
కవిత 'టిఆర్ఎస్' కు బ్రేక్ పడినట్టేనా?
కల్వకుంట్ల కవిత 'టిఆర్ ఎస్ 'పార్టీ పేరుకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పేరు మీద అభ్యంతరాలు రావడంతో మూడు వేరే పేర్లు ప్రతిపాదిస్తూ పంపించాలని స్పష్టం చేసింది.అయితే కవిత మాత్రం ,పేరు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ,అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు.
కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ స్థాపన, దానికి నిర్ణయించిన పేరుకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన కవిత, ఇటీవల ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అనే నూతన పార్టీని ప్రకటించి, దానికి ‘TRS’ అనే సంక్షిప్త నామాన్ని ఎంచుకున్నారు. గతంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ‘BRS’గా మార్చిన నేపథ్యంలో, కవిత మళ్లీ అదే ‘TRS’ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తూ కొత్త పార్టీని ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, ఈ పేరు రిజిస్ట్రేషన్ విషయంలో కల్వకుంట్ల కవితకు భారత ఎన్నికల సంఘం నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాత పార్టీలను పోలి ఉండేలా లేదా ఓటర్లను గందరగోళానికి గురిచేసేలా ఉండే పేర్లు, అక్షరాలను కొత్త పార్టీలకు కేటాయించకూడదనే నిబంధన ఈసీకి ఉంది. కవిత ప్రతిపాదించిన 'TRS' పేరుపై, అది తెలంగాణ ఉద్యమ చరిత్రతోనూ, కేసీఆర్ గుర్తింపుతోనూ ముడిపడి ఉన్నందున ఓటర్లు భ్రమపడే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘానికి ఏకంగా 700కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఈ పేరు కేటాయింపుపై ఈసీ తీవ్రమైన స్క్రూటినీ (పరిశీలన) చేపట్టింది.

