని జాతీయ నాయకత్వం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని పీక్‌లో ఉన్న ఉత్సాహాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించాలనేది అధిష్టానం వ్యూహం. అయితే, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ, అగ్ర నాయకుల మధ్య సమన్వయ లోపం క్యాడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది. నితిన్ నబీన్ ఈ పర్యటనలో కేవలం కార్యాలయాల ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా, ప్రతి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేలా గట్టి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివి కాబట్టి, ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా పార్టీ గ్రాఫ్ పడిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కమిటీల బలోపేతంపై నబీన్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. లీడర్లంతా తమ వ్యక్తిగత ఈగోలను పక్కనబెట్టి సమిష్టిగా పనిచేస్తేనే తెలంగాణలో అధికారం సాధ్యమనే సందేశాన్ని ఆయన బలంగా వినిపించబోతున్నారు. మరి ఈ మూడు రోజుల ‘ఆపరేషన్ తెలంగాణ’ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.



Read More
Next Story