
తెలంగాణ ‘రైతు కటాక్షం’ కోసం పార్టీల పాట్లు
రైతు సమస్యలు నిజంగా పరిష్కారం అవుతాయా? లేక కేవలం రాజకీయ ప్రదర్శనగానే మిగిలిపోతాయా?
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు తామే రైతుకు నిజమైన మిత్రులమని చాటుకోవడానికి పోటీపడుతున్నాయి. ఈ పోటీలో వ్యవసాయ రంగం రాజకీయ యుద్ధభూమిగా మారింది.
ఒక వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ‘రైతు సంగ్రామ సదస్సు’లతో రైతు అసంతృప్తిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తమ పాలనలో చేసిన పనులను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. సభల ద్వారా భావోద్వేగాన్ని రేకెత్తిస్తూ రైతు మద్దతు సాధించాలనుకుంటోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, రైతు సంగ్రామ సదస్సులు నిర్వహిస్తోంది. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు? రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీ ఏమైంది? కౌలు రైతులకు ఎకరానికి రూ.14వేలు వస్తుందా? పంటబీమా పథకం ఎక్కడకు పోయింది? అసైన్డ్ భూములకు పట్టాలు ఎప్పుడిస్తారు. కాంగ్రెస్ వాళ్ల కాలర్ పట్టుకుని నిలదీయండంటూ కేటీఆర్ రైతులను వరంగల్ సభలో పిలుపునిచ్చారు.
మరోవైపు బీజేపీ వరిసేకరణ కేంద్రాల వద్ద ప్రత్యక్ష ఆందోళన చేస్తోంది. గ్రౌండ్ లెవెల్‌లోనే సమస్యలను ఎత్తిచూపడం, అధికారులను ప్రశ్నించడం ద్వారా తక్షణ స్పందనను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ బీజేపీ రైతు సమస్యలపై రణభేరీ మోగిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండీ సంజయ్ స్వయంగా ఈ కేంద్రాలను సందర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మొత్తం సేకరణ వ్యవస్థ 'కుప్పకూలిందని', దీంతో రైతులు తమ పంటలతోనే చిక్కుకుపోయారని వారు ఆరోపిస్తున్నారు.
ఇక అధికార కాంగ్రెస్ ‘రైతు వారోత్సవాలు’ నిర్వహిస్తూ రైతులతో ప్రత్యక్ష సంబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అధికార యంత్రాంగం గ్రామాల వరకూ వెళ్లి సమస్యలు వింటోంది. పథకాల గురించి వివరిస్తూ రాజకీయంగా బలాన్ని పెంచుకుంటోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టడానికి ‘రైతు వారోత్సవాలు’ నిర్వహిస్తూ రేవంత్ సర్కార్ తన విజయాలను ప్రచారం చేస్తోంది.
రైతు డిక్లరేషన్ ప్రకారం 25 లక్షల మంది రైతులకు ఒకేసారి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి రికార్డు సృష్టించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.12,000 సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పేందుకు, రైతులకు మరింత దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో రైతు హాట్‌టాపిక్‌గా మారాడు. పంట ధరలు, విత్తనాలు, ఎరువుల సరఫరా, వర్షాభావం వంటి అంశాలు రైతు జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ప్రతి రాజకీయ పార్టీ కూడా రైతు సమస్యల చుట్టూనే తమ వ్యూహాలను రూపొందిస్తోంది.మూడు పార్టీలూ రైతు సమస్యల చుట్టూనే తిరుగుతున్నా, వారి విధానాలు వేర్వేరు. ఒకటి కార్యక్రమాలు, రెండోది సభలు, మూడోది ఆందోళనలు. కానీ రైతు దృష్టిలో ఒకటే ప్రశ్న? ఈ పోటీ ప్రదర్శనలతో రైతు సమస్యలు నిజంగా పరిష్కారం అవుతాయా? లేక కేవలం రాజకీయ ప్రదర్శనగానే మిగిలిపోతాయా? లేదా మీడియా దృష్టి కోసం మాత్రమే ఈ ప్రచారం జరుగుతోందా? అన్నది ఉత్కంఠగా మారింది.

