Revanth Reddy
x

ప్రమాద భీమా ......పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ధీమా


తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సామాన్య కుటుంబానికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా" పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ వినూత్న పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన కోటి మందికి పైగా లబ్ధిదారులకు ఉచితంగా రూ. 5 లక్షల జీవిత బీమా రక్షణ లభించనుంది. దీనికి తోడు ప్రస్తుతం అమల్లో ఉన్న 'రైతు బీమా' (సుమారు 37 లక్షల మంది) పరిధిని కూడా కలిపి, మొత్తంగా దాదాపు కోటి 40 లక్షల మందిని ఈ మెగా బీమా నెట్‌వర్క్ కిందికి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలలో సంపాదించే వ్యక్తి లేదా కుటుంబ యజమాని అకాల మరణం పాలైతే, ఆ ఇల్లు ఆర్థికంగా రోడ్డున పడకుండా కొండంత అండగా నిలవడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ ప్రతిష్టాత్మక మెగా బీమా ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించడానికి ఏడాదికి సుమారు రూ. 5,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగానే కేవలం 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' కోసమే బడ్జెట్‌లో రూ. 4,000 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ప్రమాదవశాత్తు లేదా సహజ కారణాల వల్ల కుటుంబ యజమాని మరణిస్తే, ఎటువంటి ఆలస్యం లేకుండా కేవలం 10 నుండి 15 రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా పరిహార సొమ్మును ప్రభుత్వం నేరుగా సదరు లబ్ధిదారుని నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా నిబంధనలను రూపొందిస్తున్నారు.

ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అమలు చేయడానికి తెలంగాణ సామాజిక-ఆర్థిక సర్వే (సీపెక్) డేటాను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది. ముఖ్యమంత్రి, మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ఈ పథకం మార్గదర్శకాలు, ప్రీమియం చెల్లింపులు మరియు అర్హుల గుర్తింపు ప్రక్రియపై వేగంగా కసరత్తు చేస్తోంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఇంటింటి సర్వేను చేపట్టి, ప్రతి సామాన్య కుటుంబం నుండి నామినీ పేర్లను సేకరించి ఫైనల్ చేయనున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) లేదా తత్సమాన ప్రతిష్టాత్మక బీమా సంస్థల భాగస్వామ్యంతో ఈ మెగా పాలసీని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.


Read More
Next Story