
ఎన్నికల ప్రచారంలో కనిమొళి
ఎంజీఆర్, విజయ్ కాంత్ లాంటి ప్రభావం విజయ్ కు లేదు?
సులువుగా 200 స్థానాలు గెలుస్తామన్నా కనిమొళి
ప్రమీలా కృష్ణన్
రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు సీఎం స్టాలిన్ చెప్పినట్లుగా ఢిల్లీకి- తమిళనాడు మధ్యే అని డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి కరుణానిధి స్పష్టం చేశారు. డీఎంకే అభ్యర్థులకు చేస్తున్న ప్రచారంలో ఆమె సమాఖ్య హక్కులు, గుర్తింపు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
తన ప్రచార సమయంలో 'ది ఫెడరల్'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, డీలిమిటేషన్, హిందీ అమలు వంటి ఆందోళనలు తమిళనాడులో ఓటర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే కీలక అంశాలని ఆమె పేర్కొన్నారు. టీవీకే నాయకుడు విజయ్ ప్రభావం ఎన్నికలలో తక్కువగా ఉందని ఆమె పేర్కొన్నారు. విజయ్ ప్రారంభించిన పార్టీని ఎంజీఆర్ తో పోల్చలేమని అన్నారు. ఎంజీఆర్ కు పార్టీ ప్రారంభం ముందే బలమైన రాజకీయ పునాది ఉందని చెప్పారు.
పార్టీలో తన పాత్ర, ఉదయనిధి స్టాలిన్ ఎదుగుదలపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ, తాను పార్టీలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నానని, రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా ప్రచారం కొనసాగిస్తున్నందున పార్టీ నాయకత్వం తన పాత్రకు విలువ ఇస్తుందని కనిమొళి 'ది ఫెడరల్'తో అన్నారు.
మీ ఎన్నికలలో క్షేత్రస్థాయిలో స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా మీ పార్టీ నాయకుడు ఎం.కె. స్టాలిన్ 200కి పైగా సీట్లు గెలుస్తామని ప్రకటిస్తున్నాడు. ఈ నమ్మకం ఎలా వచ్చింది?
ఈ నమ్మకం ప్రజల నుంచి వస్తోంది. మా పథకాలు వారికి చేరాయి. మా పాలనపై మేము గర్వపడుతున్నాము. ఈ ఆశావాదానికి అదే పునాది.
మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు నెరవేరాయని ఓటర్లు భావిస్తున్నారా?
అవును భావిస్తున్నాము. మా ప్రచారాలలో ఇది తెలుస్తోంది. మేము సాధించిన విజయాల గురించి మాట్లాడుతుంటే ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఇప్పుడు మేము చేస్తున్న వాగ్దానాల గురించి కూడా నమ్మకం పెంచింది. చాలా చోట్ల, మేనిఫెస్టోలో పేర్కొన్న కూపన్ పథకం గురించి నేను మాట్లాడాలని ఎంతో మంది మహిళలు ఆశిస్తున్నారు.
2026 ఎన్నికల కోసం మేనిఫెస్టోను రూపొందించిన కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు. మేనిఫెస్టోను రూపొందించే పని చాలా సవాలుతో కూడుకున్నదని మీరు పేర్కొన్నారు. దాని గురించి ఇంకొంచం వివరించండి?
అవును, అది ఒక సవాలే. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు విస్తృతంగా చేరువై, వారి ఇళ్ల వద్దకే రేషన్, మందులు, విద్యను అందించింది. కాబట్టి, కొత్త పథకాలను గుర్తించడం అంత సులభం కాదు. కానీ మేము ప్రజలను నేరుగా సంప్రదించి, వారి ఆలోచనలను విని, వాటిని మేనిఫెస్టోలో పొందుపరచడం ద్వారా దీనిని పరిష్కరించాము.
డీఎంకే నాయకుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాను చేసిన దాదాపు అన్ని వాగ్దానాలను నెరవేర్చారు. కాబట్టి, కొత్త పథకాలతో మేనిఫెస్టోను రూపొందించడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది.
గత ఎన్నికలలో, ఎంజీఆర్, విజయకాంత్ వంటి నాయకులు యువ ఓటర్లను ఆకర్షించారు. 1977లో ఎంజీఆర్ గెలిచినప్పుడు, 2006లో విజయకాంత్ కొత్త పార్టీని ప్రారంభించినప్పుడు, వారిద్దరూ చాలా మంది యువ ఓటర్లను ఆకర్షించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ (టీవీకే) కూడా అలాంటి ప్రభావాన్ని చూపగలరని మీరు భావిస్తున్నారా?
ఎంజీఆర్‌ను మరెవరితోనూ పోల్చలేము. ఆయనకు బలమైన రాజకీయ నేపథ్యం, లోతైన సంబంధాలతో కేడర్ బేస్ ఉన్నాయి. విజయకాంత్‌కు కూడా కొంత అనుబంధం ఉండేది. కానీ అదే స్థాయిలో కాదు. వారిద్దరికీ రాజకీయ అవగాహన ఉన్న అభిమాన గణం సభ్యులు ఉండేవారు.
ఇక టీవీకే విషయానికొస్తే, ఆ పార్టీ దేనికి నిలుస్తుందో అస్పష్టంగా ఉంది. నేను రాష్ట్రమంతా పర్యటించాను. కానీ బలమైన క్షేత్రస్థాయి కార్యకలాపాలను చూడలేదు. టీవీకే అభ్యర్థులు విజయ్ హోలోగ్రామ్‌లను ఉపయోగించి ప్రచారం చేయడం చూడటానికి ఆసక్తికరంగా ఉంది. కానీ ప్రజలు అభ్యర్థులను, నాయకులను క్షేత్రస్థాయిలో చూడాలనుకుంటున్నారు.
మీరు టీవీకేను డీఎంకేకు తీవ్రమైన ముప్పుగా చూస్తున్నారా? 2026 ఎన్నికలు కేవలం డీఎంకే, టీవీకేల మధ్యే పోటీ అని టీవీకే నాయకుడు విజయ్ బహిరంగ సభల్లో చెబుతూ వస్తున్నారు. ?
ఎన్నికల బరిలో ఉన్న ఏ పార్టీ అయినా తమ ఉనికిని నిలుపుకోవడానికి డీఎంకేను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటుంది. అది రాజకీయాల్లో భాగం. ఆయన డీఎంకేను విమర్శించడం ద్వారా తన పార్టీని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు. మా పార్టీ టీవీకే లాంటి ఎన్నో రాజకీయ పార్టీలను చూసింది. కాబట్టి ఈ ప్రకటనల గురించి మేము పట్టించుకోము.
మీ పార్టీ మహిళలకు 18 సీట్లు కేటాయించింది. ఇది సరిపోతుందని మీరు భావిస్తున్నారా?
గతంతో పోలిస్తే ఇది చాలా మెరుగుదలే. కానీ మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు భవిష్యత్తులో మెరుగైన ప్రాతినిధ్యాన్ని కల్పించగలదు. కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో బీజేపీ ముడిపెట్టిన విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.
మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి. దాని గురించి ఆలోచించారా? మీకు టికెట్ నిరాకరించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి?
నేను పోటీ చేయాలని కొందరు కోరుకున్నారు. కానీ పార్టీ నిర్ణయమే సర్వోన్నతమైనది. ఏ వ్యక్తి కన్నా పార్టీ గొప్పది. నాయకుడి నిర్ణయమే అంతిమమైనది, అత్యంత ముఖ్యమైనది.
క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వాములు ఎంతవరకు సమన్వయం చేసుకుంటున్నారు? కూటమిలో, ముఖ్యంగా డీఎంకే - కాంగ్రెస్ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా?
ఇది చాలా కాలంగా ఉన్న కూటమి, మేం ఎన్నో ఎన్నికల్లో కలిసి పనిచేశాం. నాకు తెలిసినంతవరకు, పెద్ద సమస్యలేమీ లేవు. మా కూటమి భాగస్వాములందరూ చక్కగా సమన్వయం చేసుకుంటూ ఏకతాటిపై మాట్లాడుతున్నారు. ఎలాంటి విభేదాలు లేవు.
మీ తండ్రి కళైజ్ఞర్ కరుణానిధి ప్రచారాలను దగ్గరగా గమనించారు కదా, ఆయన శైలిని మీరు ఉద్దేశపూర్వకంగా అనుసరిస్తున్నారా?
ఉద్దేశపూర్వకంగా అనుసరించడం లేదు. కానీ ఆయన్ని గమనించడం ద్వారా కొన్ని అంశాలను నేను గ్రహించి ఉండవచ్చు. ఆయన ప్రజలతో గాఢంగా మమేకమయ్యేవారు. ఆ విషయాన్ని మేమందరం ఆయన నుంచే నేర్చుకున్నాం. నేను సోషల్ మీడియాలో ఆయన ప్రసంగాలను చూస్తుంటాను. ఆయన చెప్పిన చాలా విషయాలు ఈనాటికీ సందర్భోచితంగా ఉన్నాయి. ఆయనకు ప్రజలతో మంచి సంబంధాలు ఉండేవి. సామాన్య ప్రజలతో సులభంగా మమేకం కాగలిగేవారు.
మేనిఫెస్టోలోని రూ. 8,000 కూపన్ పథకం గురించి మాకు చెప్పండి. అది ఎలా వచ్చింది?
ప్రజలకు రకరకాల అంచనాలు ఉంటాయి. ఈ కూపన్లను నిరుపేద కుటుంబాలు ఉపయోగించుకోవాలని మేము కోరుకున్నాము. వారు కూపన్‌ను ఉపయోగించడమే కాకుండా, తాము ఏమి కొనాలనుకుంటున్నారో కూడా ఎంచుకోగలగాలి. ఇంట్లో మహిళల శ్రమను తగ్గించడానికి పెట్టుబడి పెట్టడానికి చాలా కుటుంబాలు సిద్ధంగా లేవు. కాబట్టి మేము ఆ మహిళలకు సహాయపడే ఏదైనా ఇవ్వాలనుకున్నాము.
దానికి వివిధ సూచనలు వచ్చాయి. వారు కోరుకున్నది ఎంచుకోవడానికి అనుమతించడం ఉత్తమ మార్గం. వారి అంతులేని పని గంటలను తగ్గించుకోవడానికి వారు ఏది ఎంచుకుంటే, దాన్నే మేము ఇవ్వాలనుకున్నాము.
ఒక కవిగా, ఈ రోజుల్లో మీ సమయాన్నంతా రాజకీయాలకే కేటాయిస్తున్నందున, మీరు రాయడాన్ని కోల్పోతున్నారా?
అవును కోల్పోతున్నాను. నేను దానిని చాలా మిస్ అవుతున్నాను. నేను తిరిగి వెళ్ళగలనని ఆశిస్తున్నాను. ఇది సమయం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారు ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఎప్పుడూ రాసేవారు. నాకు సరైన మానసిక స్థితి కలిగినప్పుడు తిరిగి రచనలు చేయాలని ఆశిస్తున్నాను.
గతంలో, నేను గాయని బొంబాయి జయశ్రీతో కలిసి పని చేసి, శిలప్పతికారంపై ఒక సాహిత్య రచనను రూపొందించాను. శిలప్పతికారం మరో అనుసరణ కోసం నన్ను సంప్రదించారు. నేను దానిని చేపట్టవచ్చు లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నించవచ్చు.
నేటి యువతలో హిందీ రుద్దకాన్ని వ్యతిరేకించడం, ద్విభాషా విధానం వంటి ప్రచార అంశాలు ఎంతవరకు ప్రాసంగికంగా ఉన్నాయి?
చాలా ప్రాసంగికంగా ఉన్నాయి. భాష అనేది గుర్తింపుతో గాఢంగా ముడిపడి ఉంటుంది. మరో భాషను రుద్దే ఏ ప్రయత్నాన్నైనా ప్రతిఘటిస్తారు. యువత, ముఖ్యంగా సోషల్ మీడియాలో, ఊహించిన దానికంటే కూడా బలంగా స్పందిస్తున్నారు. ఈ భావన తమిళనాడు దాటి కూడా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరీక్షలు కేవలం హిందీ, ఇంగ్లీషులో మాత్రమే నిర్వహించినప్పుడల్లా మేము మా గళం విప్పుతాము.
ఎందుకంటే హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని విద్యార్థులకు అనవసరమైన ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడు, తమిళనాడును చూస్తే,ఇతర రాష్ట్రాలు కూడా తమ మాతృభాష ప్రాముఖ్యతను, తమ హక్కుల కోసం పోరాడటాన్ని గ్రహించాయి.
ఎన్నికలు రోజురోజుకీ ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారా?
అవును, చేస్తుంది. ఎన్నికలు ఖరీదైనవిగా మారినప్పుడు, అది భాగస్వామ్యాన్ని కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం చేస్తుంది. అది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. అది తప్పక మారాలి.
మీ పార్టీలో మీకు మరింత స్థానం దక్కాలని కొందరు అంటున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఎదుగుదలతో మీకు ముప్పుగా అనిపిస్తోందా?
నాకు అలా అనిపించడం లేదు. నేను చేసే పని, నాకు లభించే స్థానం అన్నీ నాయకత్వంపైనే ఆధారపడి ఉంటాయి. వారి మద్దతుతోనే నేను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాను. నా సోదరుడైన ఎం.కె. స్టాలిన్‌తో, పార్టీ నాయకత్వంతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను పూర్తి నిబద్ధతతో పనిచేస్తాను. నా కష్టానికి ఆయన విలువ ఇస్తారు.
Next Story

