బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు......కాంగ్రెస్ లో హై అలర్ట్
x

బీఆర్ఎస్ 'యువ సంగ్రామ సదస్సు'......కాంగ్రెస్ లో హై అలర్ట్


హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా తలపెట్టిన బిఆర్ఎస్ పార్టీ 'యువ సంగ్రామ సదస్సు' రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తెలంగాణలోని నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ భారీ బహిరంగ సభను బిఆర్ఎస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, గత ఎన్నికల హామీలను గుర్తు చేయాలని గులాబీ దళం ఈ వేదికను వ్యూహాత్మకంగా సిద్ధం చేసింది.

అయితే, ఈ సభకు ముందే పార్టీ అగ్ర నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు వారి నివాసాల్లోనే ముందస్తుగా అరెస్ట్ చేశారు. హైకోర్టు స్పష్టమైన నిబంధనలతో ఈ సభకు అనుమతి ఇచ్చినప్పటికీ, అధికార పక్ష ఒత్తిళ్లకు లొంగి పోలీసులు ఈ విధమైన అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమని బిఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా, నాయకులను నిర్బంధించినా సరూర్ నగర్ సదస్సు అనుకున్న సమయానికి జరిగి తీరుతుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. నాయకుల అరెస్టుల వార్తలు తెలియడంతో కార్యకర్తలలో మరింత కసి పెరిగిందని, సభను మరింత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ జెఎసి నాయకులు, యువత స్వచ్ఛందంగా తరలివస్తున్నారని పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Read More
Next Story