
సింగరేణి కేంద్రంగా బీజేపి మాస్టర్ ప్లాన్
సింగరేణి సంస్థను కేంద్రంగా చేసుకుని తెలంగాణలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ అధిష్టానం ఒక స్పష్టమైన మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కమలం పార్టీ, ఇందులో భాగంగానే తాటిచెర్ల-2 బొగ్గుగనిని సింగరేణికి నామినేషన్ పద్ధతిపై కేటాయించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనుల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో దాదాపు 4 పార్లమెంట్ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ మినహా మిగిలిన స్థానాల్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఈ నేపథ్యంలో, సింగరేణి మనుగడకు అత్యంత కీలకమైన తాటిచెర్ల-2 గనిని కేటాయించడం ద్వారా ఈ ప్రాంతాల్లోని కార్మికులు, వారి కుటుంబాల మద్దతు కూడగట్టి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయవచ్చని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి భావిస్తున్నారు.
ఈ వ్యూహంలో భాగంగానే ఇటీవల ఆయా జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డిని కలిసి, తాటిచెర్ల-2ను సింగరేణికి నామినేషన్ పై ఇప్పిస్తే రాజకీయంగా పార్టీకి మైలేజ్ వస్తుందని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి, నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి ఈ గని కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ సాధించారు. ప్రధాని అంగీకారంతోనే ఈ నిర్ణయం జరిగిందని కిషన్ రెడ్డి స్వయంగా ప్రకటించడంతో సింగరేణి ప్రాంతంలో బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. సంస్థ భవిష్యత్తును కాపాడింది తామేనని చెప్పుకుంటూ, రాబోయే ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకోవడానికి బీజేపీ గట్టి ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
అయితే, బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తక్షణమే అలర్ట్ అయ్యి గట్టి కౌంటర్ ఇచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలని, తాటిచెర్ల-2 బొగ్గుగనిని ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా కేటాయించలేదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత 2013లోనే నాటి యూపీఏ ప్రభుత్వం ఈ గనిని సింగరేణికి కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. ఇంతకాలం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకుండా తొక్కిపెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హఠాత్తుగా తామే కేటాయించినట్లు ప్రకటించి ప్రజలను, కార్మికులను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ విధంగా తాటిచెర్ల-2 కేటాయింపు చుట్టూ ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో, అసలు నిజం ఏంటనేది సింగరేణి వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

