
డ్రగ్స్ బాంబ్ మళ్లీ పేలిందా? రేవంత్ నిర్ణయం ఏంటి?
కేటీఆర్ పేరు బయటకు వచ్చే అవకాశముందా?
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి “డ్రగ్స్” అంశం హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. దీనికి బీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు. మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు దాడులు, ప్రతిదాడుల వరకూ వెళ్లింది. అయితే బండి సంజయ్ ఇప్పుడు లేవనెత్తుతున్న అంశాలు కొత్తవి కావు. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా కేటీఆర్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని బండి మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక అసలు వ్యూహమేంటి..? అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన ఆ ఆరోపణలపై చర్యలు తీసుకోకపోతే, “అవి కేవలం రాజకీయ విమర్శలేనా?” అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తే అవకాశం ఉంది. ఇదే పాయింట్‌ను బండి సంజయ్ ఇప్పుడు బలంగా ఎత్తిచూపుతున్నారు. అసలు ప్రశ్న ఏమిటంటే? అకున్ సబర్వాల్ దగ్గర నిజంగానే బలమైన ఆధారాలు ఉన్నాయా? ఉంటే, ఆ విచారణలో నిజంగా కేటీఆర్ పేరు బయటకు వచ్చే అవకాశముందా?
గతంలో కేటీయార్ మీద రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు బండి సంజయ్ గోకుతున్నారు. రేవంతూ, నీకు చేతకాదా అని కేంద్ర మంత్రి సి.ఎం.ను రెచ్చగొడుతున్నారు. బండి సంజయ్ ఆరోపణల వెనుక రాజకీయ లెక్కలేమిటో చెబుతాను....బండి సంజయ్ నేరుగా కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ “డ్రగ్స్ టెస్టుకు రావాలి” అని సవాల్ విసరడం సాధారణ రాజకీయ విమర్శ కాదు. ఇందులో రెండు ముఖ్యమైన రాజకీయ అంశాలున్నాయి.
1. బీఆర్ఎస్‌పై నైతిక ఒత్తిడి పెంచడం.
2. రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికారంలో ఆయనను వెంటాడుతున్నాయి.“మీరు అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా కాదా?”, “నిజమైతే ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?”చర్యలు తీసుకోకపోతే “రాజకీయ ఆరోపణలే చేశారా?” “ఈగల్ టీం, పాత విచారణలు ఏమయ్యాయి?”ఇలాంటి ప్రశ్నలతో కేంద్ర మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇరికించడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి.
అకున్ సబర్వాల్‌కు మళ్లీ డ్రగ్స్ కేసుల బాధ్యతలు అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్న వేళ ఇప్పుడు అందరి దృష్టి సీఎం రేవంత్ రెడ్డిపై పడింది. గతంలో డ్రగ్స్ కేసుల్లో సేకరించిన ఆధారాలను తిరిగి పరిశీలిస్తారా? ఆ విచారణలో నిజంగా కేటీఆర్‌ను టార్గెట్ చేస్తారా? అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే, ఏ నిర్ణయం తీసుకున్నా దానికి భారీ రాజకీయ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించి, పాత డ్రగ్స్ కేసులను మళ్లీ తెరిస్తే, అది నేరుగా బీఆర్ఎస్‌తో పెద్ద రాజకీయ పోరాటానికి దారితీయొచ్చు. ముఖ్యంగా కేటీఆర్ పేరు అధికారిక విచారణల్లో వినిపిస్తే తెలంగాణ రాజకీయాల్లో భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉంది. మరోవైపు, ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, గతంలో చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వమే ఇరుకున పడే పరిస్థితి రావొచ్చు. దీంతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తీసుకునే తదుపరి అడుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది.
తెలంగాణలో డ్రగ్స్ కేసులు కొత్త విషయం కాదు. గతంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పేర్లు కూడా ఈ కేసుల్లో వినిపించాయి. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పడ్డాయి. విచారణలు జరిగాయి. ఒక దశలో అకున్ సబర్వాల్ పేరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో అనేక ప్రముఖులను విచారించడం, డిజిటల్ ఆధారాలు సేకరించడం వంటి చర్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు బండి సంజయ్ మళ్లీ అకున్ సబర్వాల్‌కు విచారణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. “గతంలో జరిగిన డ్రగ్స్ విచారణల్లో కొన్ని నిజాలు బయటకు రాలేదు. ఏదో దాచిపెట్టారు” అనే అనుమానాన్ని రాజకీయంగా హైలైట్ చేస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ "తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటారని", అందుకే ఆయనకు జుట్టు ఊడిపోయిందని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన బండి సంజయ్ అనుచరులు కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయ అద్దాలు పగులగొట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత ముదిర్చాయి. రాజకీయ ఆరోపణల స్థాయి దాటి వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లడంతో వాతావరణం వేడెక్కింది.
ఇది బీఆర్ఎస్ అనుసరిస్తున్న పాత వ్యూహానికే కొనసాగింపుగా కనిపిస్తోంది.అంటే… “డ్రగ్స్” వంటి సున్నితమైన అంశంలో నేరుగా రక్షణాత్మకంగా కాకుండా, ఆరోపణలను తిరిగి ప్రత్యర్థులపై మళ్లించడం. ఇలా చేయడం వల్ల అసలు ఆరోపణలపై ప్రజా చర్చ కంటే రాజకీయ ఘర్షణలపైనే దృష్టి కేంద్రీకృతమవుతుంది. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో “డ్రగ్స్” ఆరోపణలు ఇప్పుడు కేవలం నేర విచారణల అంశంగా కాకుండా, పెద్ద రాజకీయ ఆయుధంగా మారిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయంపైనే ఉంది. ఈసారి అయినా నిజంగా దర్యాప్తు ముందుకు వెళ్లి నిజాలు బయటపడతాయా? లేక ఎప్పట్లాగే ఆరోపణలు, బ్లడ్ టెస్టుల సవాళ్లు, రాజకీయ హీట్‌తోనే ఈ వివాదం మళ్లీ ముగిసిపోతుందా?

