‘కొంగునాడు’ కింగ్ ఎవరూ? డీఎంకేనా.. అన్నాడీఎంకేనా?
x

‘కొంగునాడు’ కింగ్ ఎవరూ? డీఎంకేనా.. అన్నాడీఎంకేనా?

క్రమంగా పట్టును పెంచుకుంటున్న డీఎంకే, యువతను ఆకర్షిస్తున్న విజయ్


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో పారిశ్రామిక కేంద్రమైన కొంగునాడు పై అన్ని పార్టీలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఇక్కడ ఉన్న అన్ని స్థానాలను స్వీప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఒకప్పుడూ కొంగునాడు ప్రాంతంలో విపక్ష అన్నాడీఎంకే పార్టీ బలంగా ఉండేది. దాదాపుగా ఇక్కడ ఉన్న అన్ని స్థానాలు దాని ఖాతాలోనే చేరేవి. అయితే డీఎంకే ఇక్కడ క్రమంగా దాని పట్టును పెంచుకుంటూ వస్తుండగా, కొత్తగా పార్టీ పెట్టిన దళపతి విజయ్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ కనపరుస్తున్నాడు. బీజేపీ కూడా తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొంగునాడు ఎవరిపక్షం నిలవబోతోంది. ఈ ప్రాంత భవిష్యత్ పై లోతైన విశ్లేషణ మీ కోసం..


కొంగునాడు ప్రాంతమంటే ఏంటీ?
కొంగునాడు అని కూడా పిలువబడే కొంగు ప్రాంతం, కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, నామక్కల్, సేలంతో సహా తమిళనాడులోని పశ్చిమ జిల్లాలతో ఏర్పడింది. ఈ ప్రాంతం చాలా కాలంగా, ముఖ్యంగా వస్త్ర, ఇంజనీరింగ్, చిన్న తరహా పరిశ్రమలలో ఒక పారిశ్రామిక శక్తి కేంద్రంగా ఉంది. ఇక్కడ జనాభాలో సుమారు 30-40 శాతం ఉన్న కొంగు వెల్లాలర్ గౌండర్ వర్గమే నివసిస్తోంది. వీరిదే ఇక్కడ ఆధిపత్యం. వీరు చారిత్రాత్మకంగా AIADMK వైపు మొగ్గు చూపుతుంది. ఈ ప్రాంతంలో కుల ఆధారిత రాజకీయ పొత్తులు కూడా గణనీయంగా ఉన్నాయి. వీటిని AIADMK తన పట్టును నిలుపుకోవడానికి చాకచక్యంగా ఉపయోగించుకుంది.
డీఎంకే ప్రభావం క్రమంగా..
దశాబ్దాలుగా, కొంగు నాడు ప్రాంతం AIADMKకు ఒక కంచుకోటగా ఉండేది. అయితే, ఇటీవలి అన్నాడీఎంకేకు ఇక్కడ నుంచి చిక్కులు ఎదురు కావచ్చనే సంకేతాలను ఇస్తున్నాయి. మహిళా ఓటర్లకు కాలి గజ్జెలు పంపిణీ చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టు సాధించడం, నగదు, బహుమతుల రాజకీయ వాగ్దానాలతో DMK కొంగునాడు చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రాజకీయ పరిశీలకుడు సెంథిల్ రాజగోపాల్ ప్రకారం, “ఇకపై కులం ముఖ్యం కాదు. డబ్బు, కాంట్రాక్టర్లే ​​ఎన్నికలను నిర్ణయిస్తారు.” అని విశ్లేషించారు. ఈ వ్యూహం ఇప్పటికే ఫలితాలనిచ్చింది, ఇటీవలి సంవత్సరాలలో డీఎంకే గణనీయంగా బలం ఫుంజుకుంది. సంప్రదాయ కుల ఆధారిత రాజకీయాలకు అతీతంగా ఆకట్టుకోవడానికి పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
బీజేపీ ఎదుగుదల, ఏఐఏడీఎంకేపై ప్రభావం...
కొంగునాడులో బీజేపీ ఎదుగుదల కూడా ఏఐఏడీఎంకే సంప్రదాయ పునాదిని బలహీనపరుస్తున్న మరో అంశం. బీజేపీ నాయకుడు కె. అన్నామలైకి, ముఖ్యంగా యువతలో ఉన్న ప్రజాదరణ, ఏఐఏడీఎంకే ఓట్లను దూరం చేసింది. వాస్తవానికి, ఇటీవలి సంవత్సరాలలో ఏఐఏడీఎంకే సంప్రదాయ ఓట్ల వాటాలో 10-15 శాతం బీజేపీ వైపు మళ్లిందని చాలా మంది పరిశీలకులు భావిస్తున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ వేలాయుతం ప్రకారం, "కోయంబత్తూరు బాంబు పేలుళ్ల తర్వాత, మహిళలు కమలం గుర్తుకు భారీగా ఓటు వేశారు. ఆ పేలుళ్లు ఇక్కడి రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. అన్నామలై యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. బీజేపీకి వచ్చిన మొత్తం ఓట్లలో 50% ఏఐఏడీఎంకే నుంచి, 50% కొంగునాడు గౌండర్ సంఘాల నుండి వచ్చాయి." ఇప్పుడు ఏఐఏడీఎంకే బీజేపీ మద్దతుపై ఎక్కువగా ఆధారపడటంతో, కొంగుపై దాని పట్టు బలహీనపడుతోంది. ఇది డీఎంకే వంటి కొత్త రాజకీయ శక్తులకు చోటు కల్పిస్తోంది.
టీవీకే అధినేత విజయ్ ప్రభావం...
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ఇక్కడ క్రమంగా తన రాజకీయ ప్రభావాన్నిక్రమంగా పెంచుకుంటున్నాడు. కుల, మత భేదాలకు అతీతంగా ఉన్న అతని భారీ అభిమానగణం, రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. చాలా మంది విశ్లేషకులు, విజయ్ కొంగులో 25% వరకు ఓట్లు సాధిస్తాడని, ఏఐఏడీఎంకే, డీఎంకే రెండింటికి ఇక్కడ గండికొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వేలాయుతం ప్రకారం.. "కొంగు ప్రాంతంలో విజయ్ ప్రభంజనం చాలా బలంగా ఉండబోతోంది. కుల, మత భేదం లేకుండా ఆయనకు ఓట్లు వస్తాయి. ఎంజీఆర్, జయలలితలకు భారీ విజయాన్ని అందించిన అదే కొంగు ప్రాంతం ఇప్పుడు విజయ్‌కు అనుకూలంగా ఉంది." విజయ్ సాంప్రదాయ కుల రాజకీయాలను పక్కనపెట్టి, ఆ ప్రాంత యువతను ఆకట్టుకుంటుండటంతో, ఆయన ప్రజాదరణ 2026 ఎన్నికలలో ఆటను మార్చే అంశం కావచ్చు.
డీఎంకే నగదు వ్యూహం..
కొంగు ప్రాంతంలో గెలుపొందడానికి డీఎంకే అనుసరిస్తున్న వ్యూహంలో నగదు, బహుమతుల రాజకీయాలను దూకుడుగా ఉపయోగించడం ఒక కీలక అంశంగా మారింది. ఉచిత బస్సు ప్రయాణాలు, రాయితీతో కూడిన అల్పాహార పథకాలు, మహిళలకు ఆర్థిక సాయం వంటి తమ బలమైన సంక్షేమ పథకాలను, ఓటర్లకు ఇచ్చిన హామీలను పార్టీ ఉపయోగించుకుంటోంది.
ఈ చర్యలు రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలకు గురైనప్పటికీ, ఓటర్ల మద్దతు కూడగట్టడంలో ఇవి ప్రభావవంతంగా ఉన్నాయి. ముఖ్యంగా కుల ఆధారిత రాజకీయాలకు మునుపటి పట్టు లేని ప్రాంతాలలో వీటి శక్తి కనిపిస్తోంది. రచయిత మురుగవేల్ ప్రకారం.. “జయలలిత చాకచక్యంగా ఏ బలమైన కొంగు కుల సంస్థలు పెరగకుండా అడ్డుకున్నారు. తద్వారా కొంగు వెల్లాలర్ గౌండర్లను ఏఐఏడీఎంకేకు ముఖచిత్రంగా మార్చారు.” డీఎంకే సంక్షేమంపై దృష్టి సారించడం, ఆర్థిక సహాయంపై వాగ్దానాలు చేయడంతో, ఈ ప్రాంతంలో ఏఐఏడీఎంకేకున్న దీర్ఘకాలిక ఆధిపత్యం ఇకపై సరిపోకపోవచ్చు.
కొంగు నాడు లో ఎవరూ నిలదొక్కుకుంటారో..
ఒకప్పుడు ఏఐఏడీఎంకేకు కంచుకోటగా ఉన్న కొంగు ప్రాంతం ఇప్పుడు అలా లేదు. డీఎంకే ధన రాజకీయాలు, బీజేపీ హిందుత్వ ఆకర్షణ పెరగడం, విజయ్ స్టార్ పవర్ అధికమవ్వడంతో, ఏఐఏడీఎంకే గత కొన్నేళ్లుగా తన అతిపెద్ద సవాలును ఎదుర్కొంటోంది.
రాజకీయ సమీకరణాలు మారుతున్న కొద్దీ, ఈ ప్రాంతం పూర్తిగా డీఎంకే వైపు మొగ్గు చూపుతుందా, లేక బీజేపీ మద్దతుతో ఏఐఏడీఎంకే కోల్పోయిన పట్టును తిరిగి దక్కించుకుంటుందా అనేది వేచి చూడాలి. 2026 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, కొంగు ఓటర్లు మునుపెన్నడూ లేనంత కీలకంగా మారనున్నారు.
వారి అభిమానాన్ని గెలుచుకోవడానికి రాజకీయ పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కొంగు రాజకీయాల భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఒక్క విషయం మాత్రం స్పష్టం.. మార్పు రాబోతోంది.
Read More
Next Story