
జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్ ....పాత సామాన్ల ఉచిత రవాణా!
హైదరాబాద్‌లో వర్షాకాలంలో నాలాలు, కాలువల్లో పాత పరుపులు, సోఫాలు, విరిగిన వస్తువులు వేయడం వల్ల వరదలు రావడం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక వినూత్న ఉచిత సేవను ప్రారంభించింది. నగర సుందరీకరణను పెంచడంతో పాటు వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా తెచ్చిన ఈ సదుపాయం గ్రేటర్ పరిధిలోని మొత్తం ఆరు జోన్లలో తక్షణమే అందుబాటులోకి వచ్చింది.
ఈ సేవలను ఉపయోగించుకోవడానికి జీహెచ్‌ఎంసీ ఒక సులువైన డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చింది. నగరవాసులు మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన అధికారిక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, అందులో వచ్చే వెబ్‌లింక్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం తమ ఇంట్లో ఉన్న పాత గృహోపకరణాలు లేదా ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు)కు సంబంధించిన కేటగిరీని ఎంచుకుని, గూగుల్ మ్యాప్ ద్వారా తమ ఇంటి లొకేషన్‌ను పిన్ చేసి ఆన్‌లైన్‌లో ఉచిత వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ పూర్తయిన తర్వాత, జీహెచ్‌ఎంసీతో ఒప్పందం ఉన్న ప్రైవేట్ వ్యర్థాల నిర్వహణ సంస్థ ప్రతినిధులు నేరుగా మీ ఇంటికే వస్తారు. వాహనం వచ్చే రోజు, సమయం వివరాలను ముందే ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా యజమానులకు తెలియజేస్తారు. వారు ఎలాంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా ఆ వ్యర్థాలను సేకరించి, రీసైక్లింగ్ కేంద్రాలకు తరలిస్తారు. నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు కోరుతున్నారు.

