కోహెడలో అంతర్జాతీయ మత్స్య ఎగుమతి కేంద్రం
x

కోహెడలో అంతర్జాతీయ మత్స్య ఎగుమతి కేంద్రం


తెలంగాణ మత్స్య రంగానికి మరింత గుర్తింపు తెస్తూ హైదరాబాద్ శివారులోని కోహెడలో దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన' కింద మంజూరైన ఈ మెగా ప్రాజెక్టును సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 47 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను భరిస్తాయి. దేశంలో ఇప్పటివరకు కేవలం సముద్రతీర ప్రాంతాల నుంచే చేపల ఎగుమతి కేంద్రాలు నడుస్తుండగా, మంచినీటి చేపల కోసం ఇలాంటి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

తెలంగాణ రాష్ట్రం మంచినీటి వనరుల ద్వారా చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన 2025వ సంవత్సరంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రూ. 8,000 కోట్ల విలువైన 4.20 లక్షల టన్నుల మంచినీటి చేపలు, అలాగే రూ. 1,000 కోట్ల విలువైన 15 వేల టన్నుల మంచినీటి రొయ్యల ఉత్పత్తి జరిగింది. అయితే, రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఈ చేపల్లో 42 శాతం మాత్రమే స్థానికంగా వినియోగం అవుతుండగా, కేవలం 6 శాతం మాత్రమే ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మిగిలిన నిల్వలు సరైన రవాణా, మార్కెటింగ్ సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారుతున్న తరుణంలో ఈ కొత్త కేంద్రం ఎంతో కీలకం కానుంది.

ఈ అంతర్జాతీయ కేంద్రం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర వైద్యారోగ్య, మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగించగా, వచ్చే 2027 ఆగస్టు నాటికి పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంగణంలో అత్యాధునిక శీతల గిడ్డంగులు , చేపల శుద్ధి యూనిట్లు, అంతర్జాతీయ ఎగుమతులకు తక్షణ అనుమతులిచ్చే కస్టమ్స్ క్లియరెన్స్ కేంద్రం, మత్స్యకారుల శిక్షణ కేంద్రంతో పాటు భారీ హోల్‌సేల్ మార్కెట్‌ను కూడా ఒకే ఛత్రం కింద ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read More
Next Story